నాకు పబ్లిక్‌లో నడవాలంటే భయం.. ఏంచేయాలి?

నమస్తే మేడం. నాకు 24 ఏళ్లు. నాకు చిన్నప్పటి నుంచి రోడ్డు మీద నడవాలంటే చాలా భయం. ఓపెన్ ప్లేసెస్‌లో కూడా నడవలేను. ఇంట్లో బాగానే నడుస్తాను. గుడిలో ప్రదక్షిణలు కూడా చేయలేను. ఎక్కడికైనా నడిచి వెళ్లాలి అని ముందుగానే....

Updated : 03 Jun 2023 20:11 IST

నమస్తే మేడం. నాకు 24 ఏళ్లు. నాకు చిన్నప్పటి నుంచి రోడ్డు మీద నడవాలంటే చాలా భయం. ఓపెన్ ప్లేసెస్‌లో కూడా నడవలేను. ఇంట్లో బాగానే నడుస్తాను. గుడిలో ప్రదక్షిణలు కూడా చేయలేను. ఎక్కడికైనా నడిచి వెళ్లాలి అని ముందుగానే తెలిస్తే భయంతో గుండె దడదడలాడిపోతుంది. దాంతో పాదాలు కూడా వణుకుతాయి. ఇలా నడవలేని సమయంలో బలవంతంగా నడవడం వల్ల పడిపోతాను. దాంతో ఎవరితోనూ కలిసి బయటకు కూడా వెళ్లలేకపోతున్నాను. చాలా బాధగా అనిపిస్తోంది. అన్ని రకాల టెస్టులు చేయించుకున్నా.. నా ఆరోగ్యం కూడా బాగానే ఉంది. కానీ నా ఈ సమస్యకు కారణమేంటో అస్సలు అర్థం కావట్లేదు. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా కుంగిపోతున్నా. నా సమస్యకు పరిష్కారం చూపండి. - ఓ సోదరి

జ: మీకు శారీరకంగా ఎలాంటి సమస్యలు లేవని కచ్చితంగా అన్ని రకాల పరీక్షల ద్వారా తేలినట్లయితే అప్పుడు మానసిక సమస్యల దృక్కోణంలో ఈ సమస్య గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఆత్మవిశ్వాస లోపం, అభద్రతా భావం, అయ్యో నడవలేకపోతున్నానే అన్న భయం ఏదైతే ఉందో అదే మిమ్మల్ని వెనక్కి లాగుతోంది. మీ మనసులో ఉన్న భయాన్ని మీరు జయిస్తే మామూలుగా అందరిలాగే నడవడానికి మెరుగైన అవకాశాలుంటాయి. అయితే ఆ భయాన్ని జయించడానికి అనేక విధాలైన మార్గాలుంటాయి. ఇందులో భాగంగా ముందుగా మీరు శారీరకంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా పౌష్ఠికాహారం తీసుకోవడం, నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు చేయడం, అలాగే నిపుణుల పర్యవేక్షణలో సైకోథెరపీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

అంటే.. ఈ క్రమంలో మీలో ఉన్న భయాన్ని క్రమక్రమంగా, దశలవారీగా పోగొట్టడానికి కొన్ని పద్ధతులు ఉపయోగిస్తారు. అవి అటు ప్రవర్తనా పరమైన పద్ధతులే కాకుండా.. మీ ఆలోచనలను మీరు మార్చుకునేందుకు సహాయపడే పద్ధతులు కూడా ఇందులో మిళితమై ఉంటాయి. కాబట్టి నిపుణుల పర్యవేక్షణలో ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రమక్రమంగా మీరు మీ భయాన్ని అధిగమించే ప్రయత్నం చేయచ్చు. దీనికి మీ వైపు నుంచి కూడా తగిన ప్రేరణ అంతర్గతంగా మొదలవ్వాలి. మీరు అవమానాలపాలు కాకూడదని మీ మనసులో ఎంత దృఢంగా అనుకుంటున్నారో.. మీరు ఒకరిపై ఆధారపడకుండా మీ అంతట మీరు స్వతంత్రంగా, ధైర్యంగా నడవగలగాలి అనే ప్రేరణ కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీ మనసుకు మీరు ముందుగా నచ్చచెప్పుకునే ప్రయత్నం చేయండి. క్రమక్రమంగా మీరు మీ నడకని మెరుగుపరచుకోగలను అన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ అది కేవలం మాటలతో అనుకున్నంత మాత్రాన సరిపోదు. దానికి మానసిక నిపుణుల సలహాలు పాటించడం కూడా ముఖ్యమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్