Published : 18/02/2022 19:44 IST

IPL Auction: జుహీ ముద్దుల కూతురి గురించి ఈ విశేషాలు తెలుసా?

(Photo: Instagram)

పిల్లలు ప్రయోజకులైనప్పుడు అది చూసి తల్లిదండ్రుల మనసు ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. నిన్న మొన్నటిదాకా నా కొంగు పట్టుకొని తిరిగిన నా చిన్నారి ఇంతలోనే అంతగా ఎదిగిపోయిందా అంటూ తల్లి హృదయం మురిసిపోతుంది. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే తేలియాడుతోంది అలనాటి బాలీవుడ్‌ అందాల తార జుహీ చావ్లా. ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో తన కూతురు జాన్వి ఉత్సాహంగా పాల్గొనడం చూసి మురిసిపోయింది. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌పై తనకున్న మక్కువ ఈనాటిది కాదని.. చిన్నతనం నుంచే తనో పెద్ద క్రికెట్ లవర్‌ అంటూ తన ముద్దుల కూతురిని ప్రశంసిస్తూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది జుహీ. పుత్రికోత్సాహానికి ప్రతిరూపంగా నిలిచే ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

90ల్లో నటిగా అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో తన జట్టు తరఫున ఆమె కూతురు జాన్వి మెహతా, షారుఖ్‌ ఖాన్‌ (కేకేఆర్‌ సహ యజమాని) పిల్లలు ఆర్యన్‌ ఖాన్‌, సుహానా ఖాన్‌లు పాల్గొన్నారు. అయితే 2018లో జరిగిన వేలంలో ఈ జట్టు తరఫున జాన్వి, ఆర్యన్‌ భాగమయ్యారు. ఆ సమయంలో జాన్వికి 17 ఏళ్లు. దీంతో అప్పుడు ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచిందీ సెలబ్రిటీ కిడ్.

తనో క్రికెట్‌ లవర్!

ఇక ఈసారి కూడా ఈ మెగా వేలంలో ఎంతో ఉత్సాహంగా కనిపించింది జాన్వి. క్రికెట్‌పై తనకున్న మక్కువే ఆమెను ఇటువైపుగా నడిపిస్తోందంటోంది ఆమె తల్లి జుహీ. ఈ క్రమంలోనే తన కూతురు ఓ పెద్ద క్రికెట్‌ లవర్‌ అని.. దాని వెనకున్న ఓ కథను సుదీర్ఘ ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చింది జుహీ.

తన కూతురితో దిగిన ఫొటోలను కొలేజ్‌ చేసి రూపొందించిన వీడియోను పంచుకుంటూ.. ‘చిన్నతనం నుంచే జాన్వికి క్రికెట్‌ అంటే ఇష్టం. దీంతో ఐపీఎల్‌ మాత్రమే కాదు.. ఏ క్రికెట్‌ మ్యాచ్‌ వచ్చినా వదలకుండా చూసేది. క్రికెట్‌ కామెంట్రీ వింటూ ఆటను పూర్తిగా అర్థం చేసుకునేది. అయితే ఆమెకు 12 ఏళ్లున్నప్పుడు మేమంతా కలిసి బాలీ ట్రిప్‌కి వెళ్లాం. అక్కడి హోటల్‌లోని కాఫీ టేబుల్‌పై టెలిఫోన్ డైరెక్టరీ అంత పెద్ద పుస్తకం ఉంది. ప్రపంచంలోని క్రికెటర్లందరి జీవితకథలు, విజయాలు, రికార్డులు.. వంటివన్నీ అందులో పొందుపరిచారు. మేము ఆ హోటల్‌లో బస చేసిన కొద్ది రోజుల్లోనే ఆ పుస్తకం చదవడం పూర్తి చేసింది జాన్వి. 12 ఏళ్ల అమ్మాయి అంత పెద్ద పుస్తకాన్ని ఇంత త్వరగా చదివేసిందా అని ఆశ్చర్యపోయాం. అంతేకాదు.. ఆటపై తనకున్న మక్కువేంటో అప్పుడు మాకు అర్థమైంది.

మనసు మాట వింటుంది!

క్రికెట్‌ గురించి చర్చించినప్పుడల్లా తన ముఖం వెలిగిపోతుంది. ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కనిపిస్తుంది. ఈ ఆటపై తనకున్న నాలెడ్జ్‌ చూసి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతుంటా. మూడేళ్ల క్రితం ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది జాన్వి. అప్పుడు ఆమెకు 17 ఏళ్లు. ఇక ఈసారి సుహానా కూడా జాన్వి, ఆర్యన్‌లకు జత కలిసింది. మా సీఈవో వెంకీ మైసూర్ ప్రతి ముఖ్యమైన చర్చల్లో తను పాల్గొనేలా, తన ఆలోనల్ని పంచుకునేలా ప్రోత్సహిస్తుంటారు. ప్రస్తుతం కేకేఆర్‌ శిబిరంలో యువ ఇంటర్న్‌గా శిక్షణ పొందుతోంది. తను చాలా తెలివైన అమ్మాయి.. తన మనసుకు ఏది నచ్చితే అది చేస్తుంది. ఈ విషయంలో నా కూతుర్ని చూస్తుంటే చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తోంది. ఆ దేవుడి దయ వల్ల తను అనుకున్న దారిలో నడిచి విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా..’ అంటూ తన కూతురిని ఆకాశానికెత్తేసింది జుహీ. ఇలా పుత్రికోత్సాహంతో జుహీ పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

రచయిత్రి కావాలనుకుంటోందట!

* జుహీ ముద్దుల కూతురు జాన్వి చిన్నతనం నుంచే చదువులో మహా చురుకు. తన కూతురి తెలివితేటల్ని చూసి ‘నీ అద్భుతమైన తెలివితేటల్ని చూసి ఎంతగానో గర్వపడుతున్నా..’ అంటూ ఎప్పటికప్పుడు మురిసిపోతుంటుందీ బాలీవుడ్‌ మామ్.

* లండన్‌లోని ఛార్టర్‌ హౌస్‌ బోర్డింగ్‌ స్కూల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఈ సెలబ్రిటీ కిడ్‌కి రచనలంటే మహా ఇష్టమట! అందుకే తన కూతురికి సినిమాలంటే ఆసక్తి లేదని, తాను మంచి రచయిత్రిగా ఎదగాలనుకుంటున్నట్లు ఓ సందర్భంలో వెల్లడించింది జుహీ.

* జాన్వికి అర్జున్ మెహతా అనే తమ్ముడున్నాడు. తను కూడా అక్క చదివిన లండన్‌లోని ఛార్టర్‌ హౌస్‌ బోర్డింగ్‌ స్కూల్లోనే చదువుకుంటున్నాడు.

* సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఈ జూనియర్‌ జుహీ దిట్ట అనే చెప్పుకోవాలి. రెండుమార్లు ఐపీఎల్‌ వేలంలో పాల్గొని సీనియర్‌ ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ చక్కటి నిర్ణయాత్మక ధోరణిని ప్రదర్శించినందుకు మరోసారి ఉప్పొంగిపోయింది ఆమె తల్లి జుహీ.

* ఈ యూత్‌ ఐకాన్‌కు డ్రస్సింగ్‌ సెన్సూ ఎక్కువే! రెండుసార్లు ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొని కార్పొరేట్‌ స్టైల్‌ డ్రస్సింగ్‌తో ఆకట్టుకుంది జాన్వి. దీంతో లేడీ బాస్‌ అంటూ అందరూ ఆమెను ప్రశంసల్లో ముంచెత్తారు.

* సినిమాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా.. తనకిష్టమైన నటీనటులు వరుణ్‌ ధావన్‌, దీపికా పదుకొణె అంటోంది జాన్వి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని