Updated : 28/05/2022 13:06 IST

ఆ విషయం నా భర్తతో చెబుతానని బెదిరిస్తున్నాడు..

నేను సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నాను. నాకు పెళ్లై మూడు సంవత్సరాలవుతోంది. నాకు రెండేళ్ల పాప ఉంది. పెళ్లి కాకముందు నుంచే నేను జాబ్‌ చేస్తున్నాను. మొదట్లో నేను ఫ్రెషర్‌ కావడం వల్ల పని విషయంలో నా సీనియర్ చాలా హెల్ప్‌ చేసేవాడు. నేను అతన్ని బాగా నమ్మాను. దాంతో నా వ్యక్తిగత విషయాలు అడిగినా చెప్పా. ఒక్కోసారి పని నేర్పిస్తానని రూమ్‌కి రమ్మనేవాడు. సరేనని వెళ్లేదాన్ని. మొదట్లో బాగానే ఉన్నాడు. ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆఫీసులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని నేను ఏమీ అనలేకపోయేదాన్ని. అయితే నేను అతనితో నా పరిధి దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదు.

నాకు పెళ్లి కుదిరిన తర్వాత కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్నాడు. కానీ పెళ్లై, పాప పుట్టాక ఇప్పుడు మళ్లీ నన్ను ప్రేమిస్తున్నానని టార్చర్‌ చేస్తున్నాడు. నేను అతన్ని చీట్‌ చేశానని, వాడుకున్నానని అంటున్నాడు. ఇప్పుడు పెళ్లికి ముందులాగా ఉండమని, లేకపోతే నా భర్తతో చెబుతానని బెదిరిస్తున్నాడు. నా భర్తకి నేను అబ్బాయిలతో మాట్లాడడమే నచ్చదు. ఈ విషయం తెలిస్తే విడాకులు ఇస్తాడు. నా కొలీగ్‌ని ఎంత బతిమాలినా వినడం లేదు. తన కోరిక తీర్చమని టార్చర్‌ పెడుతున్నాడు. నాకు అతనంటే ఇష్టం లేదు. అతనిపై ఎలాంటి ఫీలింగ్స్‌ కూడా లేవు. అయినా సరే- ‘నీ భర్తతో వ్యక్తిగతంగా ఎలా ఉంటావో చెప్పు.. లేకపోతే అతనితో మన విషయం చెప్తా’ అని బెదిరిస్తున్నాడు. అతని దగ్గర నేను చాట్‌ చేసిన మెసేజ్‌లు ఉన్నాయి. వాటిని సేవ్‌ చేసుకున్నాడు. నా బాధంతా నా భర్తకు చెప్పాలని ఉన్నా.. చెప్పలేకపోతున్నా. సంవత్సరం నుండి టార్చర్‌ చేస్తున్నాడు. నాకు నా భర్త, పాప కావాలి. పైగా సొంతూరులో మావి ఉన్నత విలువలున్న కుటుంబాలు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి

జ. మీరు మొదట్నుంచి అతనితో ఖచ్చితంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదేమో.. అతని అసభ్య ప్రవర్తనకు మీరు మొదటే అడ్డుకట్ట వేయకపోవడంతో ఎలాంటి భయం లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడనిపిస్తోంది. అయితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ మనసులో ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పండి. ఇప్పటి నుంచైనా అతనితో కఠినంగా వ్యవహరించండి. మీరు మీ పరిధి దాటి అతనితో ప్రవర్తించలేదని చెబుతున్నారు. కాబట్టి, కేవలం అతనితో చాట్‌ చేసినంత మాత్రాన మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఆఫీసులోనైనా సహోద్యోగులతో చాట్‌ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ అనేది అర్థం చేసుకోండి. అతని అసభ్య ప్రవర్తన గురించి తోటి ఉద్యోగులకు తెలిసే విధంగా సూచనలివ్వండి. అలాగే అతను ఒంటరిగా రమ్మన్నప్పుడు అతనికి దూరంగా ఉంటూ స్నేహితులతో గడిపేలా చూసుకోండి. మీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేనప్పుడు అతను ఏదైనా అంటే దానికి మీరు బాధ్యులు కాదన్న విషయాన్ని తెలుసుకోండి.

మిగతా వారితోనూ అలానే చేస్తున్నాడా..?

వర్తమాన పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలకు ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి మీ సమస్యను ఉన్నత అధికారులు, మానవ వనరుల విభాగం వారికి మొదట సూచనప్రాయంగా తెలిపే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత తగిన సాక్ష్యాధారాలతో మిమ్మల్ని ఏవిధంగా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడో వివరించండి. ఒకరితో అసభ్యంగా ప్రవర్తిస్తోన్న వ్యక్తి మిగతావారితోనూ అసభ్యంగా ప్రవర్తించరన్న గ్యారంటీ లేదు. కాబట్టి, మీలాగే బయటకు చెప్పకుండా ఇబ్బంది పడుతోన్నవారు ఎవరైనా ఉన్నారేమో చూడండి. ఒక సమస్యను కలిసికట్టుగా చెప్పినప్పుడు ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి, అలా మీకు ఎవరైనా కనిపించినప్పుడు వారితో కలిసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అలాగే మీ భర్తకి ఉద్యోగ జీవితంలో ఇతర ఉద్యోగులతో మాట్లాడడం సాధారణమేనన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేయండి. అలాగే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మీకు మీరు కొన్ని పరిధులు గీసుకోండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని