ఫేస్‌వాష్.. అదేపనిగా వద్దు!

సీజన్‌తో సంబంధం లేకుండా తమ ముఖం తాజాగా ఉండాలన్న ఉద్దేశంతో కొంతమంది రోజులో ఎక్కువసార్లు ముఖం శుభ్రం చేసుకుంటుంటారు. అయితే దీనివల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎక్కువసార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం రండి..

Published : 30 Jul 2023 13:05 IST

సీజన్‌తో సంబంధం లేకుండా తమ ముఖం తాజాగా ఉండాలన్న ఉద్దేశంతో కొంతమంది రోజులో ఎక్కువసార్లు ముఖం శుభ్రం చేసుకుంటుంటారు. అయితే దీనివల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎక్కువసార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే ఏమవుతుందో తెలుసుకుందాం రండి..

ఈ పొరపాటు చేయద్దు!

మాటిమాటికీ ముఖం కడుక్కోవడం వల్ల చర్మంపై పేరుకున్న దుమ్ము పోయి శుభ్రపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ, అది పొరపాటు. ఎందుకంటే ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మాన్ని పొడిబారకుండా కాపాడే సీబమ్‌ అనే నూనె పదార్థం తొలగిపోతుంది. ఫలితంగా చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువ. అంతేకాకుండా చర్మం మరింత పొడిబారిపోయి పొలుసులుగా ఊడిపోవచ్చు. అందుకే రోజుకు రెండుమూడు సార్లకు మించి ముఖం కడుక్కోకపోవడమే మేలంటున్నారు నిపుణులు. అది కూడా గాఢత తక్కువగా ఉండే సబ్బు లేదా లిక్విడ్ ఫేస్‌వాష్‌తో మాత్రమే!

చర్మతత్వాన్ని బట్టి..!

ఒక్కొక్కరి చర్మతత్వం ఒక్కోలా ఉంటుంది. కొందరిది జిడ్డు చర్మమైతే, మరికొందరిది పొడిగా ఉంటుంది. ఇంకొందరు సాధారణ చర్మతత్వాన్ని కలిగి ఉంటారు. అయితే చర్మతత్వాన్ని బట్టే రోజుకు ఎన్నిసార్లు ముఖం కడుక్కోవాలనేది ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో సాధారణ చర్మతత్వం గల వారు రోజులో ఒకటి లేదా రెండుసార్లు ఫేస్‌వాష్ చేసుకుంటే చాలు. అలాగే జిడ్డు చర్మతత్వం ఉన్నట్లయితే రెండుమూడుసార్లు ఫేస్‌వాష్ చేసుకున్నా.. ఆ తర్వాత టోనర్‌ని ఉపయోగిస్తే ఎక్కువ సమయం తాజాగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక పొడి చర్మం ఉన్న వారు ఒకట్రెండుసార్లు ముఖం కడుక్కొని.. వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకుంటే ఫలితం ఉంటుంది.

ఎలాంటి ఫేస్‌వాష్ మంచిది?!

మీ చర్మతత్వానికి తగిన ఫేస్‌వాష్‌లను ఎంచుకోవడమూ ముఖ్యమే! అయితే కొందరికి ఎలాంటి ఫేస్‌వాష్‌లైనా నప్పుతాయి. మరికొందరికి గాఢత తక్కువగా ఉండే ఫేస్‌వాష్‌లను ఉపయోగించినా సమస్యలొస్తాయి. కాబట్టి మీరు వాటిని కొనే ముందు దానిపై ఉండే లేబుల్‌ని ఓసారి పరిశీలించాలి. తద్వారా అది ఏ చర్మతత్వానికి సరిపోతుందో తెలుస్తుంది. అలాగే వాడే ముందు ఓసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేయడమూ మర్చిపోవద్దు.

తేమ కోల్పోకుండా..!

చర్మం తేమగా ఉన్నప్పుడే తాజాగా కనిపిస్తుంది. ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి లేనిపోని సమస్యలొస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే.. ముఖాన్ని పదే పదే శుభ్రం చేసుకోకపోవడంతో పాటు ఈ చిట్కాను పాటించడం మంచిదంటున్నారు నిపుణులు.

స్నానం చేయడానికి ముందు బాదం నూనెను ముఖానికి, శరీరానికి బాగా పట్టించాలి. అలా గంట పాటు వదిలేస్తే చర్మపోషణకు అవసరమయ్యే పోషకాలు చర్మంలోకి ఇంకుతాయి. ఫలితంగా చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

అలాగే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. ఫేస్‌వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు పదే పదే నీటితో ముఖం కడుక్కోవడానికి బదులుగా.. ఒక్కోసారి తడిగా ఉండే వైప్స్‌ని ఉపయోగించచ్చు. లేదంటే మరికొన్నిసార్లు టిష్యూస్‌తోనూ ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని