Parineeti-Raghav: లండన్‌లో కలుసుకొని.. షూటింగ్‌లో ప్రేమించుకొని!
ప్రేమకు పునాది స్నేహం అంటుంటారు. అలా స్నేహితులుగా పరిచయమై.. ప్రేమతో దగ్గరై.. తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. సెలబ్రిటీ కపుల్ పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా జంటా ఇందుకు....
(Photos: Instagram)
ప్రేమకు పునాది స్నేహం అంటుంటారు. అలా స్నేహితులుగా పరిచయమై.. ప్రేమతో దగ్గరై.. తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. సెలబ్రిటీ కపుల్ పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా జంటా ఇందుకు మినహాయింపు కాదు. కాలేజీ రోజుల్లో ప్రారంభమైన తమ ప్రేమను ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన ఈ జంట.. తాజాగా నిశ్చితార్థం చేసుకొని ఫ్యాన్స్‌కు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయింది. ఒకరిది సినిమా, మరొకరిది రాజకీయం.. ఇలా దారులు వేరైనా.. తమ గమ్యస్థానం ఒకటే అంటోన్న పరి-రాజీవ్‌ల మధ్య ప్రేమ అసలు ఎక్కడ పుట్టిందో మనమూ తెలుసుకుందాం రండి..
ఇద్దరు సెలబ్రిటీలు జంటగా కనిపిస్తే చాలు.. వాళ్ల మధ్య ఉన్నది స్నేహమే అయినా.. ప్రేమకథలల్లేస్తుంటారు చాలామంది. డేటింగ్, సహజీవనం.. అంటూ లేనిపోని పుకార్లు పుట్టిస్తుంటారు. పెళ్లెప్పుడంటూ నానా రచ్చా చేస్తుంటారు. ఈ చర్చంతా ఎందుకన్న ఉద్దేశంతోనే ఈ మధ్య చాలామంది సెలబ్రిటీలు నిశ్చితార్థమైనా, పెళ్లైనా రహస్యంగా చేసేసుకుంటున్నారు. కొంతమంది విషయంలోనైతే తామే స్వయంగా ఫొటోలు బయటపెట్టే దాకా అసలు విషయం తెలియట్లేదు. ఇప్పుడు పరిణీతి-రాఘవ్ జంట కూడా ఇదే ట్రెండు ఫాలో అయింది.
ఎంగేజ్‌మెంట్‌తో సర్‌ప్రైజ్!
గత కొన్ని రోజులుగా జంటగా కెమెరా కంట పడుతూ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ జంట.. తాజాగా నిశ్చితార్థం చేసుకొని ఫ్యాన్స్ అనుమానాలకు తెరదించింది. ఉంగరాలు మార్చుకొని తమ ప్రేమబంధం గురించి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో దిల్లీలో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ వేడుకలో ఇద్దరూ మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్‌లో మెరిసిపోయారు. ఈ క్రమంలో పరి.. మనీష్ మల్హోత్రా రూపొందించిన బీజ్ కలర్ టర్టిల్ నెక్ ఫుల్‌స్లీవ్స్ సూట్ ధరించగా.. రాఘవ్ అచ్‌కన్ అవుట్‌ఫిట్‌లో రాయల్‌గా కనిపించాడు. వేడుక అనంతరం ఇద్దరూ తమ ఇన్‌స్టా పేజీల్లో ఫొటోల్ని పోస్ట్ చేస్తూ.. తమ రిలేషన్‌షిప్‌ను బయటపెట్టారు. రాఘవ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే తామిద్దరి దారులు వేరైనా గమ్యమొక్కటే అంటోంది పరి.
‘మా ఇద్దరి ప్రపంచాలు వేరు.. అయినా మేమిద్దరం ఒక్కటై మా ప్రపంచాల్నీ కలపాలనుకున్నాం.. నిశ్చితార్థంతో అది సఫలమైంది. తద్వారా మా అనుబంధాల్నీ విస్తరించుకోగలిగాం.. మా మధ్య ఉన్న అపార ప్రేమ, పాజిటివిటీని శాశ్వతంగా కొనసాగించాలనుకుంటున్నాం..’ అంటూ ఓ పోస్ట్ పెట్టిందీ కొత్త పెళ్లికూతురు.
లండన్‌లో.. హ్యాపీడేస్!
పరిణీతి-రాఘవ్ చద్దాలను జంటగా మనం చూసింది కొన్నాళ్ల క్రితమే! ఈ ఏడాది మార్చిలో ఇద్దరూ కలిసి బాంద్రాలోని ఓ రెస్టరంట్ నుంచి బయటికొస్తున్నప్పుడు తొలిసారి కెమెరా కంట పడిందీ జంట. ఇక అప్పట్నుంచి వీళ్ల మధ్య ఏదో నడుస్తోందన్న సందేహాలు ఫ్యాన్స్‌లో మొదలయ్యాయి. ఆపై ఎయిర్‌పోర్ట్‌లో, ఇటీవల మొహాలీలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మరోసారి జంటగా కనిపించి.. అందరి అనుమానాలకు మరింత బలం చేకూర్చారు పరి-రాఘవ్. అయినా తమ అనుబంధం గురించి పెదవి విప్పలేదు. ఇక వీరిద్దరి ప్రేమ శాశ్వతమవ్వాలంటూ ఇటీవలే ఎంపీ సంజీవ్ అరోరా ట్వీట్ చేయడంతో.. ఈ జంట ప్రేమబంధం గురించి ఎట్టకేలకు బయటపడింది.
అయితే నిజానికి వీరిద్దరూ కాలేజీ రోజుల్లోనే కలుసుకున్నారట! పరిణీతి లండన్‌లోని ‘మాంచెస్టర్ బిజినెస్ స్కూల్లో’ ట్రిపుల్ డిగ్రీ (బిజినెస్, ఫైనాన్స్, ఎకనామిక్స్) చదివేటప్పుడు, రాఘవ్ ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’లో EMBA సర్టిఫికేషన్ కోర్సు చేస్తున్నాడు. ఆ సమయంలోనే తొలిసారి వీరిద్దరూ కలుసుకున్నారు. స్నేహితులయ్యారు.. అయితే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టింది మాత్రం గతేడాది ‘చమ్కీలా’ సినిమా షూటింగ్‌లోనేనట! ఈ చిత్ర షూటింగ్ కోసం పంజాబ్ వెళ్లిన పరిని.. రాఘవ్ అక్కడే కలుసుకోవడం, ఆపై ప్రేమించుకోవడం.. చకచకా జరిగిపోయాయట! అయితే ఇన్నాళ్లూ ఈ విషయాన్ని దాస్తూ వచ్చిన ఈ జంట.. నిశ్చితార్థంతో తమ ప్రేమను బయటపెట్టింది.
ఇక వేడుకలో భాగంగా.. ఇద్దరూ మార్చుకున్న ఉంగరాలు, 4-టైర్ కేక్ కట్ చేయడం, ప్రేమతో హత్తుకోవడం-ముద్దులాడడం.. వంటివన్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కంగ్రాట్స్ క్యూట్ కపుల్!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.