నా భర్త ఫోన్‌లో ఎక్కువసేపు ఆమెతోనే గడుపుతున్నాడు..!

మా పెళ్లై 21 ఏళ్లైంది. మా దాంపత్య బంధంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. పెళ్లికి ముందు నా భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఏదో కారణంతో వారిద్దరూ విడిపోయారు. ఆ కారణమేంటో ఇప్పటివరకు నాకు తెలియదు. కానీ, తనంటే ఇప్పటికీ నా భర్తకు చాలా ఇష్టం. పెళ్లి తర్వాత ఎప్పుడూ....

Published : 08 Jun 2023 12:30 IST

(Representational Image)

మా పెళ్లై 21 ఏళ్లైంది. మా దాంపత్య బంధంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. పెళ్లికి ముందు నా భర్త వేరే అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఏదో కారణంతో వారిద్దరూ విడిపోయారు. ఆ కారణమేంటో ఇప్పటివరకు నాకు తెలియదు. కానీ, తనంటే ఇప్పటికీ నా భర్తకు చాలా ఇష్టం. పెళ్లి తర్వాత ఎప్పుడూ వారిద్దరూ కలుసుకోలేదు. దాంతో మా దాంపత్యం ఎలాంటి గొడవలు లేకుండా సాగింది. కానీ ప్రస్తుతం కొన్ని రోజుల నుంచి వారు తిరిగి మాట్లాడుకుంటున్నారు. మెసేజ్‌లు చేసుకుంటూ, ఫోన్‌ కాల్స్ మాట్లాడుతూ రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారు. నా భర్త ఎక్కువ సమయం ఫోన్‌లోనే గడుపుతున్నాడు. నా మీద ఆసక్తి చూపించడం లేదు. కొన్నిసార్లు ఆయన వాట్సప్‌లో చాటింగ్‌ చేస్తుంటే చూశాను. చాట్‌ చేసేటప్పుడు వారిద్దరూ లవ్‌ స్టిక్కర్లు కూడా పంపించుకుంటున్నారు. ఈ విషయం గురించి నా భర్తను అడిగితే ‘తను కేవలం స్నేహితురాలు మాత్రమే’ అని బదులిచ్చాడు. అసలు మాజీ ప్రేమికులు స్నేహితులుగా కొనసాగే అవకాశం ఉంటుందా? ఒకవేళ వారు కేవలం స్నేహితులే అయితే లవ్‌ స్టిక్కర్లు ఎందుకు పంపించుకుంటున్నారు? ఎందుకు ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు? నా భర్త ఇంతకుముందులా ఉండాలంటే ఏం చేయాలి? నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీకు పెళ్లై 21 ఏళ్లవుతోందని అంటున్నారు. గత కొన్ని రోజులుగా మీ భర్త మరొక మహిళతో చాటింగ్‌ చేయడం, ఫోన్‌ కాల్స్‌ మాట్లాడడం చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఆ మహిళ పెళ్లికి ముందు మీ భర్త గర్ల్‌ఫ్రెండ్‌ కావడం మిమ్మల్ని తీవ్రంగా కలవరపెడుతోందని అర్థమవుతోంది. అయితే ఈ విషయం గురించి ఇప్పటికే మీ భర్తతో చర్చించానని అంటున్నారు. కానీ, ‘తను కేవలం స్నేహితురాలు మాత్రమే’ అని ఇచ్చిన సమాధానం మీకు సంతృప్తి కలిగించలేదని అర్థమవుతోంది. అలాగే వాట్సప్‌లో లవ్‌ స్టిక్కర్లు పంపించుకోవడం వల్ల మీకు మరిన్ని సందేహాలు కలుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి చేసే మోసం కంటే దానికి సంబంధించిన అనుమానాలు ఎక్కువగా కుంగదీస్తుంటాయి. అవి ఇన్నేళ్ల మీ దాంపత్య బంధంలో కూడగట్టుకున్న నమ్మకం, విధేయతను కూడా ప్రశ్నించేలా చేస్తాయి. కాబట్టి, అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.

గత 20 ఏళ్లుగా మీ దాంపత్య బంధం సాఫీగా సాగిందని అంటున్నారు. కాబట్టి, మీ భర్తతో సానుకూల వాతావరణంలో మరోసారి చర్చించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో మీ అభిప్రాయాలు, సందేహాలను నివృత్తి చేసుకోండి. అలాగే మరో మహిళతో ఫోన్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు పడుతున్న మానసిక వేదనను అతనికి వివరించే ప్రయత్నం చేయండి. తద్వారా అతనిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది.

మీ భర్త మీపై ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. అయితే మీ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్న విషయాన్ని కూడా పరిశీలించండి.  అలాగే మీ భర్త మాజీ ప్రేయసితో ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్న క్రమంలో అతని ఆలోచనలు మళ్లించే ప్రయత్నం చేయండి. ఇందుకోసం కుటుంబ సమేతంగా ఎక్కువ సమయం గడపడానికి ఉన్న అవకాశాలను పరిశీలించండి. వారాంతాల్లో షాపింగ్‌కు వెళ్లడం, విహారయాత్రలకు వెళ్లడం వంటివి చేయండి. అప్పటికీ అతని ఆలోచనల్లో మార్పు రాకపోతే ఒకసారి మానసిక నిపుణులను సంప్రదించండి. వారు అన్ని వివరాలు పరిశీలించి తగిన సలహా సూచిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్