అక్కడ ఒక్కర్తే ఉంటానంటోంది.. తన ఆలోచనను మార్చడం ఎలా?

మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. మా అమ్మగారి వయసు 68 సంవత్సరాలు. నాన్నగారు ఆరు నెలల క్రితం మాకు దూరమయ్యారు. అప్పట్నుంచి అమ్మ ఒక్కతే పల్లెటూరిలో ఉంటోంది. మా దగ్గరకు వచ్చి ఉండమంటే....

Published : 10 May 2023 12:29 IST

మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. మా అమ్మగారి వయసు 68 సంవత్సరాలు. నాన్నగారు ఆరు నెలల క్రితం మాకు దూరమయ్యారు. అప్పట్నుంచి అమ్మ ఒక్కతే పల్లెటూరిలో ఉంటోంది. మా దగ్గరకు వచ్చి ఉండమంటే రానని అంటోంది. ఈ వయసులో ఆమె ఒంటరిగా ఉండడం మాకు చాలా బాధగా ఉంది. ఆమె మనసుని ఎలా మార్చాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు మీ అమ్మగారి స్థానం నుంచి ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. భర్తను పోగొట్టుకున్న ఆమె ఆ జ్ఞాపకాల మధ్యన అదే గ్రామంలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆవిడ మానసిక స్థితిని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె ఆ జ్ఞాపకాలతో అక్కడ ఉంటున్నప్పుడు బలవంతంగా ఆ వాతావరణంలో నుంచి బయటకు తీసుకురావడం వల్ల ఆమెకు సహాయం చేస్తున్నారా? లేక బాధపెడుతున్నారా? అన్న విషయాన్ని కూడా పరిశీలించండి. ప్రస్తుతం మీ అమ్మగారు తన భర్త ఇక లేరన్న బాధ నుంచి బయటపడే ప్రయత్నంలో ఉన్నారు. ఆవిడ చుట్టూ ఒక సందిగ్ధ పరిస్థితి ఉన్నట్టుగా అనిపిస్తోంది. కాబట్టి, ఆవిడ ఆ ఆలోచనల నుంచి బయటపడి.. తనే ఇష్టపూర్వకంగా మీ దగ్గరకు వచ్చేంతవరకు వేచి ఉండడం మంచిదేమో ఆలోచించండి. ఈ క్రమంలో తనకు ఏవైనా అవసరాలుంటే వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఆరోగ్యపరమైన అవసరాలకు సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇలా కనీసం ఒకటి రెండేళ్లు వేచి చూడడం మంచిదేమో ఆలోచించండి.

కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండడం వల్ల ఎవరూ లేరన్న బాధ ఆమెను వేధించే అవకాశం లేకపోలేదు. కాబట్టి మీరు.. మీ అక్కాచెల్లెళ్లు వీలైనంత ఎక్కువ సమయం మీ అమ్మగారి దగ్గర గడపడానికి ప్రయత్నించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని