నాన్నా... నేనే నీ ప్రాణం!

పుట్టగానే ‘మా ఇంటి సిరి’ అని మురిశావు. పొత్తిళ్లలో నన్ను చూసి... తాకితేనే కందిపోతానని భయపడ్డావు. ఏడిస్తే ఆకలేమో అని పాలడబ్బాతో రెడీ అయిపోయేవాడివనీ, మధ్య రాత్రి లేస్తే... నిద్ర మానుకుని భుజానేసుకుని తిప్పేవాడివనీ, కాస్త జలుబు చేస్తే... హాస్పిటల్‌కి పరుగెత్తేవాడివనీ... అమ్మ చెబుతుంటే, అప్పటి నీ ముఖంలో ఆందోళనను నేను ఊహించగలను.

Updated : 16 Jun 2024 06:50 IST

పుట్టగానే ‘మా ఇంటి సిరి’ అని మురిశావు. పొత్తిళ్లలో నన్ను చూసి... తాకితేనే కందిపోతానని భయపడ్డావు. ఏడిస్తే ఆకలేమో అని పాలడబ్బాతో రెడీ అయిపోయేవాడివనీ, మధ్య రాత్రి లేస్తే... నిద్ర మానుకుని భుజానేసుకుని తిప్పేవాడివనీ, కాస్త జలుబు చేస్తే... హాస్పిటల్‌కి పరుగెత్తేవాడివనీ... అమ్మ చెబుతుంటే, అప్పటి నీ ముఖంలో ఆందోళనను నేను ఊహించగలను. ఎందుకంటే అమ్మ ఎప్పుడైనా మురిపెంగా ఏ ఎంబ్రాయిడరీ గౌనో వేస్తే... నా లేత చర్మం ఎక్కడ కందిపోతుందో అని గిలగిలలాడేవాడివి కదా! నీ గురించి నాకు తెలియదా... ఎంత బిజీగా ఉన్నా స్కూల్లో కాలేజీలో ఇబ్బంది పడ్డ క్షణం... నాకు ధైర్యాన్నిచ్చి ప్రోత్సహించేవాడివి. నాకోసం నీ సరదాలూ సంతోషాలూ అన్నీ పక్కనపెట్టేశావు. నాకోసమే నువ్వు అన్నట్లుగా పెంచావు. అందుకే నీలా చూసుకునే వాడే నా జీవితంలోకి రావాలనుకున్నా. తారసపడ్డ ప్రతి ఒక్కరిలో నీ కోసమే వెతికా. అది అసాధ్యం అనిపిస్తోంది. ఒక్కటి మాత్రం నిజం నాన్నా... నేను నీకు మాత్రమే యువరాణిని. నీ ప్రేమకు నీవే సాటి... దానికెవరూ లేరు పోటీ!  ఫాదర్స్‌ డే సందర్భంగా... తమని ఇంతగా ప్రేమించి వెన్నంటి నడిపించిన నాన్నల గురించి కూతుళ్ల మాటల్లో...


అన్నింటా ప్రోత్సహిస్తారు

సాయి అలేఖ్య రావురి, సివిల్స్‌ ర్యాంకర్‌

నన్ను సివిల్స్‌వైపు నడిపింది నాన్నే. పేరు ప్రకాష్‌రావు, కానిస్టేబుల్‌. ఆయనెప్పుడూ ‘నువ్వేం చేసినా అది నలుగురికీ సాయపడేలా ఉండా’లనేవారు. చిన్నప్పట్నుంచీ అనాథాశ్రమాలకు తీసుకెళ్లడం, ఆయన చూసిన సంఘటనల గురించి చెప్పడం లాంటివి చేసేవారు. కిందిస్థాయి నుంచి ఎదిగిన ఆఫీసర్లు, సమాజసేవ చేస్తోన్న వారి కథనాలు పేపర్లలో వస్తే చదవమనేవారు. మాది బోనకల్‌ మండలంలోని గోవిందాపురం. ఏడోతరగతిలో అనుకుంటా! ఓసారి రిపబ్లిక్‌ డే పరేడ్‌కి తీసుకెళ్లారు. అక్కడ కలెక్టర్‌కి పోలీసులు గౌరవవందనం చేయడం నన్ను ఆకర్షించింది. అలా సివిల్స్‌ వైపు అడుగులేశా. ఏదైనా విషయంపై అవగాహన కలిగించడానికి దాని గురించి చెబితే సరిపోదని నమ్ముతారు నాన్న. అందుకే ‘నీ అభిప్రాయమేంటి’ అనడుగుతారు. ప్రతి విషయాన్ని చర్చిస్తారు. పొరపాటేమైనా ఉంటే చెబుతారు. నేననుకున్నది సబబు అనిపిస్తే దానికే ఓటేస్తారు. అలా బలమైన వ్యక్తిత్వం ఉండేలా తీర్చిదిద్దారు. కాబట్టే, ఎంపీసీ చదివిన నేను ఒక్కసారిగా కెరియర్‌ మార్చుకుని బీఏ, రూరల్‌ డెవలప్‌మెంట్‌లో పీజీ చేస్తానన్నా కాదనలేదు. సివిల్స్‌ అయితే ఏకంగా నాలుగుసార్లు విఫలమయ్యా. ఐదోసారి ప్రయత్నిస్తోంటే ప్రోత్సహించారు. ర్యాంకు సాధిస్తే ఆనందించినా ‘ఇది మొదటి మెట్టే. ఇంకా నువ్వు చేయాల్సింది చాలా ఉంద’న్నారు. అయితే నా ర్యాంకుకి ఐఆర్‌ఎస్‌ వస్తుంది కానీ ఐఏఎస్‌ రావట్లేదు. దాంతో మళ్లీ రాస్తానన్నా. ‘ఇదీ సమాజానికి సాయపడే వేదికే కదా’ అన్నా నాకు నచ్చిందే చేయమన్నారు. భయపడుతూ కాదు నచ్చి చేసేలా ప్రోత్సహిస్తారు నాన్న. కాబట్టే, స్వేచ్ఛగా అనుకున్నది సాధిస్తూ వెళుతున్నా.


నాకోసం ఉద్యోగం మానేశారు

గొంగడి త్రిష, క్రికెటర్‌

నాన్న రాంరెడ్డి హాకీ ప్లేయర్‌. పోటీల్లోనూ పాల్గొన్నారట. కానీ పెద్దయ్యాక కొనసాగించలేకపోయారు. అందుకే తన పిల్లలు ఆటల్లో రాణించేలా చేయాలనుకున్నారు. అలా నేను పుట్టకముందే ఆట నా జీవితంలో భాగమైంది. క్రికెట్‌ అంటే మనవాళ్లకి ఎంత క్రేజో తెలుసుగా! నాన్న కూడా అభిమానే. అందుకే నన్ను అటువైపు నడిపారు. తొలిరోజుల్లో ఆయనే కోచ్‌. రెండో ఏట నుంచే సాధన ప్రారంభించా. నాకు పెయింటింగ్‌ అంటే ఆసక్తి. ఉదయం లేవడానికి నేను గోల చేసినా, ఆడనన్నా... పెయింటింగ్‌ కిట్‌ కొనిస్తాననేవారు. వాటిపై ప్రేమతో ఆనందంగా గ్రౌండ్‌కి వెళ్లేదాన్ని. తరవాత నెమ్మదిగా క్రికెట్‌పై ప్రేమలో పడ్డా. మాది భద్రాచలం. నాకు ఏడేళ్లు వచ్చాక నిపుణుల శిక్షణ అవసరమని అమ్మమ్మ, తాతయ్యలతోపాటు నన్ను హైదరాబాద్‌ పంపారు. అమ్మానాన్నలు వారాంతాల్లో వచ్చేవారు. ఇలా ఏడాదికిపైగా సాగింది. అకాడమీ చాలా దూరంలో ఉండేది. తాతయ్యే దగ్గరుండి తీసుకురావడం, తీసుకెళ్లడం చేసేవారు. అనుకోకుండా ప్రమాదం జరిగి నాకు, తాతయ్య ఇద్దరికీ గాయాలయ్యాయి. అది చూసి నాన్న కూడా హైదరాబాద్‌ వచ్చేశారు. ఐటీసీలో ఫిట్‌నెస్‌ కన్సల్టెంట్‌ ఆయన. జిమ్‌నీ నిర్వహించేవారు. కానీ వాటన్నింటినీ వదిలేసి, ప్రతిక్షణం నాకే కేటాయించారు. ఉదయం 5.30కి ఇంటి నుంచి బయటపడి... శిక్షణ పూర్తిచేసుకుని రాత్రి ఇంటికి చేరేవరకూ ఆయన నాతోనే ఉంటారు. ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా నా వెన్నెంటే వస్తారు. భారత్‌ తరఫున ఆడాలి. ఇన్ని కోట్లమంది భారతీయులకు ప్రాతినిధ్యం వహించే ఆ పదకొండు మంది జట్టులో నేను భాగమవ్వాలన్నది ఆయన ఆశ. అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలిచాక కప్పు చూపించడానికి వెంటనే నాన్నకి వీడియోకాల్‌ చేశా. అది చూసి ఆయన ఎంత ఆనందించారో. ఎప్పుడు సరిగా ఆడకపోయినా, గెలవకపోయినా ఎక్కడ పొరపాట్లు చేశానో చెప్పేవారంతే. ఎప్పుడూ కోప్పడటం నేనెరగను. అయితే సాధన చేయను అంటే మాత్రం ఊరుకునేవారు కాదు. ‘గెలుపు ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. కానీ నీవంతు ప్రయత్నం నేడు చేశావా లేదా అన్నదే ముఖ్యం. ఈరోజు నువ్వు బద్ధకిస్తే ఆ స్థానాన్ని మరొకరు భర్తీ చేస్తార’నేవారు. సీనియర్‌ జట్టులో స్థానం సాధించాలి, నాన్న కల నెరవేర్చాలన్నది నా లక్ష్యం. 


నాన్నకూచిగా ఉండడం అంటే... జీవితాంతం మనకో శాశ్వత రక్షకుడు ఉండడమే.

మారినెలా రేకా, రచయిత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్