మధుమేహం ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

మధుమేహంతో బాధపడే మహిళలు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకునే ముందే కొన్ని రకాల జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలంటున్నారు. అప్పుడే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వగలుగుతారని చెబుతున్నారు. మరి, ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

Published : 07 Aug 2023 17:58 IST

పండంటి బిడ్డకు జన్మనివ్వాలంటే.. నవమాసాలే కాదు.. ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకునే ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి! అయితే కొంతమంది మహిళల్లో ఉండే కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు గర్భధారణపై ప్రతికూల ప్రభావం చూపుతుంటాయి. మధుమేహం కూడా అలాంటిదే! రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోవడం వల్ల పిండం ఏర్పడడం క్లిష్టంగా మారడమే కాదు.. ఒకవేళ గర్భం ధరించినా.. పుట్టబోయే బిడ్డలో అవకరాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే మధుమేహంతో బాధపడే మహిళలు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకునే ముందే కొన్ని రకాల జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలంటున్నారు. అప్పుడే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వగలుగుతారని చెబుతున్నారు. మరి, ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

మధుమేహంతో బాధపడే మహిళల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు పెరిగిపోవడం వల్ల అండం ఫలదీకరణ చెందడం కష్టమవుతుంది. దీంతో పాటు పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడంతో ఎక్కువగా దాహం వేస్తుంటుంది. నీరసం, అలసట వేధిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో గర్భం దాల్చడం సవాలుగా మారుతుంది. ఒకవేళ గర్భం ధరించినా.. ఈ అధిక గ్లూకోజ్‌ స్థాయులు తొలి దశ ప్రెగ్నెన్సీపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ దశలోనే బిడ్డ మెదడు, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు.. తదితర అవయవాలు ఏర్పడడం ప్రారంభమవుతుంది. ఇదే సమయంలో మధుమేహం కారణంగా ఈ అవయవాలు సరిగ్గా ఏర్పడక.. పుట్టబోయే బిడ్డలో అవకరాలు వచ్చే ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు.

అదుపులోకి తెచ్చుకున్నాకే..!

ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకునే ముందే కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవడం మామూలే. ఈ క్రమంలో అధిక బరువు, నెలసరి సమస్యలు, గర్భ నిరోధక పద్ధతులేమైనా పాటించారా? దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలేవైనా ఉన్నాయా? ఉంటే.. వాటికి ఎలాంటి మందులు వేసుకుంటున్నారు..? వంటివన్నీ వైద్యులు పరీక్షిస్తారు. అప్పుడే గర్భం ధరించడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా? అనే విషయం తెలుస్తుంది. అయితే మధుమేహంతో బాధపడే మహిళలూ ఇదే విధంగా రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయుల్ని పరీక్షించుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. చక్కెర స్థాయుల్ని అదుపు చేసేందుకు అవసరమైతే మందులు మార్చడం లేదంటే జీవనశైలి అలవాట్ల గురించి సలహాలివ్వడం.. వంటివి చేస్తారు. ఇలా ముందుగా మధుమేహాన్ని అదుపులోకి తీసుకురావడానికి వైద్యులు ప్రయత్నిస్తారు. ఆ తర్వాతే అటు మందులు వాడుతూ, ఇటు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవడానికి సిద్ధం చేస్తారు. అంతేకాదు.. గర్భం ధరించాక కూడా నిర్ణీత వ్యవధుల్లో చెకప్స్‌కి వెళ్లడం వల్ల ఎదిగే బిడ్డలో ఏవైనా సమస్యలుంటే త్వరగా గుర్తించి, సులభంగా పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు.

నెలసరిపై ప్రభావమెంత?

గర్భం ధరించాలంటే నెలసరి సక్రమంగా రావడం ముఖ్యం. కానీ మధుమేహుల్లో రక్తంలోని అధిక చక్కెరల కారణంగా రుతుచక్రంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నెలసరి రాకపోవడం, వచ్చినా అధిక రక్తస్రావమవడం, ఎక్కువ కాలం పాటు నెలసరి కొనసాగడం.. వంటి సమస్యలొస్తాయి. ఫలితంగా అండం ఎప్పుడు విడుదలవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీనికి తోడు ఒత్తిడి, బరువు పెరిగిపోవడం.. వంటివీ గర్భధారణకు అడ్డంకులుగా మారతాయి. అయితే ఇలా మధుమేహం నెలసరి పైనే కాదు.. నెలసరి సమయంలో హార్మోన్లలో హెచ్చుతగ్గుల ప్రభావం రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయుల పైనా పడుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా ఇన్సులిన్‌ ఎక్కువగా ఉత్పత్తై చక్కెర స్థాయులు పెరుగుతాయి. కాబట్టి గర్భధారణకు ఆటంకం కలిగించే ఈ రెండు సందర్భాల్ని ఎదుర్కోవాలంటే.. డాక్టర్‌ సలహా మేరకు అటు మధుమేహాన్ని అదుపు చేసుకోవడం, ఇటు నెలసరి సమస్యలేవైనా ఉంటే పరిష్కరించుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఆహారంలో ఈ మార్పులు!

మధుమేహాన్ని అదుపు చేసుకోవాలంటే.. చక్కెరలు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలన్న విషయం తెలిసిందే! అయితే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకునే మధుమేహులు.. తీసుకునే ఆహారం విషయంలో మరింత కచ్చితంగా వ్యవహరించాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పోషకాహార నిపుణుల సూచనల మేరకు ఓ డైట్‌ ఛార్ట్‌ సిద్ధం చేసుకొని ఫాలో అవడం మరీ మంచిదంటున్నారు. ముఖ్యంగా క్యాలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉన్న పదార్థాలకు దూరంగా ఉంటూనే.. చక్కెరలు ఎక్కువగా ఉండే పానీయాల్ని పూర్తిగా పక్కన పెట్టేయడం మంచిది. అలాగే వైద్యుల సలహాతో ఆయా పండ్లు, కాయగూరలతో పాటు.. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, పనీర్‌, పప్పులు, క్వినోవా, చేపలు.. వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. ఇక ఓట్స్‌, మొక్కజొన్న, బ్రౌన్‌ రైస్‌, చిరుధాన్యాలు.. వంటివి రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేయడంలో అద్భుతంగా పని చేస్తాయి. ఇలాంటి ఆహారంతో మధుమేహం అదుపులోకి రావడంతో పాటు గర్భం ధరించే అవకాశాలూ పెరుగుతాయంటున్నారు నిపుణులు.

వారానికి ఐదు రోజులు!

వ్యాయామాలు శారీరక దృఢత్వానికే కాదు.. రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేయడంలోనూ సమర్థంగా పనిచేస్తాయంటోంది ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ)’ సంస్థ. ఈ క్రమంలో నడక, పరుగు, సైక్లింగ్‌, వాటర్‌ ఏరోబిక్స్‌, యోగా.. వంటివి వారానికి ఐదు రోజుల పాటు సాధన చేయడం ముఖ్యమని చెబుతోంది. అంతేకాదు.. ఈ సమయంలో మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ప్రశాంతమైన నిద్రకూ ప్రాధాన్యమివ్వాలంటున్నారు నిపుణులు. ఇవన్నీ రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయుల్ని అదుపు చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేసుకునే క్రమంలో, గర్భిణిగా ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకాలు, సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది.

ఇక గర్భం ధరించాకా.. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతో అవసరం. ఈ క్రమంలో డాక్టర్‌ సలహా మేరకు ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు తీసుకోవడం లేదా మందులు వాడడం, ఎప్పటికప్పుడు గ్లూకోజ్‌ పరీక్షలు చేయించుకోవడం, బిడ్డ ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం.. వంటి జాగ్రత్తలన్నీ కచ్చితంగా పాటిస్తే.. ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనివ్వచ్చంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని