నైట్‌షిఫ్ట్‌ల్లో పని చేస్తున్నారా?

ఇష్టమున్నా లేకపోయినా ఉద్యోగ రీత్యా కొంతమంది నైట్‌షిఫ్టుల్లో పనిచేయక తప్పదు. నిజానికి వీళ్ల దినచర్య సాధారణ షిఫ్టులున్న వాళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. అయితే రాత్రి షిఫ్టులతో కొన్ని రకాల అనారోగ్యాలు తప్పవంటున్నారు....

Updated : 13 Aug 2022 12:13 IST

ఇష్టమున్నా లేకపోయినా ఉద్యోగ రీత్యా కొంతమంది నైట్‌షిఫ్టుల్లో పనిచేయక తప్పదు. నిజానికి వీళ్ల దినచర్య సాధారణ షిఫ్టులున్న వాళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. అయితే రాత్రి షిఫ్టులతో కొన్ని రకాల అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటి? వాటి ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేంటో తెలుసుకుందాం రండి..

నిద్రకు దూరం!

మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి నిద్ర చాలా అవసరం. రోజంతా పనిచేసి అలసిన శరీరానికి సుఖమైన నిద్రతో విశ్రాంతి దొరుకుతుంది. దీనివల్ల ఒత్తిళ్లు దూరమై మన శరీరం తిరిగి పునరుత్తేజితమవుతుంది. కానీ రాత్రిపూట పని చేసేవారు క్రమంగా సహజమైన నిద్రకు దూరమవుతుంటారు. దీనివల్ల వారిలో నిద్రలేమి సమస్య మొదలై.. క్రమంగా అది పలు శారీరక, మానసిక అనారోగ్యాలకు దారి తీస్తుంది.

రొమ్ము క్యాన్సర్

ఒక అధ్యయనం ప్రకారం.. పగలు పనిచేసే మహిళలతో పోలిస్తే రాత్రిపూట పనిచేసే మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట! ఇది క్రమం తప్పకుండా రాత్రి వేళల్లో పనిచేసే వారితో పాటు వారానికోసారి నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసే వాళ్లకూ వర్తిస్తుందట!
 

డిప్రెషన్

మిగతా వాళ్లతో పోలిస్తే నైట్‌షిఫ్ట్‌లలో పని చేసేవారు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. నిద్రలేమి, సామాజిక జీవితానికి దూరంగా ఉండడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపలేకపోవడం మొదలైన కారణాల వల్ల వాళ్లు ప్రశాంతంగా ఉండలేరు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. దీనివల్ల వారిలో ఒంటరితనం, డిప్రెషన్, మానసిక అలసట లాంటివి పెరుగుతాయి.

గుండె జబ్బులు

రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. దీని ప్రభావం గుండె ఆరోగ్యంపై పడుతుంది.

'విటమిన్ డి'కి దూరం

సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి విటమిన్‌ ‘డి’ లభిస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఈ క్రమంలో మిగతా వారితో పోలిస్తే రాత్రివేళలో పనిచేసే వాళ్లపై సూర్యరశ్మి పడడం తక్కువే. దీంతో క్రమంగా వాళ్ల శరీరంలో క్యాల్షియం శాతం తగ్గడంతో పాటు వివిధ రకాల క్యాన్సర్లకూ దారి తీస్తుంది.

దీర్ఘకాలిక సమస్యలు..

నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసేవారు వివిధ రకాల అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఈ క్రమంలో జీవక్రియల పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో శరీరంలో ఇన్సులిన్, రక్తంలో చక్కెర స్థాయుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల మధుమేహం, ఊబకాయం.. లాంటి దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలా రాత్రివేళల్లో పనిచేయడం వల్ల ఇంకెన్నో శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సొస్తుంది. ఈ క్రమంలో ఆరోగ్యపరంగా ఏమాత్రం తేడా కనిపించినా అశ్రద్ధ చేయకుండా వెంటనే సంబంధిత వైద్యనిపుణులను సంప్రదించడం మంచిది.

ఇవి పాటించండి!

వృత్తిరీత్యా నైట్‌షిఫ్ట్‌లలో పనిచేసేవాళ్లు తమ ఆరోగ్యం విషయంలో, జీవనశైలి పరంగా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఆఫీస్ ముగిసిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేసి హాయిగా విశ్రాంతి తీసుకోండి.

మీ ఆఫీస్ వేళల్ని బట్టి మీ భోజన సమయాలను సరైన విధంగా ప్రణాళిక చేసుకోండి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆ వేళల్లోనే భోజనం చేయడం అలవాటు చేసుకోండి. దీంతో మీ శరీరం నెమ్మదిగా ఈ పద్ధతికి అలవాటు పడుతుంది.

మీరు తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇందుకోసం కూరగాయలు, పండ్లు, గుడ్లు మొదలైనవి తీసుకుంటే మంచిది.

భోజనం చేయకుండా ఖాళీ కడుపుతో పడుకోవడం మంచిది కాదు. ఆకలిగా అనిపించకపోతే కనీసం ఒక గ్లాసు పాలు తాగి పడుకోవడం మేలు. దీనివల్ల మీకు సులభంగా నిద్ర పడుతుంది.

రాత్రిపూట పని చేసే వాళ్లలో కొంతమంది పగలు సరిగా నిద్రపట్టక ఇబ్బందులు పడుతుంటారు. దీంతో సులభంగా నిద్ర పట్టేందుకు నిద్ర మాత్రలు లాంటివి వాడుతుంటారు. వీటివల్ల భవిష్యత్తులో తీవ్ర అనారోగ్యాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి నిద్ర మాత్రలకు అలవాటు పడకుండా సహజంగానే నిద్రపోవడానికి ప్రయత్నించాలి. నిద్రను ప్రేరేపించేందుకు నట్స్‌, పండ్లు, పాలు.. వంటివి తీసుకోవాలి.

పనివేళల్లో కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్ లాంటివి తాగడం తగ్గించండి. వాటికి బదులు కాఫీ బ్రేక్స్‌లో తాజా పండ్ల రసాలు తాగడం అలవాటు చేసుకోండి.

క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం, ధ్యానం మొదలైనవి చేయడం ద్వారా అటు శారీరకంగా, ఇటు మానసికంగా శక్తిని పొందుతారు.

వారాంతాల్లో మీ సమయాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కేటాయించండి. దీని ద్వారా మానసిక ఒత్తిళ్ల నుంచి మీకు కాస్త విశ్రాంతి లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని