Published : 26/02/2023 10:04 IST

ఆపకుండా ఏడుస్తుంటాడు.. ఎందుకిలా?

 

మా బాబు వయసు ఎనిమిది నెలలు. మామూలుగా బాగానే ఉంటాడు. కానీ, ఒక్కోసారి ఏడవడం మొదలుపెడితే అస్సలు ఆపడు. చాలాసేపు గుక్కపెట్టి ఏడుస్తుంటాడు. అలా ఎందుకు ఏడుస్తాడో అస్సలు అర్థం కాదు. ఏదైనా సమస్య వల్ల ఏడుస్తున్నాడా? ఇందుకోసం ఏవైనా టెస్ట్‌లు చేయించాలా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. సాధారణంగా పిల్లలకు ఏ బాధ వచ్చినా దానిని ఏడుపు రూపంలోనే వ్యక్తం చేస్తుంటారు. కాబట్టి పిల్లలు ఏడ్చిన ప్రతిసారీ ఏదో సమస్య ఉన్నట్టు కాదు. కానీ, దానికి గల కారణం తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. చాలామంది పిల్లలు ఆకలి వల్ల ఏడుస్తుంటారు. అలాగే కొంతమంది పోతపాలల్లో ఎక్కువ నీళ్లు కలుపుతుంటారు. దీనివల్ల కొద్ది సమయంలోనే మళ్లీ ఆకలి వేస్తుంటుంది. అందువల్ల కూడా ఏడిచే అవకాశం ఉంటుంది.

వీటికి తోడు పిల్లలు ఏడవడానికి మరికొన్ని కారణాలు ఉంటాయి. శరీరంలో ఏదైనా ప్రాంతంలో చర్మం ఒరుసుకుపోయినట్లు ఉండడం, బట్టలు బిగుతుగా వేయడం, ఎక్కువ చలి పెట్టినప్పుడు, ఉక్కపోతగా ఉన్నప్పుడు కూడా ఏడుస్తుంటారు. దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. అయితే శరీరంలో ఏదైనా ప్రాంతంలో నొప్పి వల్ల ఏడుస్తున్నట్లయితే ఆలోచించాలి. ఆ నొప్పి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలో గట్టిగా నొక్కడం వల్ల ఇంకా గట్టిగా ఏడుస్తుంటారు. ఆ భాగాన్ని పట్టుకోనివ్వకుండా తోసేస్తుంటారు. అప్పటికీ సమస్యను గుర్తించలేకపోతే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. వాళ్లు అన్నీ చెక్‌ చేసి ఏ కారణం లేదంటే కంగారు పడాల్సిన అవసరం లేదు.

ప్రత్యేకించి బాబు ఆహారం తీసుకోవడం, నిద్ర పోవడం, ఆడుకోవడం అన్నీ బాగానే ఉండి మధ్యలో అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లయితే కంగారు పడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా కారణం లేకుండా పదే పదే ఏడుస్తున్నట్లయితే కొన్ని పరీక్షలు చేయించడం మంచిది. కొంతమంది పిల్లలు కడుపులో మెలి తిప్పినట్లు ఉండడం, తలలో ఏమైనా ఇబ్బంది ఉండడం వల్ల కూడా ఏడుస్తుంటారు. కాబట్టి, వాటికి సంబంధించిన పరీక్షలు డాక్టర్‌ సలహా మేరకు చేయించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని