Updated : 29/03/2023 20:11 IST

మంగు మచ్చలు పూర్తిగా తగ్గాలంటే ఏం చేయాలి?

నా వయసు 30 సంవత్సరాలు. నేను మంగు మచ్చలతో నాలుగు సంవత్సరాలుగా బాధపడుతున్నాను. స్కిన్‌ స్పెషలిస్ట్‌కు చూపించుకుంటే క్రీమ్స్‌ ఇచ్చారు. సన్‌స్క్రీన్‌ కూడా రెగ్యులర్‌గా వాడుతున్నాను. దీనివల్ల పిగ్మెంటేషన్‌ లైట్‌ అవుతోంది. కానీ, పూర్తిగా తగ్గడం లేదు. నా సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు. - ఓ సోదరి

జ. మీకు మంగు మచ్చలు ఉన్నాయి. దానికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌ కూడా తీసుకున్నానని చెప్పారు. అలాగే సన్‌స్క్రీన్‌ క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నానని అంటున్నారు. అయితే మంగు మచ్చలు అనేవి మూడు రకాలుగా వస్తుంటాయి. కొంతమందికి పిగ్మెంటేషన్ చర్మం పైపొరల్లో ఉంటుంది. దీన్ని ‘ఎపిడెర్మల్‌ మెలాస్మా’ అంటారు. కొంతమందికి చర్మం లోపలి పొరల్లో పిగ్మెంటేషన్‌ ఉంటుంది. దీన్ని ‘డెర్మల్‌ మెలాస్మా’ అంటారు. మరికొంతమందికి రెండు పొరల్లోనూ పిగ్మెంటేషన్‌ ఉంటుంది. దీన్ని ‘మిక్స్‌డ్‌ మెలాస్మా’ అంటారు.

మిక్స్‌డ్‌ మెలాస్మా ఉన్నప్పుడు క్రీమ్స్‌, సన్‌స్క్రీన్స్‌ ఉపయోగించడం వల్ల ఫలితం ఉన్నప్పటికీ చర్మం లోపలి పొరల్లో పిగ్మెంటేషన్‌ కొద్దిగా ఉండిపోతుంటుంది. దానివల్ల సమస్య అలాగే ఉన్న భావన కలుగుతుంది. మీరు ఇప్పటికే కొన్ని రకాల క్రీమ్స్‌, సన్‌స్క్రీన్స్‌ ఉపయోగిస్తున్నారు. కాబట్టి, వాటికి తోడు కొన్ని రకాల మందులను కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అప్పటికీ మీకు సమస్య ఉంటే అడ్వాన్స్‌డ్‌ పీలింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల చాలామందిలో పీల్స్‌ వస్తుంటాయి. కొంతమందిలో ఇది 20 రోజుల నుంచి ఒక నెల వరకు ఉంటుంది. వీటికి తోడు మెయింటెనెన్స్‌ క్రీమ్‌ అనేది క్రమం తప్పకుండా దీర్ఘకాలం వాడాల్సి ఉంటుంది. అయితే మంగు మచ్చలకు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం ఏమీ లేదు. కానీ, దీనికి సంబంధించిన క్రీమ్‌లను మాత్రం దీర్ఘకాలం వాడాల్సి ఉంటుంది. పలు రకాల అడ్వాన్స్‌డ్‌ లేజర్‌ ట్రీట్‌మెంట్స్ ఉన్నప్పటికీ అందులోనూ ప్రతికూల ఫలితాలున్నాయి. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఫౌండేషన్ క్రీమ్స్‌ ద్వారా కవర్‌ చేసుకోవడం ఉత్తమ మార్గం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని