Updated : 23/01/2023 21:29 IST

నడుం నొప్పి ఉన్నవారు వాకింగ్‌ చేయచ్చా?

నా వయసు 45 సంవత్సరాలు. నాకు చాలా కాలంగా నడుం నొప్పి సమస్య ఉంది. దీనికోసం ఫిజియోథెరపీ చేయించుకున్నాను. అయితే నడుం నొప్పి ఉన్నవారు వాకింగ్‌ చేయచ్చా? ఒకవేళ చేస్తే ఎంతసేపు చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. మీ వయసు 45 సంవత్సరాలని చెబుతున్నారు. చాలాకాలంగా నడుం నొప్పి సమస్య ఉందని అంటున్నారు. అయితే నడుం నొప్పికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి మెకానికల్‌ బ్యాక్‌ పెయిన్‌. రెండు ఆర్గానిక్‌ బ్యాక్‌ పెయిన్‌. కండరాలు బాగా అలసిపోవడం, ప్రయాణాలు చేయడం, బైక్‌ నడపడం, ముందుకు వంగే పనులు చేయడం.. వంటి వాటివల్ల వచ్చే నడుంనొప్పిని మెకానికల్‌ బ్యాక్‌ పెయిన్‌ అంటారు. ఇంకోటి ఆర్గానిక్‌ బ్యాక్‌ పెయిన్‌. ఇది పలు ఆరోగ్య సమస్యల వల్ల వస్తుంటుంది. మీకు చాలాకాలం నుంచి నడుం నొప్పి ఉందని అంటున్నారు. కాబట్టి, మీరు ఒక్కసారి ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. వారు పరీక్షించి మీ నడుం నొప్పికి గల కారణాన్ని చెబుతారు. అలాగే దానికి తగిన చికిత్స అందిస్తారు.

నడుం నొప్పి ఉన్నవారు నిరభ్యంతరంగా వాకింగ్‌ చేయచ్చు. అలాగే నడుం నొప్పి ఉన్నవారు ఇంతసేపు వాకింగ్‌ చేయాలనే నియమం ఏమీ లేదు. అది మీ శారీరక సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఎక్కువసేపు వాకింగ్‌ చేస్తే ఆరోగ్యానికి అంత మంచిది. వాకింగ్‌ చేసేటప్పుడు మాత్రం నడుం నిటారుగా ఉండేట్టు చూసుకోవాలి.

మీకు ఏ పనుల వల్ల నడుం నొప్పి ఎక్కువగా వస్తుందో వాటికి సాధ్యమైనంత మేరకు దూరంగా ఉండాలి. వీటికి తోడు డాక్టర్‌ సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకోవడం, విటమిన్‌ డి ఇంజెక్షన్లు, క్యాల్షియం సప్లిమెంట్స్‌ తీసుకోవడం చేస్తుండాలి. ఒకవేళ ఊబకాయం సమస్య ఉంటే తగిన ఆహార నియమాలు పాటించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే సాధ్యమైనంత వరకు నడుం నొప్పిని తగ్గించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని