ఎస్కలేటర్‌ ఎక్కాలంటేనే భయం వేస్తోంది..!

నా వయసు 32 ఏళ్లు. నాది విచిత్రమైన సమస్య. ఇది వింటే కొంతమందికి నవ్వు రావచ్చు. కానీ దానివల్ల చాలా బాధపడుతున్నాను. షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లినప్పుడు ఎస్కలేటర్‌ ఎక్కాలంటే చాలా భయం వేస్తోంది.

Published : 27 Aug 2023 12:35 IST

నా వయసు 32 ఏళ్లు. నాది విచిత్రమైన సమస్య. ఇది వింటే కొంతమందికి నవ్వు రావచ్చు. కానీ దానివల్ల చాలా బాధపడుతున్నాను. షాపింగ్‌ మాల్స్‌కు వెళ్లినప్పుడు ఎస్కలేటర్‌ ఎక్కాలంటే చాలా భయం వేస్తోంది. ఓసారి చీర ఇరుక్కుపోయి చాలా భయపడ్డా. అక్కడివాళ్లు ఆపడంతో క్షేమంగా బయటపడ్డా. అప్పట్నుంచి ఆ భయం మరింత పెరిగిపోయింది. దయచేసి నా సమస్యకు తగిన సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. ఎస్కలేటర్‌లో మీ చీర ఎప్పుడైతే ఇరుక్కుపోయిందో అప్పట్నుంచి ఎస్కలేటర్‌ ఎక్కాలంటేనే భయం వేస్తోందని అంటున్నారు. దీనికంటే ముందు మీరు ఒక విషయం గురించి ఆలోచించండి. సాధారణంగా మనం గోళ్లు తీసుకునేటప్పుడు కొన్నిసార్లు చిగురు తెగుతుంటుంది. దీనివల్ల నొప్పిగా ఉంటుంది. అంతమాత్రాన పూర్తిగా గోళ్లు తీసుకోకుండా ఉండలేరు కదా. అలాగే పొరపాటున మీ చీర ఎస్కలేటర్‌లో ఇరుక్కుపోయింది. అదే ప్రతిసారీ పునరావృతం అవ్వదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

సాధారణంగా మనం చేసే తప్పు/పొరబాటును గుర్తించకపోవడం వల్లే భయం అనేది కలుగుతుంటుంది. ఒకవేళ దానిని గుర్తించి పరిష్కరించుకుంటే భయాన్ని దూరం చేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలకే భయపడిపోతే భవిష్యత్తులో వచ్చే పెద్ద సమస్యలను పరిష్కరించుకోలేం. కాబట్టి రెండు, మూడు సార్లు ఇంట్లోవాళ్లని తీసుకుని ఎస్కలేటర్‌ ఎక్కడానికి ప్రయత్నించండి. తర్వాత సొంతంగా ఎక్కండి. అప్పుడు మీలో ధైర్యం దానంతట అదే పెరుగుతుంది. మార్పు మీ నుంచే మొదలవ్వాలి. ఒక్కసారి మీపై మీకు నమ్మకం కలిగిందంటే మీ పనులను సక్రమంగా నిర్వర్తించుకోగలుగుతారు. ఆల్‌ ది బెస్ట్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని