పెద్దవారు ఏయే వ్యాక్సిన్లు తీసుకోవాలి?

నమస్తే డాక్టర్‌.. సాధారణంగా పిల్లలకు మాత్రమే వ్యాక్సిన్లు ఇప్పిస్తుంటాం. అయితే పెద్దవారికి కూడా కొన్ని వ్యాక్సిన్లు ఉంటాయని విన్నాను. యుక్త వయసు నుంచి వృద్ధాప్యం వరకు ఏయే వ్యాక్సిన్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది...

Published : 19 May 2023 12:39 IST

నమస్తే డాక్టర్‌.. సాధారణంగా పిల్లలకు మాత్రమే వ్యాక్సిన్లు ఇప్పిస్తుంటాం. అయితే పెద్దవారికి కూడా కొన్ని వ్యాక్సిన్లు ఉంటాయని విన్నాను. యుక్త వయసు నుంచి వృద్ధాప్యం వరకు ఏయే వ్యాక్సిన్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి తెలియజేయగలరు. - ఓ సోదరి

జ. సహజంగా వ్యాక్సినేషన్‌ అనగానే చాలామంది చిన్నపిల్లలకు వేసేవి అనుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో పెద్దవారు కూడా వ్యాక్సిన్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటోంది. దీనినే ‘అడల్ట్‌ వ్యాక్సినేషన్’ అంటుంటారు.

సాధారణంగా చిన్నపిల్లలకు డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు వంటి సమస్యలు రాకుండా ఉండేందుకు DPT వ్యాక్సిన్ ఇస్తుంటారు. ఇదే వ్యాక్సిన్‌ను పెద్దవారికి కూడా ఇస్తుంటారు. దానిని Tdap అంటుంటారు. ఈ వ్యాక్సిన్‌ను 11 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు ఇప్పించాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ను ప్రతి పది సంవత్సరాలకు ఇస్తుంటారు.

గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ (Cervical cancer) హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వల్ల వస్తుంటుంది. ఈ వైరస్‌ను నివారించడానికి ‘హెచ్‌పీవీ వ్యాక్సిన్‌’ తీసుకోవచ్చు. ఇది కేవలం సర్వైకల్‌ క్యాన్సర్‌ను మాత్రమే కాకుండా వెజైనల్‌ క్యాన్సర్‌, వల్వర్‌ క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది. ఈ వ్యాక్సిన్‌ 9 నుంచి 45 సంవత్సరాల మహిళలు ఎవరైనా తీసుకోవచ్చు.

వర్షాకాలంలో వైరల్‌ ఇన్ఫెక్షన్లు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇందుకోసం వర్షాకాలం మొదట్లోనే ‘ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్‌’ తీసుకోవడం మంచిది. దీనినే ‘ఫ్లూ షాట్’ అని కూడా అంటారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

న్యుమోకోకస్ అనే బ్యాక్టీరయా వల్ల న్యుమోకోకల్ వ్యాధి వస్తుంది. దీనిని నిరోధించడానికి ‘న్యుమోకోకల్‌ వ్యాక్సిన్’ అనేది ఇస్తుంటారు. సాధారణంగా దీనిని రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా పెద్దవారికి ఇస్తుంటారు.

కొంతమందిలో ఆటలమ్మ, అమ్మవారుగా పిలిచే చికెన్‌పాక్స్‌ అనే వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వస్తుంటుంది. సాధారణంగా చిన్నవయసులో ఉన్నప్పుడే దీనికి సంబంధించిన వ్యాక్సిన్‌ను ఇస్తుంటారు. ఒకవేళ చిన్నప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకోకపోతే 13 ఏళ్లు పైబడిన వారు ఈ వ్యాక్సిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ‘వారిసెల్లా వ్యాక్సిన్‌’ అంటుంటారు. దీనిని రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది.

కుక్క కాటుకు గురైనప్పుడు ‘రేబిస్‌ వ్యాక్సిన్‌’ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది 5 డోసులుగా ఉంటుంది.

కొన్ని ప్రదేశాల్లో టైఫాయిడ్‌ కేసులు అధికంగా ఉంటాయి. ఇది ఎండమిక్‌ డిసీజ్‌. దీనికి సంబంధించిన టైఫాయిడ్‌ వ్యాక్సిన్‌ను అవసరాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది.

చూశారుగా.. పిల్లలకు మాదిరిగానే పెద్దవారు కూడా వ్యాక్సిన్లు తీసుకోవడం ఎంతో అవసరం. ఈ వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా వాటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మరింత తీవ్రతరం కాకుండా బయటపడచ్చు. ముఖ్యంగా ఫ్లూ షాట్‌ను బీపీ, షుగర్‌ ఉన్నవారు.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రతి సంవత్సరం తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని