గర్భసంచి తీసేస్తే ఎలాంటి సమస్యలొస్తాయి?

నా వయసు 35 సంవత్సరాలు. నెలసరి సమయంలో 5 నుంచి 10 రోజుల పాటు రక్తస్రావం అవుతుంది. ప్రతి నెలా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నా. డాక్టర్‌ని సంప్రదిస్తే అవసరాన్ని బట్టి గర్భసంచి తీసేయాల్సి రావచ్చని అంటున్నారు. గర్భసంచి తీసేస్తే భవిష్యత్తులో....

Published : 16 Apr 2023 11:08 IST

నా వయసు 35 సంవత్సరాలు. నెలసరి సమయంలో 5 నుంచి 10 రోజుల పాటు రక్తస్రావం అవుతుంది. ప్రతి నెలా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నా. డాక్టర్‌ని సంప్రదిస్తే అవసరాన్ని బట్టి గర్భసంచి తీసేయాల్సి రావచ్చని అంటున్నారు. గర్భసంచి తీసేస్తే భవిష్యత్తులో సమస్యలు వస్తాయా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. నెలసరి సమయంలో ఎక్కువ రోజులు రక్తస్రావం అవుతోందని చెబుతున్నారు. ముందుగా దీనికి గల కారణాన్ని తెలుసుకోవాలి. ఇందుకోసం అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయించుకోవాలి. దీని ద్వారా ఫైబ్రాయిడ్స్‌ ఏమైనా ఉన్నాయా? గర్భాశయ పొర ఏమైనా పెరిగిందా? అనే విషయాలు తెలుస్తాయి. కొంతమందిలో ఈ సమస్యలేవీ లేకపోయినా థైరాయిడ్‌ హార్మోన్‌ హెచ్చుతగ్గుల వల్ల అధిక రక్తస్రావం అవుతుంటుంది. మరికొంతమందిలో గర్భాశయం లోపల పెల్విక్‌ ఇన్ఫెక్షన్‌ ఉండడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుంది. కాబట్టి, వీటికి సంబంధించిన పరీక్షలతో పాటు రక్తపరీక్ష చేయించుకోవడం వల్ల సమస్యను గుర్తించచ్చు. ఒకవేళ ఈ రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నా గర్భసంచి తీయించుకోవడం అనేది సరైన నిర్ణయం కాదు.

మీ వయసు 35 ఏళ్లని చెబుతున్నారు. ఈ వయసులో గర్భసంచి తీయించుకోవడం మంచిది కాదు. దీనివల్ల దీర్ఘకాలంలో అండాశయాల పనితీరు తగ్గిపోతుంది. ఫలితంగా మెనోపాజ్‌ త్వరగా వస్తుంది. అధిక రక్తస్రావం, వైట్‌ డిశ్చార్జ్ వంటి చిన్న చిన్న కారణాలకే కొంతమంది గర్భసంచి తొలగించుకుంటున్నారు. కానీ అది సరైన నిర్ణయం కాదు. ఒకవేళ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలను పాటించాలి.

అధిక రక్తస్రావం సమస్యకు కాపర్‌-టి చక్కటి పరిష్కారం. దీనిని గర్భాశయంలో అమరుస్తారు. దీనివల్ల బ్లీడింగ్ సమస్య 90 శాతం తగ్గుతుంది. కొంతమంది అధిక రక్తస్రావం లేకపోయినా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు IUD వేయించుకోవడం మంచిది. దీనిద్వారా హిస్టరెక్టమీ సర్జరీలను కూడా అరికట్టవచ్చు. అంతేకానీ చిన్న చిన్న కారణాలకు గర్భసంచి తొలగించుకోవడం మంచిది కాదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని