Published : 08/02/2023 20:54 IST

నువ్వు బిజినెస్‌కి పనికిరావంటున్నారు.. ఏం చేయాలి?

నమస్తే మేడమ్.. నేను ఐటీ ఉద్యోగిగా పనిచేసేదాన్ని. బాబు పుట్టడంతో ఉద్యోగం మానేశాను. ఇప్పుడు బాబు స్కూల్‌కి వెళ్తున్నాడు. దీంతో నా కెరీర్‌ని తిరిగి మొదలు పెట్టాలనుకుంటున్నాను. అయితే ఈ వయసులో ఐటీ రంగంలో పని చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకని నా ఆలోచనలు బిజినెస్‌ వైపు మళ్లాయి. అయితే నాది అంతర్ముఖ స్వభావం. దానివల్ల మా ఆయన నువ్వు సొంతంగా బిజినెస్‌ నడపలేవని అంటున్నారు. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు ఇంతకుముందు ఎంచుకున్న వృత్తి ఐటీ. అంటే కంప్యూటర్‌ని ఉపయోగిస్తూ దానికి మేధోశక్తిని జోడించి ప్రపంచంతో అనుసంధానమవ్వడం. ఈ క్రమంలో కొన్ని కొన్ని పనులను పూర్తి చేయగలిగేవారు. అదేవిధంగా అదే కంప్యూటర్‌తో మీ మేధోశక్తిని ఉపయోగించి బిజినెస్‌ చేసే ఆలోచనలను ప్రయత్నించండి. అయితే ఈ క్రమంలో మీ మనస్తత్వానికి తగ్గ వ్యాపకాన్ని బిజినెస్‌గా మార్చుకోవచ్చేమో ఆలోచించండి. మీరు ఎంచుకున్న బిజినెస్‌ని విస్తృతం చేసుకోవడానికి మీకున్న పరిచయాలను ఉపయోగించుకునే అవకాశం ఉందేమో పరిశీలించండి. అలాగే ప్రస్తుతమున్న సామాజిక మాధ్యమాల ద్వారా కూడా బిజినెస్‌ని విస్తృతంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఆ కోణంలో కూడా ఓసారి ఆలోచించండి.

అలాగే ఒకేసారి పెద్ద ప్రయత్నాలు చేసి విజయం సాధించలేనేమో అన్న భయాలు ఉంటే.. చిన్న చిన్న ప్రయత్నాలతో బిజినెస్ మొదలుపెట్టండి. అలా క్రమక్రమంగా ప్రతి విజయాన్ని ఆస్వాదిస్తూ బిజినెస్‌ని విస్తృతం చేసుకుంటూ, పెట్టుకున్న లక్ష్యాలను సాధించే దిశగా ముందడుగేయండి. బలహీనతలపై దృష్టి పెట్టి మీకున్న బలాలను మర్చిపోవక్కర్లేదు. కాబట్టి మీకున్న బలాలను గుర్తు చేసుకుంటూ.. వాటిని ఉపయోగించి ముందుకు సాగే ప్రయత్నం చేయండి. అలాగే మీకు అలవాటైన పనినే వీలైనంత వరకు మీకు అనువుగా మలుచుకునే ప్రయత్నం చేయండి.. విజయం మీ సొంతమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని