అక్కడ వెంట్రుకలు ఒత్తుగా వస్తున్నాయి..!
నా వయసు 23 సంవత్సరాలు. నా పైపెదవి పైన అవాంఛిత రోమాలున్నాయి. త్రెడింగ్ చేయించుకుంటే వెంట్రుకలు ఇంకా ఒత్తుగా వస్తున్నాయి. వీటిని శాశ్వతంగా తొలగించుకోవడానికి ఏవైనా...
నా వయసు 23 సంవత్సరాలు. నా పైపెదవి పైన అవాంఛిత రోమాలున్నాయి. త్రెడింగ్ చేయించుకుంటే వెంట్రుకలు ఇంకా ఒత్తుగా వస్తున్నాయి. వీటిని శాశ్వతంగా తొలగించుకోవడానికి ఏవైనా మార్గాలున్నాయా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. ఈ మధ్య అమ్మాయిల్లో పైపెదవి పైన, గడ్డం దగ్గర, సైడ్‌లాక్స్ దగ్గర అవాంఛిత రోమాలు రావడం ఎక్కువైంది. దీన్ని ‘హిర్సుటిజం’ అంటారు. ఇది ఉన్నవారిలో పురుషులకు ఎక్కడ వెంట్రుకలు వస్తాయో మహిళలకు కూడా అదే ప్రాంతంలో ఒత్తుగా వెంట్రుకలు వస్తుంటాయి. చాలామందిలో పీసీఓఎస్ కారణంగా ఈ సమస్య వస్తుంటుంది. ఇక మరికొంతమందికి ఎలాంటి హార్మోన్ల సమస్య లేకపోయినా పైపెదవి పైన, గడ్డం దగ్గర వెంట్రుకలు వస్తుంటాయి. ఇది వంశపారంపర్యంగా వస్తుంటుంది. దీనిని ‘హైపర్‌ట్రైకోసిస్’ అంటారు.
హిర్సుటిజం సమస్య ఉన్నప్పుడు దానికి గల కారణాన్ని తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే మొదట అందుకు తగిన చికిత్స తీసుకుని ఆ తర్వాత వెంట్రుకల పెరుగుదలను ఆపడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ అప్పటికే వెంట్రుకలు ఒత్తుగా పెరిగి ఉంటే వాటిని తొలగించడానికి పర్మనెంట్ హెయిర్ లేజర్ రిడక్షన్ ట్రీట్‌మెంట్ చేస్తుంటారు. అయితే లేజర్ ట్రీట్‌మెంట్‌లోనూ పలు రకాలుంటాయి. ఇందులో ట్రిపుల్ వేవ్‌లెంగ్త్ లేజర్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది వివిధ దశల్లో ఉన్న హెయిర్ ఫాలికల్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఈ ట్రీట్‌మెంట్‌ని నెలకోసారి చేయించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఆరు నుంచి ఎనిమిది సెషన్లలో అవాంఛిత రోమాల సమస్య తగ్గిపోతుంది. అయితే పీసీఓఎస్, హార్మోన్ల అసమతుల్యత ఉన్నవారికి ఎక్కువ సెషన్లు తీసుకోవాల్సి వస్తుంది. అవాంఛిత రోమాలకు గల అసలు సమస్యను తెలుసుకుంటే సెషన్ల సంఖ్యను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సమస్యను గుర్తించి, ఆ తర్వాత సరైన పద్ధతిలో హెయిర్ లేజర్ చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.