Published : 28/01/2023 19:53 IST

గుక్కపెట్టి ఏడుస్తున్నాడు.. ఎందుకని?!

మా బాబు వయసు మూడు నెలలు. రోజూ రెండు గంటల పాటు గుక్కపెట్టి ఏడుస్తుంటాడు. దాంతో మాలో ఆందోళన పెరిగిపోతుంది. కొంతమంది ‘ఏడుపు మంచిదే.. దానివల్ల పాలు జీర్ణమవుతాయి’ అని సలహా ఇస్తున్నారు. కానీ మాకు అది సాధారణ ఏడుపులాగా అనిపించడం లేదు. దయచేసి ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు చెప్పే లక్షణాలను బట్టి మీ బాబుకు కోలిక్‌ (Colic) సిండ్రోమ్‌ ఉన్నట్టుగా అనిపిస్తోంది. ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరిలో ఇది కనిపిస్తుంది. ఇది పాపాయి పుట్టిన నాలుగో వారం నుంచి మొదలవుతుంది. ఈ సమస్య ఉన్న పిల్లలు రెండు మూడు గంటల పాటు గుక్కపెట్టి ఏడుస్తుంటారు. దీనికి ప్రత్యేక కారణాలంటూ ఏమీ ఉండవు. అయితే అదే పనిగా ఏడవడం వల్ల తల్లిదండ్రుల్లో ఆందోళన పెరగడం సహజం. దీనికి ప్రత్యేకమైన చికిత్స కూడా ఏమీ ఉండదు. కానీ, చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల ఫలితం కనిపించచ్చు. ముఖ్యంగా తల్లి తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. నట్స్‌, గోధుమలు, చాక్లెట్స్‌, ఐస్‌క్రీమ్స్‌, పాల ఉత్పత్తులు.. వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎక్కువసేపు ఏడ్చినప్పుడు.. తక్కువ కాంతి, నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో పాపాయిని పడుకోబెట్టాలి. కొంతమంది పిల్లల్లో గ్యాస్‌ సమస్య వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది. కాబట్టి, పాలు పట్టాక చిన్నారిని భుజంపై వేసుకొని బర్పింగ్‌ చేస్తుండాలి. ఎక్కువసేపు ఏడుస్తు్న్నాడంటే ఒకసారి వైద్యుణ్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే.. వారి ఏడుపుకు కోలిక్‌ సమస్య కారణమా? లేదంటే ఇతర సమస్యలేవైనా ఉన్నాయా? అనేది చెక్‌ చేస్తారు. ఒకవేళ కోలిక్‌ సమస్యైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. క్రమంగా దానంతటదే తగ్గిపోతుంది. అలాగే బాబు ఏడ్చినప్పుడు పాసిఫయర్స్‌ వాడడం వల్ల కూడా ఏడుపును కొంత వరకు తగ్గించచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని