దిగాలుగా ఉంటోంది.. అడిగితే చెప్పదు.. ఏం చేయాలి?
మా అమ్మాయి వయసు 27 ఏళ్లు. రెండేళ్ల క్రితం పెళ్లి చేశాం. పిల్లలు లేరు. ఈ మధ్య దిగాలుగా కనబడుతోంది. మా ఇంటికి రావడం లేదు. ఫోన్ చేసినా సరిగా మాట్లాడడం లేదు.
మా అమ్మాయి వయసు 27 ఏళ్లు. రెండేళ్ల క్రితం పెళ్లి చేశాం. పిల్లలు లేరు. ఈ మధ్య దిగాలుగా కనబడుతోంది. మా ఇంటికి రావడం లేదు. ఫోన్ చేసినా సరిగా మాట్లాడడం లేదు. బరువు కూడా చాలా తగ్గింది. ‘ఏమైంది’ అనడిగితే సమాధానం చెప్పదు. అల్లుడిని అడిగితే ‘నాకు తెలియదు.. తననే అడగండి’ అంటున్నాడు. మాకు అసలు విషయం ఏంటో తెలియక భయపడుతున్నాం. తన మనసులో మాట ఎలా తెలుసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. మీ అమ్మాయికి రెండేళ్ల క్రితం పెళ్లైందని అంటున్నారు. గత కొంతకాలంగా దిగాలుగా ఉంటోందని చెబుతున్నారు. అయితే తన సమస్యను మాత్రం ఎవరితోనూ పంచుకోవడం లేదని అంటున్నారు. ఒక భర్తగా మీ అల్లుడికైనా సమస్య గురించి తెలిసుండాలి. కానీ, అతను కూడా మీ అమ్మాయినే అడగండని అంటున్నాడు. బహుశా అతనికి చెప్పడానికి ఇష్టం లేకపోవచ్చు. లేదా అతనికి కూడా తెలియకపోవచ్చు. కాబట్టి, ఇలాంటి పరిస్థితిలో మీరే ఒక అంచనాకు వచ్చే అవకాశాలున్నాయేమో పరిశీలించండి. ఆర్థిక పరమైన సమస్యలు, కెరియర్ సమస్యలు, దంపతుల మధ్య సమస్యలు ఇలా ఏవైనా కారణం కావచ్చు. పెళ్లై రెండేళ్లైనా పిల్లలు లేరంటున్నారు. కాబట్టి దాని గురించి కూడా బాధపడే అవకాశం ఉంటుంది. అయితే సమస్య ఏదైనా మీరున్నారన్న భరోసా ఆమెకు ఇవ్వండి. ఒక తల్లిగా మీతో అన్ని విషయాలు పంచుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంటుంది. అయినా మీతో పంచుకోవడం లేదంటున్నారు. కాబట్టి, ఒకసారి తండ్రితో కానీ, తనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో కానీ అడిగించే ప్రయత్నం చేయండి. అంతేతప్ప తను ఏమీ చెప్పడం లేదని మీరు ఆందోళన చెందడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.
ఒకవేళ అప్పటికీ తన నుంచి సమాధానం లభించకపోతే ఒకసారి మానసిక నిపుణుల దగ్గరకు తీసుకెళ్లండి. వారు ఆమె సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే డాక్టర్ దగ్గరకు కూడా తీసుకెళ్లండి. ఏవైనా ఆరోగ్యపరమైన సమస్యలుంటే పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.