Queen Elizabeth II : రాణి గారి గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?
రాణి అంటే రాజప్రాసాదానికే పరిమితం కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ భూమిలో సేవలందించడానికీ వెన్నుచూపని వ్యక్తిత్వం ఆమె సొంతం. సుపరిపాలన, ప్రజల బాగోగులకు విలువిచ్చే మహోన్నత శక్తి. ఏడు దశాబ్దాల పాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా బ్రిటన్‌ను పరిపాలించిన మహారాణి క్వీన్ ఎలిజబెత్-2...
రాణి అంటే - రాజప్రాసాదానికే పరిమితం కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ భూమిలో సేవలందించడానికీ వెన్నుచూపని వ్యక్తిత్వం ఆమె సొంతం. సుపరిపాలన, ప్రజల బాగోగులకు విలువిచ్చే మహోన్నత శక్తి. ఏడు దశాబ్దాల పాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా బ్రిటన్‌ను పరిపాలించిన మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 ప్రస్థానం ఇందుకు ఏమాత్రం తీసిపోదు. తండ్రి మరణానంతరం పాతికేళ్ల వయసులో బ్రిటన్ పగ్గాలు చేపట్టిన ఆమె.. అత్యంత సుదీర్ఘ కాలం బ్రిటన్‌ను పరిపాలించిన సామ్రాజ్ఞిగా చరిత్ర సృష్టించారు. ఈ 70 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో కీలక పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. అలాంటి మహోన్నత వ్యక్తి తన 96వ ఏట తాజాగా తుది శ్వాస విడిచారు. తన అందం, ఆహార్యం, నిష్కల్మషమైన చిరునవ్వుతో ఎప్పటికప్పుడు ఆకట్టుకునే క్వీన్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందామా...
స్కూలుకెళ్లలేదు!
క్వీన్ ఎలిజబెత్ 2.. కింగ్ జార్జ్ - 4, క్వీన్ ఎలిజబెత్ దంపతులకు 1926, ఏప్రిల్ 21న లండన్‌లోని టౌన్‌హౌస్‌లో జన్మించారు. ఆమె చెల్లి ప్రిన్సెస్ మార్గరెట్. ఈ ఇద్దరు యువరాణులు అందరు పిల్లల్లాగా స్కూలుకు వెళ్లలేదు. ప్యాలస్‌లోనే చదువుకున్నారు. ఇందుకోసం క్వీన్ తల్లి ఎలిజబెత్ ఓ ప్రత్యేక ట్యూటర్‌ని నియమించారు. ఆమె పర్యవేక్షణలోనే చరిత్ర, భాష, సాహిత్యం, సంగీతం.. వంటి విషయాల్లో ఈ అక్కచెల్లెళ్లిద్దరూ ఆరితేరారు. ఆపై క్వీన్ ‘కన్‌స్టిట్యూషనల్ హిస్టరీ, లా’లో పైచదువులు చదివారు.
రెండు పుట్టినరోజులు!
సాధారణంగా అందరూ తమ పుట్టినరోజును ఏడాదికి ఒక్క రోజు జరుపుకొంటే.. క్వీన్ మాత్రం రెండు రోజులు చేసుకునే వారు. తన అసలు పుట్టినరోజైన ఏప్రిల్ 21న నిరాడంబరంగా తన ప్యాలస్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకొనే వారు. ఇక అధికారికంగా జూన్ రెండో మంగళవారం మరోసారి తన బర్త్‌డే చేసుకునేవారామె. ఇందుకూ కారణం లేకపోలేదు. బ్రిటన్‌లో ఏప్రిల్‌లో వసంత రుతువు ఉంటుంది.. ఆ సమయంలో ఉన్నట్లుండి వర్షం కురిసే అవకాశాలు ఎక్కువ. కాబట్టి అవుట్‌డోర్ వేడుకలు, పరేడ్‌లకు అనువైన సమయం కాదు. అందుకే వేసవి కాలం ఉండే జూన్ నెలలో అధికారికంగా రాణి పుట్టినరోజు వేడుకలు జరగడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగింది.
పాతికేళ్లకే ‘రాణి’గా పగ్గాలు!
1952లో, క్వీన్ తన పాతికేళ్ల వయసులో తన భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో కలిసి కెన్యా పర్యటనలో ఉన్నారు. ఆ సమయంలో తన తండ్రి కింగ్ జార్జ్-4 కన్నుమూశారు. దాంతో పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని ప్యాలస్‌కు చేరుకున్న ఆమె.. 1953, జూన్ 2న సెంట్రల్ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో రాణిగా బాధ్యతలు చేపట్టారు. ఈ 70 ఏళ్ల కాలంలో 14 కామన్వెల్త్ దేశాలకు అధిపతిగా వ్యవహరించారు. విన్‌స్టన్ చర్చిల్ దగ్గర్నుంచి లిజ్ ట్రస్ వరకు.. తన పరిపాలన కాలంలో బ్రిటన్‌కు 14 మంది ప్రధానులు పనిచేశారు. ఇటీవలే ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ కూడా రాణిని అధికారికంగా కలిసిన సంగతి తెలిసిందే!
సైన్యంలోనూ తనదైన ముద్ర!
రాణి అంటే రాజ ప్రాసాదానికే పరిమితం కాదు.. అత్యవసర పరిస్థితుల్లో రణరంగంలోకి దూకడానికీ వెనకాడదు.. క్వీన్ కూడా అలాంటి ధీశాలే! తనకు 18 ఏళ్లున్నప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయంలో బ్రిటిష్ ఆర్మీలోని ‘ఆక్సిలరీ టెరిటోరియల్ సర్వీస్’లో చేరారామె. అక్కడే మెకానిక్‌గా పాఠాలు నేర్చుకున్నారు. ఆపై సైన్యంలో పూర్తి స్థాయి సభ్యురాలిగా ఉన్నారు. ఇలా రాజ కుటుంబం నుంచి సైన్యంలో చేరిన తొలి మహిళగానూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు క్వీన్.
8 ఏళ్లకే ప్రేమ పాఠాలు!
క్వీన్ ఎలిజబెత్ ప్రేమ, పెళ్లి.. సినిమా కథను తలపిస్తాయి. 1934లో జరిగిన ఓ రాజ కుటుంబపు వివాహంలో పాల్గొన్న ఆమె.. అక్కడే ప్రిన్స్ ఫిలిప్‌ను మొదటిసారిగా కలుసుకున్నారు. అప్పుడు ఆమె వయసు 8 ఏళ్లు. ఆ తర్వాత ప్రేమ లేఖలు రాసుకోవడం, రహస్యంగా నిశ్చితార్థం చేసుకోవడం కూడా జరిగిపోయాయి. 1947లో పెళ్లి పీటలెక్కిన ఈ జంటకు నలుగురు కొడుకులు. ‘నా భర్త ప్రశంసల్ని అంత త్వరగా స్వీకరించే వ్యక్తి కాదు.. కానీ నా బలం, బలగం అన్నీ తనే!’ అంటూ ఓ సందర్భంలో తన భర్తను ఆకాశానికెత్తేశారు క్వీన్. ప్రిన్స్ ఫిలిప్ గతేడాది ఏప్రిల్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే!
ఇకపై ‘కోహినూర్’ ఆమె సిగలో..!
ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్‌ను పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 ధరించిన కిరీటంలో ‘కోహినూర్’ వజ్రం పొదిగి ఉంటుంది. ఇప్పుడు ఆమె తర్వాత ఆ కిరీటం.. ఆమె కోడలు కెమిల్లా సిగన మెరవనుంది. క్వీన్ తర్వాత ఆమె కొడుకు ఛార్లెస్ బ్రిటన్ రాజుగా సింహాసనాన్ని అధిష్టించనుండగా.. ఆయన భార్య కెమిల్లాకు రాణి హోదా దక్కుతుంది. 70 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా ఈ ఏడాది బ్రిటన్‌లో నిర్వహించిన ప్లాటినం జూబ్లీ వేడుకల్లో రాణి ఇచ్చిన సందేశంలోనూ తన కిరీటం కెమిల్లాకే దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు కూడా!
ఫ్యాషన్ ‘క్వీన్’గానూ!
క్వీన్ ఎలిజబెత్.. ఈ మాట వినగానే.. ఓ ప్రత్యేకమైన డ్రస్ కోడ్ మన కళ్ల ముందు మెదులుతుంది. ఎక్కువ ముదురు రంగుల్నే ఇష్టపడే ఆమె.. మోకాళ్ల కింది వరకు ఉండే గౌన్లనే ఎక్కువగా ధరించేవారు. హ్యాట్, గ్లోవ్స్, పర్సుతో సహా అన్నింటినీ మ్యాచ్ చేస్తూ ఆమె వేసుకునే దుస్తులు ఎంతోమందిని ఆకట్టుకునేవి. ఈ క్రమంలోనే ఫ్యాషన్ ‘క్వీన్’గానూ పేరు తెచ్చుకున్నారు ఎలిజబెత్-2.
లిలిబెట్.. క్యాబేజ్!
❃ క్వీన్‌కు రెండు ముద్దుపేర్లు ఉన్నాయి. ఆమె తండ్రి ఆమెను లిలిబెట్ అని ముద్దుగా పిలుచుకుంటే.. తన భర్త ఫిలిప్ ఆమెను ‘క్యాబేజ్’ అని ప్రేమతో పిలిచేవారట!
❃ నాజీలతో పోరాటానికి సిద్ధమయ్యే క్రమంలో.. తన 14వ ఏట తన చెల్లి మార్గరెట్‌తో కలిసి గన్ షూటింగ్ నేర్చుకున్నారు క్వీన్.
❃ ఆర్మీలో ఉన్న సమయంలోనే డ్రైవింగ్ నేర్చుకున్నారీ రాణీ గారు. వీలు చిక్కినప్పుడల్లా తన రేంజ్ రోవర్ కారులో లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్లడానికి ఆసక్తి చూపేవారట!
❃ బ్రిటన్‌లో అన్ని పాస్‌పోర్టులు రాణి పేరు మీదే జారీ అయ్యేవి. దాంతో ఆమెకు ప్రత్యేకంగా పాస్‌పోర్ట్ లేదు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు ఆమె కారుపై లైసెన్స్ ప్లేట్ కూడా ఉండేది కాదు.
❃ క్వీన్‌కు పెంపుడు శునకాలంటే వల్లమాలిన ప్రేమ. ఆమె దగ్గర 30కి పైగా పెట్స్ ఉన్నాయి. అవి కూడా కార్గిస్ అనే ప్రత్యేకమైన డాగ్ బ్రీడ్స్.
❃ క్వీన్ ఎలిజబెత్ తన మాతృభాష ఇంగ్లిష్ కంటే ఫ్రెంచ్‌లోనే అనర్గళంగా మాట్లాడేవారు. ఆసక్తితో యుక్త వయసులోనే ఈ భాషను నేర్చుకున్న ఆమె.. పలు అధికారిక ఉపన్యాసాల్లోనూ ఇదే భాషలో మాట్లాడడం అక్కడి వారందరినీ ముగ్ధుల్ని చేసేది.
❃ 1976లో ఇంగ్లండ్‌లోని టెలీకమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించిన రాణి.. అక్కడ్నుంచే ARPANETను ఉపయోగించి తొలిసారి ఈ-మెయిల్ పెట్టారు. ఈ ఘనత సాధించిన తొలి రాజవంశీయురాలు కూడా క్వీన్ ఎలిజబెత్ కావడం విశేషం.
❃ పలు ప్రత్యేక సందర్భాల్లో కొంతమంది ఆమెకు బహుమతిగా జంతువుల్ని కూడా ఇచ్చేవారట! వీటిలో గుర్రాలు, ఆవులు, ఏనుగులు, కంగారూలు, మొసళ్లు, హంసలు.. వంటివి కొన్ని. వీటిని ఆమె లండన్ జూకు దత్తతిచ్చేవారు.
❃ గుర్రపు స్వారీ అంటే రాణీ గారికి విపరీతమైన ఇష్టమట! ఈ మక్కువతోనే హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నారు క్వీన్. అంతేకాదు.. పావురాల పోటీ, ఫుట్‌బాల్ ఆడడం ఆమె అభిరుచులు.
❃ క్వీన్‌కు మర్మలేడ్ శాండ్‌విచ్ అంటే మహా ఇష్టమట. అందుకే తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ ఒక శాండ్‌విచ్ వెంట తీసుకెళ్తానని ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించారు.
❃ క్వీన్ ఎలిజబెత్ నటి కూడా! జేమ్స్ బాండ్ సీక్వెన్స్‌లో ఆరు నిమిషాల నిడివి గల సీన్‌లో అతిథి పాత్రలో కనిపించారామె.
❃ రాణీ గారు ఉదయం నిద్ర లేవడానికి అలారం వాడేవారు కాదట! ఆమె పడకగది కిటికీ ఆవల ఓ వ్యక్తి బ్యాగ్‌పైపర్ అనే వాయిద్యాన్ని మోగించేవారట! ఇదే ఆమె మేలుకొలుపు అలారం అంటారు అక్కడివారు!
❃ క్వీన్‌కు ప్రయాణాలన్నా మక్కువే! తన 70 ఏళ్ల రాచరికంలో సుమారు 120 దేశాల్లో పర్యటించిన ఆమె.. అత్యధిక దేశాలు సందర్శించిన సామ్రాజ్ఞిగా చరిత్రకెక్కారు. 1997లో చెన్నైలో ‘ఎంజీఆర్ ఫిలిం సిటీ’లో ఓ చిత్ర ప్రారంభోత్సవంలోనూ ప్రత్యేక అతిథిగా హాజరైన ఆమె.. అక్కడ కమల్‌హాసన్‌తో సరదాగా ముచ్చటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.