సహజ గర్భ నిరోధక పద్ధతులు.. ఫలితాన్నిస్తాయా?

నా వయసు 23 సంవత్సరాలు. పెళ్లై ఏడాదవుతోంది. మేము ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. ఇందుకోసం గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నా. అయితే మాత్రలు, కండోమ్స్ కాకుండా సహజ గర్భ నిరోధక పద్ధతులను పాటిద్దామనుకుంటున్నాం.

Published : 23 Aug 2023 19:02 IST

నా వయసు 23 సంవత్సరాలు. పెళ్లై ఏడాదవుతోంది. మేము ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. ఇందుకోసం గర్భ నిరోధక మాత్రలు వాడుతున్నా. అయితే మాత్రలు, కండోమ్స్ కాకుండా సహజ గర్భ నిరోధక పద్ధతులను పాటిద్దామనుకుంటున్నాం. వాటి వల్ల ఫలితముంటుందా? తెలియజేయగలరు - ఓ సోదరి

జ. మీరు ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నారు. ఇందుకోసం గర్భనిరోధక మాత్రలు వాడుతున్నానని చెప్పారు. అయితే ఈ మాత్రల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకపోతే సాధారణంగా మూడు సంవత్సరాల వరకు వాడచ్చు. ఒకవేళ ఎక్కువకాలం ఇవి వద్దనుకుంటే మీరనుకుంటున్నట్లు సహజ గర్భ నిరోధక పద్ధతులను పాటించడం కూడా మంచిదే. అయితే ముందు ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలు తెలుసుకోవాలి.

సాధారణంగా రెండు పద్ధతుల ద్వారా సహజంగా గర్భాన్ని నిరోధించవచ్చు. ఒకటి అండం విడుదలయ్యే సమయంలో కలయికకు దూరంగా ఉండడం. సాధారణంగా నెలసరికి 14 రోజుల ముందు అండం విడుదలవుతుంది. అంటే 30 రోజుల సైకిల్‌ ఉంటే 16వ రోజున అండం విడుదలవుతుంది. ఒకవేళ 40 రోజుల సైకిల్‌ అయితే 24వ రోజున విడుదలవుతుంది. కానీ ఈ సైకిల్‌లో హెచ్చుతగ్గులు ఉంటే అండం ఎప్పుడు విడుదలవుతుందో తెలుసుకోవడం కష్టం. కాబట్టి, ఈ పద్ధతి రిస్క్‌తో కూడుకున్నది. రెండో పద్ధతిని కాయిటస్‌ ఇంటరప్టస్ అంటుంటారు. అంటే కలయిక సమయంలో గర్భాశయంలోకి వీర్యం విడుదల కాకుండా చూసుకోవడం. అయితే కొన్ని సందర్భాల్లో పూర్తిగా వీర్యం విడుదల కాకముందే కొన్ని వీర్య కణాలు గర్భాశయంలోకి వెళుతుంటాయి. దానివల్ల కూడా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది.

కాబట్టి సహజ పద్ధతుల ద్వారా 100 శాతం గర్భాన్ని నిరోధించే అవకాశం తక్కువ. ఒకవేళ గర్భం వచ్చినా పర్లేదనుకుంటే సహజ పద్ధతులను పాటించండి. లేదంటే నోటి మాత్రలు వాడడం మంచింది. ఎందుకంటే అబార్షన్‌ కంటే పిల్స్ వాడడమే కొంతవరకు మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని