తను ప్రయాణించే ఫ్లైట్‌కి కూతురే పైలట్.. భావోద్వేగంలో తండ్రి!

తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. తన కూతురు ఎదుగుదల కోసం ప్రతి తండ్రి ఎన్నో త్యాగాలను చేస్తుంటాడు. అలాగే కూతుళ్లు కూడా సమయం వచ్చినప్పుడల్లా తండ్రిపై ఉన్న ప్రేమను,  గౌరవాన్ని చాటుకుంటారు. ఇలాంటి దృశ్యమే తాజాగా ఓ విమానంలో....

Published : 17 Jan 2023 12:12 IST

(Photos: Screengrab)

తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. తన కూతురు ఎదుగుదల కోసం ప్రతి తండ్రి ఎన్నో త్యాగాలను చేస్తుంటాడు. అలాగే కూతుళ్లు కూడా సమయం వచ్చినప్పుడల్లా తండ్రిపై ఉన్న ప్రేమను,  గౌరవాన్ని చాటుకుంటారు. ఇలాంటి దృశ్యమే తాజాగా ఓ విమానంలో చోటుచేసుకుంది. పైలట్‌గా ఎదిగిన కూతురు విమానం నడిపే ముందు తన తండ్రికి పాదాభివందనం చేసింది. తను నడిపే ఫ్లైట్‌లోనే తండ్రిని ఎక్కించుకుని ఆయన్ని ఆనందంలో ముంచింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. దాంతో ఈ తండ్రీకూతుళ్లు నెట్టింట వైరల్‌గా మారారు.

విదేశాల్లో శిక్షణ తీసుకుని...

మహారాష్ట్రకు చెందిన క్రుతద్న్య హేల్ సలావ్‌లోని ఆదిత్య బిర్లా స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది. ఆ తర్వాత పైలట్‌ కావాలనే లక్ష్యంతో ఫిలిప్పీన్స్‌, స్పెయిన్‌ దేశాల్లోని ఏవియేషన్ సంస్థల్లో శిక్షణ తీసుకుంది. తను ప్రస్తుతం ‘గో ఫస్ట్‌’ సంస్థలో ఎయిర్‌లైన్‌ పైలట్‌గా పనిచేస్తోంది. పైలట్‌గా ఎంత బిజీగా ఉన్నా హేల్ సామాజిక మాధ్యమాల్లో మాత్రం చురుగ్గా ఉంటుంది. ఈ క్రమంలో తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తను సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా నడుపుతోంది. ఇందులో తనకు సంబంధించిన వీడియోలను రెగ్యులర్‌గా పోస్ట్‌ చేస్తుంటుంది.

తండ్రికి పాదాభివందనం చేసి..!

హేల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చురుగ్గా ఉంటుంది. తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో హేల్‌ ఇటీవలే ఓ రీల్‌ పోస్ట్‌ చేయగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో తను విమానం నడిపే ముందు తన తండ్రికి పాదాభివందనం చేయగా.. ఆయన భావోద్వేగానికి లోనయినట్లుగాఉంది.

‘ఫ్లైట్ టేకాఫ్‌ అయ్యే ముందు నాన్న దీవెనలు తీసుకున్నా.. నాన్నను నా ఫ్లైట్‌లోనే తీసుకెళ్లా.. నా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోకుండా నేను ఇంటి నుంచి బయటకు వెళ్లేదాన్ని కాదు. కొన్ని సందర్భాల్లో నేను ఉదయం 3, 4 గంటలకే డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో అమ్మానాన్నలు నిద్రలో ఉంటారు. అప్పుడు వారి కాళ్లకు నమస్కరించి వెళ్తే కానీ నాకు రోజు పరిపూర్ణమవ్వదు’ అని రాసుకొచ్చింది హేల్.

ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. దాదాపు 6 లక్షల మంది ఈ పోస్ట్‌ను లైక్‌ చేశారు. పైలట్‌గా రాణిస్తూ తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచినందుకు హేల్‌ని పలువురు ప్రశంసిస్తున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్