కనురెప్పలపై చుండ్రు ఉంది.. శాశ్వత పరిష్కారం ఏంటి?
నా వయసు 35 సంవత్సరాలు. నా కనురెప్పలపై చుండ్రు ఉంది. ఇది తగ్గే మార్గం ఉందా? ఎన్నో మందులు వాడాను. కానీ, చుండ్రు తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయగలరు....
నా వయసు 35 సంవత్సరాలు. నా కనురెప్పలపై చుండ్రు ఉంది. ఇది తగ్గే మార్గం ఉందా? ఎన్నో మందులు వాడాను. కానీ, చుండ్రు తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. దీనికి శాశ్వత పరిష్కారం ఉంటే తెలియజేయగలరు. - ఓ సోదరి
జ. మీ సమస్యను సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారికి సాధారణంగా మాడుకి ఇన్‌ఫ్లమేషన్ వచ్చి దాని పైన ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది శరీరంలో వెంట్రుకలు ఉన్న ప్రతిచోట వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువగా మాడు పైనే వస్తుంది. కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు కనురెప్పలపై కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సెబోరిక్ డెర్మటైటిస్ వల్ల బ్లెఫరైటిస్ అనే సమస్య వస్తుంది. అంటే కనురెప్పలు, కనుబొమ్మల్లో అలర్జీ అన్నమాట.
ఈ సమస్య ఉన్నప్పుడు ముందుగా సెబోరిక్ డెర్మటైటిస్‌ను తగ్గించుకోవడానికి చికిత్స తీసుకోవాలి. ఇందుకోసం దానికి తగిన యాంటీ డాండ్రఫ్ షాంపూలు లేదా కీటోకొనజోల్ షాంపూలు ఉపయోగిస్తుండాలి. ఈ షాంపూలను వారానికి రెండుసార్లు ఉపయోగించాలి. వీటికి తోడు కీటోకొనజోల్ ట్యాబ్లెట్స్‌ను కూడా వేసుకుంటూ క్రమం తప్పకుండా హెయిర్ వాష్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ మోతాదులో ఉండే స్టెరాయిడ్ లోషన్స్ ఇస్తుంటారు. వీటిని రెండు నుంచి మూడు రోజులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టెరాయిడ్ లోషన్స్‌ని ఇయర్ బడ్‌పై పెట్టుకుని కనురెప్పలపై అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బేబీ షాంపూలలో కెమికల్స్ తక్కువగా ఉంటాయి. ఈ షాంపూలతో స్నానం చేసినప్పుడు కనురెప్పలను కూడా శుభ్రం చేసుకోవాలి. కీటోకొనజోల్ షాంపూలను కేవలం మాడుకు మాత్రమే ఉపయోగించాలి. వీటిని కనురెప్పలకు ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే ఇరిటేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. యాంటీ ఫంగల్ ట్యాబ్లెట్స్‌తో పాటు బేబీ షాంపూలు, యాంటీ ఇన్‌ఫ్లమేషన్ లోషన్లు అప్లై చేసుకుని పరిశుభ్రత పాటిస్తే ఈ సెబోరిక్ డెర్మటైటిస్ నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే సెబోరిక్ డెర్మటైటిస్ అనేది ఒక టెండెన్సీ. మీ శరీర తత్వాన్ని బట్టి మీకు ఒక్కసారి సెబోరిక్ డెర్మటైటిస్ వస్తే మళ్లీ వస్తూనే ఉంటుంది. ఒకవేళ పై జాగ్రత్తలు తీసుకుంటే దీనిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
అయితే ఇదంతా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. పైన పేర్కొన్న లోషన్లు, షాంపూలు, ట్యాబ్లెట్స్.. ఇవన్నీ నిపుణుల సలహాతో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మీ అంతట మీరు స్వయంగా వాడకూడదు. వ్యక్తిగతంగా మీ పరిస్థితిని చూసిన తర్వాత మాత్రమే వైద్య నిపుణులు తగిన చికిత్సను సూచించగలుగుతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.