అలాంటి వాడని తెలిస్తే.. మొదట్లోనే బ్లాక్‌ చేసేదాన్ని!

నా వయసు 28 సంవత్సరాలు. డిగ్రీ చదివే రోజుల్లో నాకు ఒక అమ్మాయి పరిచయమైంది. అప్పటి నుంచి మేము మంచి స్నేహితులుగా ఉంటున్నాం. మాకు పెళ్లిళ్లు అయినా కూడా ఒకరి ఇంటికి మరొకరం వెళుతుంటాం. అలా నా స్నేహితురాలి భర్తతో కూడా....

Published : 28 May 2023 13:31 IST

నా వయసు 28 సంవత్సరాలు. డిగ్రీ చదివే రోజుల్లో నాకు ఒక అమ్మాయి పరిచయమైంది. అప్పటి నుంచి మేము మంచి స్నేహితులుగా ఉంటున్నాం. మాకు పెళ్లిళ్లు అయినా కూడా ఒకరి ఇంటికి మరొకరం వెళుతుంటాం. అలా నా స్నేహితురాలి భర్తతో కూడా పరిచయం ఏర్పడింది. ఒకరోజు అతను వాట్సప్‌లో మెసేజ్‌ పెట్టాడు. నేను కూడా నార్మల్‌గా చాట్‌ చేశా. అయితే ఇప్పుడు అతడు అసభ్యకర మెసేజ్‌లు, ఫొటోలు పెడుతున్నాడు. మొదట్లోనే అతడిని బ్లాక్‌ చేసుంటే బాగుండనిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయం నా స్నేహితురాలికి కానీ, నా భర్తకు కానీ చెబితే నన్నే అపార్థం చేసుకుంటారేమోనని భయంగా ఉంది. దయచేసి ఈ విషయంలో సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు ఎలాంటి దురుద్దేశం లేకుండానే అతడితో మాట్లాడారు. అయితే ఎప్పుడైతే అతడు అసభ్యకర సందేశాలు, ఫొటోలు పంపిస్తున్నాడో అప్పట్నుంచి పరిస్థితి మీకు ఇబ్బందికరంగా మారింది. ఇది కొన్ని రోజలుగా జరుగుతుంది కాబట్టి ఈ విషయం ఎవరికి చెప్పినా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు. మొదట్లోనే అతడిని బ్లాక్‌ చేయనందుకు చింతిస్తున్నారు కూడా! నిజానికి ఇందులో మీ తప్పు లేదని మీరు భావించినప్పుడు మిమ్మల్ని మీరు నిందించుకోవాల్సిన అవసరం లేదు.

ఈ విషయం ఇతరులకు తెలిస్తే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారేమోనని అనుకుంటున్నారు. కాబట్టి, ముందుగా ఈ విషయాన్ని మీ స్నేహితురాలి భర్తతోనే చర్చించే ప్రయత్నం చేయండి. అతనితో ‘ఇలాంటి సంభాషణలు నాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇక్కడితో వాటికి స్వస్తి చెప్పండి’ అని స్పష్టంగా, సున్నితంగా తెలియజేయండి. ఒకవేళ మీరిద్దరూ సమస్యను పరిష్కరించుకుంటే మూడో వ్యక్తికి చెప్పాల్సిన అవసరం ఉండదు. మీ ఆందోళన కూడా తగ్గుతుంది. అతని నుంచి సానుకూల స్పందన రాకపోతే మాత్రం ఈ విషయాన్ని మీ భర్తకు లేదా స్నేహితురాలికి చెప్పే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీరు ఎలాంటి తప్పు చేయలేదన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా వివరించడం ముఖ్యం. తద్వారా వారు కచ్చితంగా మిమ్మల్ని, మీరు పడుతోన్న ఇబ్బందిని అర్థం చేసుకుంటారు. ఫలితంగా మీ సమస్యకు పరిష్కరం లభించడమే కాకుండా మీలో ఉన్న అపరాధ భావన కూడా తొలగిపోతుంది. కాబట్టి సానుకూల దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని