జింక్‌ లోపం ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

డాక్టర్‌ గారు.. నా వయసు 35 సంవత్సరాలు. నాకు రక్తపరీక్షలో జింక్‌ స్థాయి 55.5 mcg/dL గా ఉంది. ఇది సాధారణమేనా? లేదా నాకు జింక్‌ లోపం ఉందా? ఒకవేళ జింక్‌ లోపం ఉంటే ఎలాంటి సమస్యలు...

Published : 26 Jun 2023 13:17 IST

డాక్టర్‌ గారు.. నా వయసు 35 సంవత్సరాలు. నాకు రక్తపరీక్షలో జింక్‌ స్థాయి 55.5 mcg/dL గా ఉంది. ఇది సాధారణమేనా? లేదా నాకు జింక్‌ లోపం ఉందా? ఒకవేళ జింక్‌ లోపం ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? ఇందుకు ఏమేం జాగ్రత్తలు పాటించాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మీరు రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు జింక్‌ స్థాయి 55.5 mcg/dL గా ఉందని చెప్పారు. సాధారణంగా జింక్‌ స్థాయి 70 mcg/dL నుంచి 120 mcg/dL గా ఉండాలి. అంటే మీకు ఉండాల్సిన స్థాయి కంటే తక్కువగా ఉంది. జింక్‌ అనేది ఒక ట్రేస్‌ ఎలిమెంట్‌. ఇది చాలా ముఖ్యమైంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరులో క్రోమియం, జింక్‌, సెలీనియం వంటి మినరల్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. జింక్‌ స్థాయి తక్కువగా ఉన్నప్పుడు జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారడం, తొందరగా అలసిపోవడం, నిద్ర ఎక్కువగా రావడం, బద్ధకం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. థైరాయిడ్‌ లక్షణాలు కూడా దాదాపు ఇదేవిధంగా ఉంటాయి.

జింక్‌ లోపం ఉన్నవారు దానిని భర్తీ చేసుకోవడానికి జింక్‌ ఉన్న మల్టీ విటమిన్‌ మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వేరే విటమిన్ల లోపం కూడా ఉందా? లేదా? అనేది కూడా చెక్‌ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా క్రోమియం, సెలీనియం, బి 12, బి 1, విటమిన్ సి, విటమిన్ డి-3 కూడా చెక్‌ చేయించుకోవాలి. వీటిలో ఏవి అవసరమైన వాటికంటే తక్కువగా ఉన్నాయో.. అందుకు సరిపడ మల్టీ విటమిన్ మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో విటమిన్‌ లోపం ఉన్నప్పుడు ఒక్కో సమస్య ఉంటుంది. ఉదాహరణకు బి 12 తీసుకోకపోతే తిమ్మిర్లు, బి 1 తీసుకోకపోతే మతిమరుపు వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి, మీకు ఏయే విటమిన్ల లోపం ఎక్కువగా ఉందో అవి అధికంగా ఉన్న మల్టీ విటమిన్‌ మాత్రలను ప్రతి రోజూ వేసుకుంటే సమస్య నుంచి బయటపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని