నా వల్లే పెళ్లి చేసుకోలేకపోతున్నాడేమో...?!

నా వయసు 33 సంవత్సరాలు. పెళ్లై ఆరేళ్లవుతోంది. పెళ్లికి మూడు సంవత్సరాల ముందు క్యాంప్‌లో నాకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్ది రోజులకే మేము మంచి స్నేహితులుగా మారాం. నేను అప్పుడే నా వృత్తిగత జీవితాన్ని...

Published : 05 Jun 2023 18:16 IST

నా వయసు 33 సంవత్సరాలు. పెళ్లై ఆరేళ్లవుతోంది. పెళ్లికి మూడు సంవత్సరాల ముందు క్యాంప్‌లో నాకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. కొద్ది రోజులకే మేము మంచి స్నేహితులుగా మారాం. నేను అప్పుడే నా వృత్తిగత జీవితాన్ని ప్రారంభించాను. అతను మాస్టర్స్‌ చేస్తున్నాడు. అలా మూడు సంవత్సరాల పాటు మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం. పెళ్లైన తర్వాత నా భర్త ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాం. ఆ తర్వాత పనుల్లో బిజీగా మారడంతో నా స్నేహితులతో మాట్లాడడం చాలా వరకు తగ్గించాను. కానీ అతనితో మాత్రం అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో చాట్‌ చేసేదాన్ని. న్యూ ఇయర్‌, పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. అలా గత వారం ఓసారి ఫోన్‌లో మాట్లాడుకున్నాం. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. అతని వయసు 37 సంవత్సరాలు. దాంతో నేను ఎప్పుడూ ‘పెళ్లి కాని ప్రసాదూ!’ అని టీజ్‌ చేసేదాన్ని. అలానే ఈసారి కూడా చేశాను. అప్పుడు అతను సడన్‌గా ‘నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు?’ అని అడిగాడు. ‘పెళ్లి చేసుకోవాలనుకున్నాను.. కాబట్టి చేసుకున్నాను’ అని చెప్పాను. అందుకు ‘నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు.. కాబట్టి చేసుకోలేదు’ అని బదులిచ్చాడు. దాంతో ఒక్కసారిగా నా నోట మాట ఆగిపోయింది. మేము మొదట కలిసినప్పటి నుంచి అతను నన్ను ప్రేమిస్తున్నాడని అనిపించింది. చాలాసార్లు అలాంటి సంకేతాలు అతడి నుంచి వచ్చినా నేను పట్టించుకోలేదు. వెంటనే ఫోన్‌ కట్‌ చేసి చాలా సేపు ఏడ్చాను. అతను చాలా మంచి వ్యక్తి, సున్నిత మనస్కుడు. అతను మరొకరి ప్రేమను పొందలేకపోవడానికి నేను కారణం కావాలనుకోవడం లేదు. కానీ ఈ విషయం అతనితో ఎలా చెప్పాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మిమ్మల్ని ఆ వ్యక్తి ప్రేమిస్తున్నానని చెప్పినట్టుగా మీరు ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే గతంలో జరిగిన సంఘటనలను ఇప్పుడు ప్రేమ సంకేతాలుగా భావిస్తున్నారు. మీ వల్లే అతను పెళ్లి చేసుకోలేదని, దానివల్ల అతను మరొకరి ప్రేమను పొందలేకపోతున్నారని అనుకుంటున్నారు. మీరు ఒక వైవాహిక బంధంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఎవరి జీవితానికి బాధ్యులు కారు. కానీ, మీ జీవితానికి మాత్రం మీరే బాధ్యులు అవుతారు.

పెళ్లి తర్వాత చాలామంది స్నేహితులతో సంబంధాలు దూరమయ్యాయని అంటున్నారు. కానీ, సంవత్సరంలో ఒకటి, రెండు సార్లు మాత్రం అతనితో మాట్లాడుతున్నానని చెబుతున్నారు. అలాగే మీరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. కాబట్టి పెళ్లి చేసుకున్నారు. కానీ అతను అలా అనుకోవడం లేదు. కాబట్టి, పెళ్లికి దూరంగా ఉంటున్నారు. ఇది అతని వ్యక్తిగత నిర్ణయం. అతని నిర్ణయానికి మిమ్మల్ని నిందించుకోవాల్సిన అవసరం లేదు. కానీ, అతని ప్రస్తుత పరిస్థితికి మీరు చింతిస్తున్నారని అర్థమవుతోంది. అతను సున్నితమైన వ్యక్తి కాబట్టి అతనితో ఈ విషయాల గురించి చర్చించలేకపోతున్నారని చెబుతున్నారు. కానీ, మీకు ఒక స్పష్టత రావాలంటే అతనితో చర్చించడం ముఖ్యం. ఈ క్రమంలో మీ ప్రాధాన్యాలు, లక్ష్యాలు ఏంటి? అన్న విషయాలను మర్చిపోకూడదు. ఒకవేళ అప్పటికీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించండి. వారు తగిన సలహా ఇస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్