ఎవరి మాటా వినడం లేదు.. అతడే కావాలంటోంది!

మా అమ్మాయి వయసు 18 సంవత్సరాలు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తనకు స్నేహితులు ఎక్కువ. కొన్ని నెలల నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. తన స్నేహితుల ద్వారా మాకు ఈ విషయం తెలిసింది.

Published : 21 Nov 2023 12:25 IST

మా అమ్మాయి వయసు 18 సంవత్సరాలు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తనకు స్నేహితులు ఎక్కువ. కొన్ని నెలల నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది. తన స్నేహితుల ద్వారా మాకు ఈ విషయం తెలిసింది. అదే విషయంపై ఇంట్లో పలుమార్లు గొడవలు జరిగాయి. దాంతో ఇరుగుపొరుగు వారికి కూడా మా పాప ప్రేమ విషయం తెలిసిపోయింది. దానివల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. తనకు ఎంత చెప్పినా పరిధి దాటి వ్యవహరిస్తోంది. చాలా మొండిగా ప్రవర్తిస్తోంది. ఈ పరిస్థితిని ఎలా డీల్‌ చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. నేటి యువతరం ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. ప్రేమ విషయంలో హద్దులు మీరుతున్నారు. ఒకప్పుడు పెద్దలకు తెలుస్తుందేమోనని, తెలిస్తే ఏమంటారోనని భయపడేవారు. కానీ, ఇప్పుడు వారికి తెలిసినా మొండిగా వ్యవహరిస్తున్నారు. పెద్దలు చెప్పే మంచీ చెడులు పట్టించుకోకుండా తమ నిర్ణయమే సరైందన్నట్లుగా వాదిస్తున్నారు. మీ పాప విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇది చాలా సున్నితమైన అంశం. ఆవేశంలో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, జాగ్రత్తగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో సమాజం గురించి కాసేపు పక్కన పెట్టి తల్లిదండ్రులుగా మీ అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించండి.

యుక్త వయసులో పిల్లలు ఎక్కువగా తమ సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో సమాజంలో విలువలు, సంప్రదాయాలు వంటివేవీ పట్టించుకోవట్లేదు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాల్సి ఉంటుంది. సమాజం, కుటుంబ మర్యాదలు.. వంటి వాటి ప్రస్తావన లేకుండా ముందు ఆమె భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఆమె తుది నిర్ణయమేంటో ఓసారి తనతోనే మాట్లాడితే స్పష్టమవుతుంది. ఈ క్రమంలో ఆమె ప్రేమను గౌరవిస్తూనే ఇరువురికీ ఆమోదయోగ్యమైన రీతిలో చర్చించండి. అంతేకానీ ఆమెను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే మరింత మొండిగా మారే అవకాశం ఉంటుంది. అలాగే 18 ఏళ్ల వయసులో ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా.. అదే ప్రేమని నమ్మేస్తుంటారు చాలామంది. కాబట్టి ముందుగా మీ అమ్మాయికి ఈ రెండింటి మధ్య ఉన్న తేడా గురించి వివరించండి. ఈ వయసులో ఇలాంటి వ్యవహారాల కంటే చదువుపై పూర్తి దృష్టి పెడితే భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని నచ్చచెప్పండి. మీరు ఇలా ఆమె మనసును నొప్పించకుండా మాట్లాడడం వల్ల మంచేదో, చెడేదో తాను అర్థం చేసుకోగలుగుతుంది. క్రమంగా తన పొరపాట్లేవైనా ఉంటే తెలుసుకోగలుగుతుంది. అయితే ఇన్ని చేసినా మొండి ప్రవర్తన వీడకపోతే, మారనంటే మాత్రం ఓసారి మానసిక నిపుణుల్ని సంప్రదించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని