తండ్రి కోసం... 58 ఏళ్ల నిరీక్షణ!

నాన్న ఫొటో చూడగానే షీలా జాన్‌కి దుఃఖం ఆగలేదు. కన్నీళ్లు జలజలా రాలాయి. ఒకటా రెండా అయిదు దశాబ్దాలు ఆయన్ని చూడటానికి ఎదురు చూశారామె. కన్నతండ్రిని చూడటానికి ఇన్నేళ్లు వేచి చూడటమేంటి? తెలియాలంటే ఆమె కథ చదివేయాల్సిందే!

Published : 17 Jun 2024 04:10 IST

నాన్న ఫొటో చూడగానే షీలా జాన్‌కి దుఃఖం ఆగలేదు. కన్నీళ్లు జలజలారాలాయి. ఒకటా రెండా అయిదు దశాబ్దాలు ఆయన్ని చూడటానికి ఎదురు చూశారామె. కన్నతండ్రిని చూడటానికి ఇన్నేళ్లు వేచి చూడటమేంటి? తెలియాలంటే ఆమె కథ చదివేయాల్సిందే!

షీలా నాన్న పేరు సీఎం మాథ్యూస్‌. వీళ్లది కేరళలోని కుంభనాడ్‌. తండ్రి ఉపాధి కోసమని మలేసియాలోని క్యారే ద్వీపానికి వెళ్లారు. అక్కడాయన రబ్బర్‌ ప్లాంటేషన్‌ ఫ్యాక్టరీలో మేనేజర్‌. ఆయన ముందు వెళ్లి, తరవాత భార్యని తీసుకెళ్లారు. అక్కడే షీలా, ఆమె సోదరుడు పుట్టారు. అప్పుడు షీలాకి ఆరేళ్లు ఉంటాయేమో. గుండెపోటుతో మాథ్యూస్‌ చనిపోయారు. కుటుంబ బాధ్యత అంతా ఆయనదే. అమ్మేమో గృహిణి. స్థోమత లేక భర్తని స్థానిక చర్చిలో సమాధి చేశారామె. అక్కడ జీవించలేక పిల్లలను తీసుకొని భారత్‌కి వచ్చేశారు. వచ్చేముందు భర్త జ్ఞాపకార్థం అక్కడ ఆయన ఫొటో, పేరుతో సమాధి కట్టించారామె. నాన్న లేని లోటు షీలాకి ఎప్పుడూ ఉండేది. కనీసం ఆయన సమాధి అయినా చూడాలనుకునేవారు. పెళ్లయ్యాక భర్త ద్వారా అవకాశమొచ్చింది. ఆశగా వెళితే పెరిగిన చర్చ్‌లు, సమాధుల్లో తండ్రి సమాధి కనిపించలేదు. షీలా భర్త జాన్‌ జర్నలిస్ట్‌. ఆయన భార్య బాధ చూడలేక తనకు తెలిసిన వాళ్లద్వారా చాలా ప్రయత్నాలు చేశారు. అక్కడికి వలస వెళ్లిన భారతీయులు ముఖ్యంగా మాథ్యూస్‌తో పనిచేసిన వారినీ సంప్రదించారు. రోజులు కాదు ఏళ్లు వెతికినా ప్రయోజనం లేదు. కానీ ఆమెలో ఆశ చావలేదు, ప్రయత్నాలు ఆపలేదు. అయితే కొవిడ్‌ వాళ్లకి లాభించింది. అప్పుడు పెరుగుతున్న మరణాలకు తగ్గట్టుగా అక్కడి ప్రభుత్వం శ్మశానాలను పునరుద్ధరించింది. ఆ సమయంలో పిచ్చిమొక్కల కింద దాగిన మాథ్యూస్‌ సమాధి బయటపడింది. అలా షీలా 58 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఇన్నేళ్ల తరవాత తండ్రి సమాధి చూసిన ఆమె కన్నీటిని ఆపుకోలేక భోరుమన్నా... చివరకు తన ఆశ నెరవేరిందని సంతోషించారు కూడా. ‘ఇప్పుడు నాన్నని ఎప్పుడైనా చూసుకోవచ్చు. తనివితీరా నా మనసులోని మాటల్ని పంచుకోవచ్చు’ అని సంబరపడుతున్నారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్