అండాశయం పెరిగింది.. ఎందుకిలా?

నాకు పిరియడ్స్‌ సరిగా రావు. ఈ మధ్యనే సోనోగ్రామ్‌ పరీక్ష చేయించుకున్నాను. పరీక్ష చేసిన టెక్నీషియన్‌ నా అండాశయం పెరిగిందని చెప్పారు. అది కూడా గర్భాశయం పైన ఉందని చెప్పారు. అండాశయం పెరగడమంటే ఏంటి? ఎందుకిలా అవుతుంది? - ఓ సోదరి

Published : 24 Jun 2024 11:59 IST

నాకు పిరియడ్స్‌ సరిగా రావు. ఈ మధ్యనే సోనోగ్రామ్‌ పరీక్ష చేయించుకున్నాను. పరీక్ష చేసిన టెక్నీషియన్‌ నా అండాశయం పెరిగిందని చెప్పారు. అది కూడా గర్భాశయం పైన ఉందని చెప్పారు. అండాశయం పెరగడమంటే ఏంటి? ఎందుకిలా అవుతుంది? - ఓ సోదరి

జ. మీ వయసు, మీకు పెళ్లైందా? పిల్లలు ఉన్నారా? లేదా? అన్న విషయాల గురించి ప్రస్తావించలేదు. సోనోగ్రామ్‌ పరీక్షలో అండాశయం పెరిగిందని చెప్పారంటున్నారు. అలాగే మీకు ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌ సమస్య ఉందంటున్నారు. ఈ సమస్యలు ఉండి అండాశయం పరిమాణం పెరిగిందంటే దాన్ని సాధారణంగా ‘పాలీసిస్టిక్‌ ఓవరీస్’ అంటుంటాం. దీనినే ‘పీసీఓఎస్’ అంటారు. సాధారణంగా అండాశయం సైజు 3 సెం.మీ× 2 సెం.మీ× 1 సెం.మీ ఉంటుంది. అలా కాకుండా అండాశయం పరిమాణం 10 క్యూబిక్‌ సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే కొంచెం పెద్దగా అయిందని అర్థం. ఒకవేళ అండాశయంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ అండాలు ఉంటే అప్పుడు ‘పీసీఓఎస్’ అంటాం. ఇర్రెగ్యులర్‌ పిరియడ్స్‌, పీసీఓఎస్‌ ఈ రెండు సమస్యలను నయం చేయచ్చు.

అయితే మీరు ఈ సమస్యకు గల కారణాల గురించి అడుగుతున్నారు. అండాశయం పెరగడానికి పలు కారణాలున్నాయి. ఇన్ఫెక్షన్‌ వల్ల వాపు రావడం, నెలసరి మధ్యలో అండం పెరగడం, అండాశయంలో ట్యూమర్‌, సిస్ట్‌.. ఇలా ఏది ఉన్నా ఓవరీ పెద్దగా అవుతుంది. అయితే స్కాన్‌ చేసినప్పుడు అండాశయం సాధారణంగానే పెద్దగా అయ్యిందా? సిస్ట్‌, వాపు, ట్యూమర్‌.. వంటి వాటి వల్ల పెద్దగా అయ్యిందా? అన్న విషయాలు తెలుస్తాయి. సోనోగ్రామ్‌లో గర్భాశయం పైన అండాశయం ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిని ‘ఎండోమెట్రియాసిస్’ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు నెలసరిలో బయట బ్లీడింగ్‌ అయినట్టుగానే లోపల కూడా బ్లీడింగ్‌ అవుతుంది. దానివల్ల అండాశయం చుట్టూ, పైన కూడా ఎండోమెట్రియల్‌ టిష్యూ ఏర్పడుతుంది. ఫలితంగా అండాశయం.. గర్భాశయం పక్కన లేదా పైన అతుక్కోవడం జరుగుతుంది. ఈ సమస్య ఉన్నవారికి నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. వారు సమస్యకు గల అసలు కారణాన్ని తెలుసుకొని తగిన చికిత్స అందిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్