రెండుసార్లూ రెండో నెలలోనే అబార్షన్‌.. కారణమేంటి?

నా వయసు 22 సంవత్సరాలు. పెళ్లై రెండేళ్లవుతోంది. నాకు ఇప్పటికే రెండుసార్లు అబార్షన్ అయింది. రెండుసార్లూ రెండో నెలలోనే అయింది. మొదటిసారి అబార్షన్‌ అయిన తర్వాత థైరాయిడ్‌ వచ్చింది. నెల రోజులు మందులు వాడితే....

Published : 20 Jun 2023 20:39 IST

నా వయసు 22 సంవత్సరాలు. పెళ్లై రెండేళ్లవుతోంది. నాకు ఇప్పటికే రెండుసార్లు అబార్షన్ అయింది. రెండుసార్లూ రెండో నెలలోనే అయింది. మొదటిసారి అబార్షన్‌ అయిన తర్వాత థైరాయిడ్‌ వచ్చింది. నెల రోజులు మందులు వాడితే తగ్గిపోయింది. ఇప్పుడు షుగర్‌, థైరాయిడ్‌.. నార్మల్‌గానే ఉన్నాయి. అయినా అబార్షన్ ఎందుకు అయింది? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీకు రెండుసార్లు అబార్షన్ అయింది.. మొదటిసారి అబార్షన్‌ అయినప్పుడు థైరాయిడ్‌ సమస్య వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం షుగర్‌, థైరాయిడ్‌ స్థాయులు సాధారణంగానే ఉన్నాయని చెబుతున్నారు. సాధారణంగా గర్భవిచ్ఛిత్తి కావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. జన్యుపరంగా పిండం సరిగా ఏర్పడకపోతే రెండో నెలలో అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. క్రోమోజోముల్లో ఏవైనా తేడాలు ఉన్నా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా థ్రాంబోఫిలియా అనే కండిషన్ వల్ల కూడా అబార్షన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రక్తనాళాల్లో కొన్ని మార్పులు జరగడం వల్ల బేబీకి హార్ట్‌బీట్ ఉండదు. ఇలాంటప్పుడు సాధారణంగా రెండో నెలలోనే అబార్షన్‌ అవుతుంటుంది. ఇవే కాకుండా గర్భసంచిలో ఇన్ఫెక్షన్‌ ఉండడం, థైరాయిడ్‌, డయాబెటిస్‌.. వంటి సమస్యల వల్ల కూడా గర్భవిచ్ఛిత్తి జరుగుతుంటుంది.

మీకు ఇప్పటికే రెండుసార్లు అబార్షన్ అయిందంటున్నారు. కాబట్టి, మీరు ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఈ క్రమంలో మీకున్న సమస్య ఏంటి? ఎందువల్ల అబార్షన్లు అవుతున్నాయి? వంటి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. మీ సమస్యకు తగిన చికిత్స చేయించుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకోవడం మంచిది. అలాగే ఫోలిక్‌ యాసిడ్‌ ట్యాబ్లెట్స్‌ తీసుకోవడం మొదలుపెట్టండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని