Vineeta Singh: అందుకే అప్పుడు అబ్బాయిల టీషర్టులు వేసుకునేదాన్ని!

వ్యాపారమంటే మాటలు కాదు.. సవాళ్లను ఎదుర్కొంటూ, లాభనష్టాల్ని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక చుట్టూ ఉన్న వాళ్లు మాటలు-చేతల్లో చూపించే వివక్షను అధిగమించడం మరో సవాలు. ఇలాంటివెన్నో దాటుకొని తమ తమ వ్యాపారాల్లో....

Published : 17 May 2023 12:40 IST

(Photos: Instagram)

వ్యాపారమంటే మాటలు కాదు.. సవాళ్లను ఎదుర్కొంటూ, లాభనష్టాల్ని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక చుట్టూ ఉన్న వాళ్లు మాటలు-చేతల్లో చూపించే వివక్షను అధిగమించడం మరో సవాలు. ఇలాంటివెన్నో దాటుకొని తమ తమ వ్యాపారాల్లో అందలమెక్కారు ఎంతోమంది భారతీయ వనితలు. ‘షుగర్‌ కాస్మెటిక్స్‌’ సహ వ్యవస్థాపకురాలు, సీఈఓ వినీతా సింగ్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. స్థిరపడితే అది వ్యాపార రంగంలోనే అని బలంగా నిర్ణయించుకున్న ఆమె.. ఇందుకోసం తనకొచ్చిన కోటి రూపాయల ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. ‘ఆడవాళ్లు ప్రారంభించిన వ్యాపారంలో పెట్టుబడులు పెట్ట’మని విమర్శించినా భరించింది. తన సామర్థ్యాన్ని నమ్మి.. పాజిటివిటీతో ముందుకు సాగిన ఆమె ప్రయాణం ఎంతోమంది ఔత్సాహిక వ్యాపారవేత్తలకు స్ఫూర్తిదాయకం. ఆ ప్రయాణాన్ని, ఈ క్రమంలో తానెదుర్కొన్న ఎత్తుపల్లాల్ని ఇటీవలే ‘వాట్‌ విమెన్‌ వాంట్‌’ అనే కార్యక్రమంలో భాగంగా పంచుకుంది. మరి, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..

‘వ్యాపారంలో మహిళలు రాణించలేరు’, ‘వాళ్లు ప్రారంభించిన వ్యాపారాల్లో పెట్టుబడులు   పెడితే ఇక అంతే..!’ ఇలాంటి మాటలు చాలామంది మహిళా వ్యాపారవేత్తలకు అనుభవమే! తాను వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలోనూ ఇలాంటి ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నానంటోంది ప్రముఖ వ్యాపారవేత్త వినీతా సింగ్‌. వ్యాపారాన్నే తన కెరీర్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. పలు స్టార్టప్స్ ప్రారంభించి విఫలమైంది. ఆపై 20 ఏళ్ల క్రితం ‘షుగర్‌ కాస్మెటిక్స్‌’ అనే బ్యూటీ ఉత్పత్తుల బ్రాండ్‌ని ప్రారంభించిన ఆమె ఇక వెనుతిరిగి చూడలేదు.

కోటి రూపాయల కొలువు కాదని..!

వినీతా సింగ్‌ది ఉన్నత విద్యావంతుల కుటుంబం. ఒక్కగానొక్క కూతురే అయినా క్రమశిక్షణతో పెంచారు ఆమె పేరెంట్స్‌. ఏ రంగం ఎంచుకున్నా కెరీర్‌లో అత్యుత్తమంగా నిలవమని వెన్నుతట్టేవారు. సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగమని ధైర్యం నూరిపోసేవారు. ఈ క్రమంలోనే తాను భవిష్యత్తులో వ్యాపారవేత్తగా ఎదగాలని కోరుకుంది వినీత. ఐఐటీ-మద్రాస్‌ నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఐఐఎం-అహ్మదాబాద్‌ నుంచి ఎంబీఏ పూర్తిచేసిన ఆమెకు.. Deutsche Bankలో కోటి రూపాయల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశమొచ్చింది. అయితే వ్యాపారాన్నే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్న ఆమె.. ఆ ఉద్యోగాన్ని తిరస్కరించింది. పలు స్టార్టప్‌లు ప్రారంభించింది. అయితే ‘ఓటమి గెలుపుకి నాంది’ అన్నట్లు.. అన్నింట్లో విఫలమైనా.. 2012లో తన భర్త కౌశిక్‌తో కలిసి ‘షుగర్‌ కాస్మెటిక్స్‌’ సంస్థను ప్రారంభించి క్లిక్‌ అయింది వినీత.

మహిళల కోసమే..!

మహిళల బ్రాండ్‌గా తన వ్యాపారాన్ని నెలకొల్పిన వినీత.. ఈ వేదికగా మేకప్‌, బ్యూటీ ఉత్పత్తుల్ని విక్రయిస్తోంది. మరోవైపు సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాషన్‌, బ్యూటీ, రిలేషన్‌షిప్స్‌కు సంబంధించిన సలహాలిస్తోంది. ప్యారబెన్‌ వంటి రసాయనాలు లేకుండా, జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు వాడకుండా.. పూర్తిస్థాయి వీగనిజం ఫాలో అవుతూ తాము తయారుచేస్తోన్న ఈ సౌందర్యోత్పత్తులు, బ్యూటీ టూల్స్‌ సామాన్య మహిళల వార్డ్‌రోబ్‌లోనే కాదు.. ఎంతోమంది సెలబ్రిటీల బ్యూటీ కిట్స్‌లోనూ కనిపిస్తాయి. ప్రస్తుతం తన ఇన్‌స్టా పేజీని ఆరు లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ఇక తన బ్రాండ్‌ని నెలకు 50 మిలియన్ల మందికి పైగా మహిళలు సందర్శిస్తుంటారని చెబుతున్నారు వినీత. ఓవైపు వ్యాపారవేత్తగా రాణిస్తోన్న ఆమె.. ప్రస్తుతం ప్రముఖ బిజినెస్‌ రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’లో షార్క్‌ (న్యాయనిర్ణేత)గానూ వ్యవహరిస్తున్నారు. మహిళా సాధికారతే తన వ్యాపార సూత్రంగా మార్చుకున్న వినీత.. ప్రస్తుతం తన సంస్థలో 2800 మందికి పైగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించారు.

అందుకే అబ్బాయిల టీషర్ట్స్‌ ధరించా!

తన వ్యాపార దక్షతతో దేశంలోనే అత్యుత్తమ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగిన వినీత.. 2021లో ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ’ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే తానీ స్థాయికి చేరుకోవడానికి లింగ వివక్షను సైతం ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘వాట్‌ విమెన్ వాంట్‌’ అనే షోలో ఇటీవలే పాల్గొన్న వినీత.. తన వ్యాపార ప్రయాణంలోని పలు ఎత్తుపల్లాల్ని నెమరువేసుకున్నారు.
‘నా ఎదుగుదలలో మా అమ్మానాన్నల ప్రోత్సాహం ఎంతో! అయితే వ్యాపారం ప్రారంభించిన తొలినాళ్లలో నేనూ లింగ వివక్షను ఎదుర్కొన్నా. ఈ క్రమంలో మహిళలు ప్రారంభించిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టమని కొంతమంది మొహమ్మీదే చెప్పేవారు.. మీ వ్యాపారంలో మీ భర్త చేరితేనే మీ చేతికి చెక్‌ ఇస్తామనేవారు. ఇక అంతకుముందు ఇంటర్న్‌షిప్‌ చేసే సమయంలోనూ డ్రస్సింగ్ విషయంలో పలు కామెంట్లు ఎదుర్కొన్నా. దాంతో రాత్రికి రాత్రే అమ్మకు ఫోన్‌ చేసి పెద్ద బ్యాగ్‌ నిండా వదులుగా ఉండే అబ్బాయిల టీషర్ట్స్‌ పంపించమన్నా. నా రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ కోసం వాటినే ధరించాను. ఎందుకంటే ఇంత చిన్న కారణంతో నాకు అవకాశాలు మిస్‌ కాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశాను.

అదే నా సక్సెస్‌ సీక్రెట్!

‘మనం ఎదుగుతూనే తోటి మహిళలకు అవకాశాలు కల్పించాల’న్న నినాదంతోనే ముందుకు సాగుతున్నా.. నా దృష్టిలో ఇదే అసలైన సాధికారత! ప్రస్తుతం మా సంస్థలో 2800 మంది మహిళలు పని చేస్తున్నారు. వారిలో అన్ని వర్గాలకు చెందిన వారున్నారు. ప్రతి విషయంలోనూ వారికి అండగా నిలబడడానికి ప్రయత్నిస్తున్నా. ఇక వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ విషయానికొస్తే.. నేనూ ఈ విషయంలో మొదట ఇబ్బంది పడ్డా. అయితే ఆ సమయంలో నేను, నా భర్త కొన్ని పనుల్ని సమానంగా పంచుకున్నాం. వాటికే కట్టుబడి ముందుకు సాగుతున్నాం. పనుల్ని విభజించుకుంటే భారం తగ్గి, సమయం మిగులుతుంది. మా వ్యాపారంలో విజయం సాధించడానికి ఇదీ ఓ కారణమే అని చెప్తా. ఇక కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఎవరికి వారు వ్యక్తిగతంగా కాస్త సమయం కేటాయించుకుంటాం. ఇక వ్యాపారంలో సానుకూలతలు, ప్రతికూలతలు.. రెండూ ఉంటాయి.. వీటిని సమానంగా స్వీకరిస్తేనే సక్సెస్‌ సాధించగలం..’ అంటూ ఓ ఆంత్రప్రెన్యూర్‌గా ఎంతోమంది మహిళల్లో స్ఫూర్తి నింపుతోన్న వినీత.. ఇద్దరు పిల్లల తల్లిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. వ్యక్తిగతంగా పరుగును ఇష్టపడే ఆమె.. తన రెండో ప్రెగ్నెన్సీ సమయంలో ఆరు నెలల గర్భంతో 21 కిలోమీటర్లు పరిగెత్తి ఆదర్శంగా నిలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్