Updated : 20/01/2023 21:18 IST

పాపకు మొటిమలు తగ్గాలంటే ఏం చేయాలి?

మా పాప వయసు 16 సంవత్సరాలు. తనకు ముఖంపై మొటిమలు వస్తున్నాయి. వాటిని గిల్లడం వల్ల ముఖంపై గుంతల్లా ఏర్పడుతున్నాయి. డాక్టర్‌ని సంప్రదిస్తే క్రీమ్‌ ఇచ్చారు. ఎన్ని రోజులు వాడినా తగ్గడం లేదు. పాపకు మొటిమలు తగ్గాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీ పాపకు 16 సంవత్సరాలని చెప్పారు. సాధారణంగా యుక్త వయసులోకి వచ్చిన అమ్మాయిల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. హార్మోన్లలో వచ్చే మార్పులే ఇందుకు కారణం. ఇదే కాకుండా.. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, పరిశుభ్రత పాటించకపోవడం.. వంటి కొన్ని అలవాట్లు కూడా మొటిమలకు కారణమవుతుంటాయి. కాబట్టి ఇంట్లో తయారు చేసిన పోషకాహారం తీసుకోవడంతో పాటు పరిశుభ్రత పాటించడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

మొటిమలు వచ్చినప్పుడు మీ పాప వాటిని గిల్లుతుందని అంటున్నారు. ఇన్ఫెక్షన్‌ తగ్గే క్రమంలో మొటిమలను గిల్లినప్పుడు అక్కడ గుంతల్లా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ అలవాటును మాన్పించే ప్రయత్నం చేయండి. ముఖంపై బ్యాక్టీరియా చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. కొంతమంది చేతులను ఎక్కడ పడితే అక్కడి పెట్టి.. మళ్లీ అదే చేతులతో ముఖాన్ని తాకుతుంటారు. దీనివల్ల కూడా మొటిమలు వస్తుంటాయి. కాబట్టి చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖాన్ని పదే పదే తాకకుండా చూసుకోవాలి. ఇవన్నీ పాటించినా మొటిమలు తగ్గకపోతే చర్మవ్యాధి నిపుణుల్ని సంప్రదించడం మంచిది. క్రీమ్స్‌తో పాటు ఐసోటెట్రినాయిల్‌, ఓరల్‌ యాంటీ బయోటిక్స్‌.. వంటి మందులు సూచిస్తారు. వీటితో సమస్య తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని