Published : 16/04/2022 17:15 IST

Falguni Nayar : ఈ కెరీర్‌ సూత్రాలతో ‘విజయీభవ’!

(Photo: Twitter)

‘రిస్క్‌ లేని జీవితం ఉప్పు లేని పప్పు లాంటిది..’ అంటుంటారు. ‘కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికొచ్చి సవాళ్లకు ఎదురొడ్డినప్పుడే విజయాన్ని రుచి చూడగలం’ అంటున్నారు నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్‌. ఐదు పదుల వయసులో తన తపనేంటో తెలుసుకొని సౌందర్య ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించిన ఆమె.. స్వీయ శక్తి సామర్థ్యాలతో బిలియనీర్‌గా ఎదిగారు. తన విజయంతో ఎంతోమంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు ఐకాన్‌గా మారారు. అంతేకాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా తన విజయసూత్రాల్ని అందరితో పంచుకునే ఫల్గుణీ.. తాజాగా ఐఐఎం అహ్మదాబాద్‌ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో తన జీవితానుభవాలతో పాటు పలు స్ఫూర్తిదాయక మాటల్ని అక్కడి విద్యార్థులతో పంచుకున్నారు. తద్వారా వాళ్ల కెరీర్‌కు చక్కటి మార్గనిర్దేశనం చేశారు.

సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా స్ఫూర్తిదాయక మాటలతో, తన విజయ సూత్రాలతో నేటి యువతలో స్ఫూర్తి నింపుతుంటారు ఫల్గుణీ నాయర్‌. అయితే తాజాగా ఐఐఎం అహ్మదాబాద్‌ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆమె.. చదువు పూర్తిచేసుకొని క్యాంపస్‌ను వీడే విద్యార్థులకు తన మాటలతో మార్గనిర్దేశనం చేశారు. కెరీర్‌లో ఎదగాలంటే అలవర్చుకోవాల్సిన లక్షణాలు, పాటించాల్సిన సూత్రాల గురించి ఇలా చెప్పుకొచ్చారు.

రిస్క్‌ చేయాల్సిందే!

* కెరీర్‌లో ఎదగాలంటే రిస్క్‌ చేయాల్సిందే! అందులోనూ కెరీర్‌ ప్రారంభ దశలో ఇలాంటి రిస్కులు తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే విజయానికి చేరువ కావచ్చు. అలాగే ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లనూ ధైర్యంగా ఎదుర్కొనే నేర్పు కావాలి. ఇందుకు ఎవరి సత్తాను వారు సవాల్‌ చేసుకోవడం చాలా ముఖ్యం.

* ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవాలంటే.. ముందు మీకు నచ్చిన, నచ్చని అంశాలేంటో పరిశీలించుకోవాలి. ఈ క్రమంలో మీ తపనేంటో మీకు తెలుస్తుంది. దానిపై దృష్టి సారిస్తే.. మీ కెరీర్‌కు మార్గం సుగమమైనట్లే!

* నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు.. ఒకవేళ ధైర్యం చేసి అడుగు ముందుకేసినా ఫలితం మరోలా ఉండచ్చు. అయినా సానుకూల దృక్పథంతో, స్వీయ నమ్మకంతో ముందుకెళ్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.

* సౌకర్యానికి ప్రాధాన్యమిస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అదే కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికొచ్చి చూడండి.. బంగారు భవిష్యత్తు మీకు స్వాగతం పలుకుతుంది.

* మన చుట్టూ ఉండే వారిలో అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండకపోవచ్చు. కాబట్టి ఎవరేమన్నా పట్టించుకోకుండా.. ఆలస్యమైనా సరే కెరీర్‌ని పునఃప్రారంభించడానికి వెనకాడకండి.

* కెరీర్‌ విషయంలో ప్రతి ఒక్కరి మనసులో ఎన్నో ఆలోచనలుంటాయి. అలాగని వాటన్నింటిపై ఏకకాలంలో దృష్టి పెట్టలేం.. కాబట్టి ప్రాధాన్యతను బట్టి వాటిలో మీకు బాగా ఆసక్తి ఉన్న అంశమేంటో తెలుసుకోండి. దానికి తొలి ప్రాధాన్యమిస్తే ఇక మీకు తిరుగుండదు.

* మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనకు పోటీ పెరిగిపోతోంది. దీన్ని తట్టుకోవాలంటే మనం నిత్య విద్యార్థులం కావాలి. చుట్టూ జరిగే విషయాలపై అవగాహన పెంచుకోవాలి.. అప్‌డేట్‌ కావాలి. అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో రాణించగలం.

బ్యాంకర్‌ నుంచి బ్యూటీ క్వీన్‌గా..!

ఇలా తన మాటలతో, విజయ సూత్రాలతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన ఫల్గుణీ ఐఐఎం అహ్మదాబాద్‌ పూర్వ విద్యార్థిని కూడా! చదువు పూర్తయ్యాక బ్యాంకింగ్‌ కెరీర్‌ను ఎంచుకున్న ఆమె.. 19 ఏళ్ల పాటు ఈ రంగంలో సేవలందించారు. ఆపై 50 ఏళ్ల వయసులో మేకప్‌పై తనకున్న ఇష్టాన్ని గ్రహించిన ఆమె.. 2012లో ‘నైకా’ పేరుతో సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ దశాబ్ద కాలంలో తన వ్యాపార వ్యూహాలతో సంస్థను లాభాల బాట పట్టించారు. వేల కోట్లకు పైగా ఆర్జనతో Unicorn Status (వెంచర్‌ క్యాపిటల్‌ ఇండస్ట్రీలో 1 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఒక ప్రైవేట్‌ స్టార్టప్‌ కంపెనీ)నూ దక్కించుకున్నారు. స్వీయ శక్తిసామర్థ్యాలతో బిలియనీర్‌గా ఎదిగిన మహిళగా పేరు సంపాదించారు. ‘ఫోర్బ్స్‌’, ‘హురున్‌ గ్లోబల్‌’.. వంటి ప్రముఖ పత్రికలు విడుదల చేసిన ధనవంతుల జాబితాలతో పాటు ‘ఫోర్బ్స్‌ ఏషియా’, ‘ఫార్చ్యూన్‌’ పత్రికలు విడుదల చేసిన ‘అత్యంత శక్తిమంతమైన మహిళ’ల జాబితాలోనూ చోటుదక్కించుకున్నారీ బిజినెస్‌ వుమన్‌. ‘స్వీయ నమ్మకమే కెరీర్‌ను నిలబెడుతుందని చెప్పే ఆమె.. తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనకున్న రహస్యం కూడా ఇదే’నంటూ తన ప్రసంగాన్ని ముగించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని