Updated : 30/12/2022 07:38 IST

కొన్ని మెరుపులు..కొన్ని సొగసులు

రెండేళ్లు కరోనా గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ గడిపినా ఈ ఏడాది ఆ భయం నుంచి బయటపడ్డాం. కాలేజీలూ ఆఫీసులకే కాదు, సినిమాలూ షికార్లూ పెళ్లిళ్లూ పేరంటాలకూ స్వేచ్ఛగానే తిరిగాం. కళాకారులూ వ్యాపారవేత్తలతో పోటీ పడుతూ మనం కూడా మార్కెట్లో వచ్చిన కొత్త ధోరణులను అనుసరించాం. ఈ సంవత్సరం మనందరినీ అలరించి, ఆనందాలు పంచిన ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ను ఒకసారి గుర్తుచేసుకుందాం...


సీక్విన్‌ చీరలు

గాగ్రా, చుడీదార్‌, టీషర్ట్‌, డంగ్రీ, స్ట్రాపీ రఫుల్‌, పలాజో, ధోతీప్యాంట్‌.. ఇలా దుస్తుల్లో ఎన్ని రకాలున్నా చీరను తలదన్నేది మాత్రం లేదంటే లేదు. ఉన్న అందాన్ని రెట్టింపు చేస్తుంది చీర. అలాంటి చీర తళుకులీనుతూ ధగధగలాడితే ఇక చెప్పాల్సిందేముంది! సౌందర్యం పదింతలై చూపరుల మనసులు దోచేస్తుంది. ఆ పనే చేస్తున్నాయి సీక్విన్‌ చీరలు. ఇవి రాత్రి వేళ మరీ మరీ మెరుస్తూ ఆహా ఓహో అనిపిస్తాయి. అందుకే ఈ ఏడాది సీక్విన్‌ చీరల హవా నడిచింది.


కోల్డ్‌ షోల్డర్స్‌

ది చాలాకాలంగా అలరిస్తున్న ఫ్యాషనే అయినా ఈ సంవత్సరం మరీ ఆకట్టుకున్న ప్యాటర్న్‌గా నిలిచింది. ఫుల్‌, త్రీ ఫోర్త్‌ స్లీవ్స్‌ వల్ల చేతుల కింద చెమట పట్టి చిరాకేయడం మనందరికీ అనుభవమే. భుజాల మీద గుండ్రంగా లేదా అర్ధచంద్రాకారంగా కట్‌ ఉన్న కోల్డ్‌ షోల్డర్స్‌ ఆ బాధను నివారిస్తాయి కనుక చిన్నాపెద్దా వీటిపట్ల మొగ్గుచూపుతున్నారు. ఆఫ్‌ లేదా కోల్డ్‌ షోల్డర్స్‌ అందానికి అందం, చెమటను తరిమేసి అలసట కలిగించదంటూ మురిసిపోయారు.


హై వెయిస్టెడ్‌ జీన్స్‌

నలో జీన్స్‌ ఇష్టపడని వాళ్లెవరు చెప్పండి? సాధారణ జీన్స్‌ సంగతలా ఉంచితే ఈ ఏడాది హై వెయిస్టెడ్‌ జీన్స్‌ పట్ల ఎక్కువమంది మొగ్గు చూపారు. పొట్టి పొట్టి టాప్స్‌ ధరించినా పొట్ట కనిపించకుండా కప్పేస్తూ ఇటు గ్లామర్నీ అటు డిగ్నిటీనీ నిలబెడతాయని సాధారణ స్త్రీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక టాప్‌ మోడల్సేమో ‘వీటినెవరైనా ప్రేమించి తీరాల్సిందే’ అంటున్నారు. 


కాఫ్తాన్‌

ఇంటా బయటా పనిచేసి అలసిపోయిన మనం రాత్రయ్యేసరికి నైటీ తగిలించేసుకుంటాం. జాకెట్టు, కుర్తీల్లా ఒంటికి అంటిపెట్టుకుని ఉండదు కనుక అందులో సౌఖ్యంగా ఉంటుంది. దానికి ఆధునికతను జోడించి సీతాకోకచిలుకను తలపించేలా రూపొందించిందే కాఫ్తాన్‌. ఇంకాస్త వదులుగా, మరింత సౌకర్యంగా ఉన్నందున హాయిగా సేదతీరొచ్చు అనేది అమ్మాయిల మూకుమ్మడి అభిప్రాయం.


అద్దాల కళ్లద్దాలు

ళ్లజోడు చూపుని మెరుగుపరచడానికి మాత్రమే అనుకుంటే పొరపాటే. అదో ఆభరణంగా నిలుస్తోంది. అనేక రంగులూ ఆకృతులతో అదుర్స్‌ అనిపిస్తాయి. ‘నీ కంటి పాపలో చూసుకోనా’ అని ఒకప్పడు పాడుకుంటే ఎదుటివాళ్ల కళ్లద్దాల్లో మనల్ని చూసుకోవడం ఇవాళ్టి ట్రెండ్‌. ఎదుటి దృశ్యాల్ని దుప్పట్లా కప్పేసుకుని వింత సోయగాలు పోయే మిర్రర్డ్‌ సన్‌ గ్లాసెస్‌ ఈ సంవత్సరం ట్రెండీగా నిలిచాయి.


గెలాక్సీ ప్యాటర్న్స్‌

పూలూ లతలూ యాబ్‌స్ట్రాక్ట్‌లతో ఎన్ని వన్నెచిన్నెలు చూసినా తనివితీరనివారికి గెలాక్సీ ప్రింట్‌ కొత్త అనుభూతులు పంచుతుంది. సెల్‌ఫోన్‌ కవర్ల దగ్గర్నుంచీ హ్యాండ్‌బ్యాగుల వరకూ ఆకాశం, పాలపుంత డిజైన్లు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా అంగుళంలో సగం లేని గోళ్ల మీద నక్షత్ర వీధులు కనిపిస్తే భలే ఉంటుంది కదూ! ఈ ఏడాది నెయిల్‌ ఆర్ట్‌లో గెలాక్సీ ప్రింట్‌ హైలైట్‌గా నిలిచింది.


బాడీ గ్లిట్టర్‌

గలూ దుస్తులూ ప్రకాశించడం మామూలే. కానీ శరీరం చమ్కాయించడమే కొత్త. బాడీ గ్లిట్టర్‌ మునుపు సినిమావాళ్లకి మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడది ఆధునిక మహిళలకూ చేరువైంది. కనురెప్పలూ, బుగ్గల మీద గ్లిట్టర్‌ ప్రయోగించే వారి సంఖ్య బాగా పెరిగింది. ఈ సంవత్సరం దాని పరిధిని ఇంకాస్త విస్తరింపచేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని