Updated : 25/02/2023 21:04 IST

అక్కడ చర్మం నల్లగా మారుతోంది.. ఏం చేయాలి?

నా వయసు 25 సంవత్సరాలు. నాకు ఎండ పడే చోట అంటే ముఖం, మెడ, చేతుల దగ్గర చర్మం నల్లగా అవుతోంది. ఎన్ని మాయిశ్చరైజర్లు వాడినా సమస్య తగ్గడం లేదు. ఇలా చర్మం రంగు నల్లగా మారడానికి గల కారణాలు ఏంటి? ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి.

జ. చాలామందిలో చర్మం నల్లగా మారే సమస్య ఉంటుంది. దీనికి కారణం మన దేశంలో ఉండే వాతావరణమే. మన దగ్గర సంవత్సరంలో ఎక్కువశాతం సూర్యరశ్మి ఉంటుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలను చర్మం గ్రహించి ప్రతిచర్య జరుపుతుంటుంది. దీనివల్ల దుస్తులు ధరించని ప్రాంతంలో అంటే ముఖం, మెడ, చేతులు, వీపు వెనక భాగంలో దురద, ఇరిటేషన్‌ వంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాంతం నల్లగా మారుతుంటుంది. ఇలాంటి వారు బయటకు వెళ్లినప్పుడు సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా రాసుకోవాలి. అయితే అన్ని రకాల సన్‌స్క్రీన్‌లు అందరికీ సరిపడవు. చర్మతత్వాన్ని బట్టి సన్‌స్క్రీన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా చర్మతత్వానికి సంబంధించిన పరీక్షలు చేసుకోవడం మంచిది. అలాగే సన్‌స్క్రీన్‌లో ఎస్‌పీఎఫ్‌ (సన్ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌) అనేది ఉంటుంది. ఇది 25 కంటే ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు వస్తుంటాయి.

కొంతమంది రోజులో ఒక్కసారి మాత్రమే సన్‌స్క్రీన్‌ రాసుకుంటారు. దీనివల్ల ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే సన్‌స్క్రీన్‌ ప్రభావం అప్లై చేసిన మూడు గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత బయటే ఉంటే మరోసారి రాసుకోవాలి. అలాగే మరికొంతమంది చల్లగా ఉందని, వర్షం పడుతుందేమోనని సన్‌స్క్రీన్‌ రాసుకోవడం మానేస్తుంటారు. ఇది కూడా మంచిది కాదు. వెలుగు ఉన్నంతసేపు దాని ప్రభావం చర్మంపై ఉంటుంది. కాబట్టి, బయటకు వెళ్లిన ప్రతిసారీ సన్‌స్క్రీన్‌ రాసుకోవడం మంచిది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని