Dating: వారిని మొదటిసారి కలుస్తున్నారా?

సాధారణంగానే ఎవరైనా కొత్త వ్యక్తిని కలవాలంటే మనసంతా బెరుగ్గా అనిపిస్తుంటుంది. అలాంటిది మనసుకు నచ్చిన వారిని /మనువాడాలనుకుంటోన్న వారిని తొలిసారి కలవడమంటే..

Published : 02 Mar 2023 18:54 IST

సాధారణంగానే ఎవరైనా కొత్త వ్యక్తిని కలవాలంటే మనసంతా బెరుగ్గా అనిపిస్తుంటుంది. అలాంటిది మనసుకు నచ్చిన వారిని /మనువాడాలనుకుంటోన్న వారిని తొలిసారి కలవడమంటే.. కారణం తెలియదు కానీ మనసులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. దీన్నే ‘డేటింగ్‌ యాంగ్జైటీ’ అని చెబుతున్నారు నిపుణులు. మరి, ఇదే భయంతో వారిని కలవడానికి వెళ్తే.. తొలి మీటింగ్‌ని పూర్తిగా ఆస్వాదించలేం. అందుకే ఈ సమస్యను అధిగమించి.. వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం ఈ చిన్న చిన్న విషయాలు దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.

నచ్చిన చోట.. నచ్చినట్లుగా!

నచ్చిన వ్యక్తితో తొలిసారి డేట్‌కి వెళ్లే క్రమంలో చాలామంది కాస్త విలాసవంతంగా ఉండే హోటల్స్‌, ప్రదేశాల్ని ఎంచుకుంటారు. అలాగే వారికి స్టైలిష్‌గా కనిపించాలన్న ఉద్దేశంతో దుస్తుల విషయంలోనూ అతి శ్రద్ధ చూపిస్తుంటారు. అయితే ఇక్కడ లగ్జరీ కంటే సౌకర్యమే ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే మనకు తెలిసిన, సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే గొప్పలకు పోయి నప్పని దుస్తులు వేసుకొని ఇబ్బంది పడే కంటే.. నప్పిన, సౌకర్యవంతంగా ఉండే దుస్తుల్లో మరింత హుందాగా కనిపించచ్చు. తద్వారా మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.


ముందే ప్రిపేరయ్యారా? లేదా?

ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ఎదుటివారు అడిగే ప్రశ్నలు, ఇతర అంశాల గురించి ఎలాగైతే ముందుగానే సన్నద్ధమవుతామో.. తొలిసారి డేట్ కి వెళ్లినప్పుడూ ఇలాంటి ప్రిపరేషన్‌ కావాలంటున్నారు నిపుణులు. తద్వారా తీరా వెళ్లాక కంగారు పడాల్సిన అవసరం ఉండదంటున్నారు. ఈ క్రమంలో వారిని మీరు అడగాలనుకుంటున్న ప్రశ్నలు, అడగకూడని ప్రశ్నలేంటో విడివిడిగా నోట్‌ చేసుకొని పెట్టుకోవాలి. తద్వారా అనవసర ప్రశ్నలతో సమయం వృథా కాకుండా ఉంటుంది.


ఉన్నది ఉన్నట్లుగా..!

‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ది బెస్ట్‌ ఇంప్రెషన్‌’ అంటుంటారు. అది మీ ఆహార్యంలోనే కాదు.. హావభావాలు, మాట తీరులోనూ తొణికిసలాడాలంటున్నారు నిపుణులు. అవతలి వారు అడిగిన ప్రశ్నలకు మీరు ఎలా స్పందిస్తున్నారన్న దాని పైనే ఇది ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి విషయంలోనూ మీరు నిజాయతీగా వ్యవహరించడం ముఖ్యం. అప్పుడే మీ ముఖంలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అయితే కొంతమంది వివిధ కారణాల వల్ల తమ పాత బంధాలు, లవ్‌ ఫెయిల్యూర్స్‌.. వంటి వాటి గురించి దాచిపెడుతుంటారు. ఇది మీ మాట తడబాటుతో అవతలి వారికి తెలియడం కంటే.. నేరుగా మీరే వారితో నిజం చెప్పడం మేలు! ఇలా మీరు నిజాయతీగా ఉంటే.. వాళ్లూ తమ గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది భవిష్యత్తులో మీ ఇద్దరి జీవితాలకూ మంచిది కూడా!


మొహమాటం వద్దు..

ఎదుటివారు ఏమనుకుంటారోనని మొహమాటపడడం, వాళ్లు వేసే జోక్‌లకు నవ్వు రాకపోయినా నవ్వడం, వాళ్లేదంటే అదే కరక్ట్‌ అని అనడం.. కొంతమందిలో ఇలాంటి ప్రవర్తనను చూస్తుంటాం. అయితే దీనివల్ల ‘భవిష్యత్తులో నేనేం చేసినా, ఎలా ప్రవర్తించినా చెల్లుతుంది..’ అనే భావన అవతలి వారిలో ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. దీనివల్ల ముందు ముందు వారే మీ జీవిత భాగస్వామి అయితే కొన్ని సందర్భాల్లో నష్టపోయేది మీరే అని గుర్తుపెట్టుకోండి. అందుకే తొలి డేట్‌లోనే మీ మనసులోని ఫీలింగ్స్‌/భావోద్వేగాల్ని నిర్మొహమాటంగా పంచుకోవడం మంచిది. తద్వారా మీరు కచ్చితమైన వ్యక్తి అని వారికి అర్థమవుతుంది.


ఈ భయాలు వీడండి!

కొంతమంది తమలోని లోపాల్ని దృష్టిలో ఉంచుకొని, మరికొందరు అవతలి వారు తమనెక్కడ తిరస్కరిస్తారోనని, ఇంకొందరు కొత్త వారితో మమేకం కాలేమని.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో భయం ఉంటుంది. తొలిసారి డేట్‌కు వెళ్తున్నప్పుడు ఇలాంటి భయాల్ని అధిగమించడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అప్పుడే ఇద్దరూ ఒకరితో ఒకరు పారదర్శకంగా వ్యవహరించే ఆస్కారం ఉంటుందంటున్నారు. అయితే ఇది సాధ్యం కావాలంటే ఎవరి శరీరాన్ని వారు ప్రేమించుకోవడం, తామెలా ఉన్నా తమను తాము అంగీకరించుకోవడం, తమ లోపాల్ని కూడా ప్రత్యేకతలుగా భావించి నిండైన ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం ముఖ్యం. నిజానికి ఇదే మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్