అండాశయం ఎందుకు పెద్దగా అవుతుంది?
నాకు పిరియడ్స్ సరిగా రావు. ఈ మధ్యనే సోనోగ్రామ్ పరీక్ష చేయించుకున్నాను. పరీక్ష చేసిన టెక్నీషియన్ నా అండాశయం బాగా పెద్దగా అయ్యిందని చెప్పారు. అది కూడా గర్భాశయం పైన ఉందని చెప్పారు. అండాశయం పెద్దగా అవడమంటే....
నాకు పిరియడ్స్ సరిగా రావు. ఈ మధ్యనే సోనోగ్రామ్ పరీక్ష చేయించుకున్నాను. పరీక్ష చేసిన టెక్నీషియన్ నా అండాశయం బాగా పెద్దగా అయ్యిందని చెప్పారు. అది కూడా గర్భాశయం పైన ఉందని చెప్పారు. అండాశయం పెద్దగా అవడమంటే ఏంటి? ఎందుకు ఇలా అవుతుంది? దయచేసి ఈ విషయాల గురించి తెలియజేయగలరు. - ఓ సోదరి
జ. మీ వయసు, మీకు పిల్లలు ఉన్నారా? లేదా? అన్న విషయాల గురించి ప్రస్తావించలేదు. సోనోగ్రామ్ పరీక్షలో అండాశయం ఎన్‌లార్జ్ అయిందని చెప్పారంటున్నారు. అలాగే మీకు ఇర్రెగ్యులర్ పిరియడ్స్ సమస్య ఉందంటున్నారు. ఈ సమస్యలు ఉండి అండాశయం పరిమాణం పెరిగిందంటే దానిని సాధారణంగా ‘పాలీసిస్టిక్ ఓవరీస్’ అంటుంటాం. దీనినే ‘పీసీఓఎస్’ అంటుంటారు. సాధారణంగా అండాశయం సైజు 3 సెం.మీ× 2 సెం.మీ× 1 సెం.మీ ఉంటుంది. అలా కాకుండా అండాశయం పరిమాణం 10 క్యూబిక్ సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే కొంచెం పెద్దగా అయిందని అర్థం. ఒకవేళ అండాశయంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ అండాలు ఉంటే అప్పుడు ‘పీసీఓఎస్’ అంటాం. ఇర్రెగ్యులర్ పిరియడ్స్, పీసీఓఎస్ ఈ రెండు సమస్యలను నయం చేయచ్చు.
అయితే మీరు ఈ సమస్యకు గల కారణాల గురించి అడుగుతున్నారు. అండాశయం పెద్దగా అవడానికి పలు కారణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ వల్ల వాపు రావడం, నెలసరి మధ్యలో అండం పెరగడం, అండాశయంలో ట్యూమర్, సిస్ట్.. ఇలా ఏది ఉన్నా ఓవరీ పెద్దగా అవుతుంది. అయితే స్కాన్ చేసినప్పుడు అండాశయం సాధారణంగానే పెద్దగా అయ్యిందా? సిస్ట్, వాపు, ట్యూమర్.. వంటి వాటి వల్ల పెద్దగా అయ్యిందా? అన్న విషయాలు తెలుస్తాయి. సోనోగ్రామ్‌లో గర్భాశయం పైన అండాశయం ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిని ‘ఎండోమెట్రియాసిస్’ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు నెలసరిలో బయట బ్లీడింగ్ అయినట్టుగానే లోపల కూడా బ్లీడింగ్ అవుతుంది. దానివల్ల అండాశయం చుట్టూ, పైన కూడా ఎండోమెట్రియల్ టిష్యూ ఏర్పడుతుంది. ఫలితంగా అండాశయం.. గర్భాశయం పక్కన లేదా పైన అతుక్కోవడం జరుగుతుంది. ఈ సమస్య ఉన్నవారికి నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. వారు సమస్యకు గల కారణాన్ని తెలుసుకొని తగిన చికిత్స అందిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.