Updated : 26/10/2021 18:57 IST

సంతాన సాఫల్యతకు ‘సీతాఫలం’!

సీతాఫలం.. ఈ మధుర ఫలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎంత తిన్నా తనివి తీరని ఈ పండు ఎన్నో అనారోగ్యాల్ని నయం చేస్తుంది. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ మధుమేహం, పీసీఓఎస్‌.. వంటి కొన్ని దీర్ఘకాలిక సమస్యలున్న వారు మాత్రం దీన్ని పక్కన పెడుతుంటారు. ఎందుకంటే ఇది ఆయా సమస్యల్ని మరింత జటిలం చేస్తుందనేది వారి భయం. కానీ ఇవన్నీ అపోహలే అని కొట్టి పారేస్తున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్‌. పైగా ఇది సంతాన సాఫల్యతను పెంచుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సీతాఫలం విషయంలో కొంతమందిలో ఉండే కొన్ని అపోహలకు చెక్‌ పెట్టేందుకు ఇటీవలే ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారామె.

సీతాఫలంలో ఉండే ఫైబర్‌, విటమిన్లు, ఖనిజాలు.. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. ఫలితంగా శరీరంలో వాపు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. అలాగే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ‘అతి అనర్థదాయకం’ అన్నట్లు ఈ పండ్లను రోజుకు రెండు కంటే ఎక్కువగా తీసుకుంటే నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంటుందట! అందుకే వీటిని మోతాదుకు మించకుండా తీసుకోవడం మంచిది.

మీకూ ఈ అపోహలున్నాయా?

అమృతం లాంటి ఈ పండు తినే విషయంలో కొంతమందిలో కొన్ని అపోహలు/భయాలు ఉంటాయి. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వారు రిస్క్ ఎందుకని దీన్ని పక్కన పెడుతుంటారు. కానీ ఆ అవసరం లేదని, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్న వారైనా సరే.. నిర్భయంగా దీన్ని తినచ్చంటున్నారు రుజుత. ఈ క్రమంలోనే ఈ పండుపై ఉన్న కొన్ని అపోహల్ని తొలగించే ప్రయత్నం చేశారు.

* అపోహ : మధుమేహం ఉంటే తినొద్దు!

వాస్తవం : సాధారణంగా గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (GI) విలువ 55 అంతకంటే తక్కువగా ఉన్న ఆహార పదార్థాల్ని మధుమేహం ఉన్న వారికి సూచిస్తారు. అయితే సీతాఫలం GI విలువ 54. కాబట్టి మధుమేహం ఉన్న వారు దీన్ని నిర్భయంగా తినొచ్చు. అంతేకాదు.. ఇది రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపు చేయడంలోనూ సహకరిస్తుంది.

* బరువు ఎక్కువగా ఉన్న వాళ్లు తినకూడదు!

ఇదీ పూర్తిగా అపోహే! ఎందుకంటే ఈ పండులో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువ. ఇక ఇందులో అధిక మొత్తంలో ఉండే ఫైబర్‌ కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉండి క్రమంగా బరువు తగ్గచ్చు. సీతాఫలంలో ఉండే విటమిన్‌ బి6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్లు.. వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు, బరువు తగ్గాలనుకున్న వారు రోజూ దీన్ని ఆహారంలో చేర్చుకోవాలి.

* గుండె జబ్బులున్న వారికి మంచిది కాదు..

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి మెగ్నీషియం నిండి ఉన్న సీతాఫలం ఆ సమస్యను నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే ఇతర ఖనిజాలు, విటమిన్‌ ‘సి’ రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

* పీసీఓఎస్‌ ఉన్న వారు ఈ పండ్లు తినకూడదు.. 

పీసీఓఎస్‌ ఉన్న వారిలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అలసట, నీరసం, మూడ్‌ స్వింగ్స్‌, చికాకు.. వంటివి సర్వసాధారణం. అయితే వీటన్నింటికీ ఐరన్ విరుగుడుగా పనిచేస్తుంది. సీతాఫలంలో అది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి పీసీఓఎస్‌ ఉన్న వారూ ఈ పండు తీసుకోవడం మంచిది. అలాగే ఇది సంతాన సాఫల్యతను సైతం పెంచుతుంది. ఈ పండులోని ఫైబర్‌ - గర్భిణుల్లో మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు, యాంటీ ఆక్సిడెంట్లు - వికారం, వాంతులు.. వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

అయితే సీతాఫలం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదన్నాం కదా అని ఎక్కువగా తినడం కూడా శ్రేయస్కరం కాదంటున్నారు నిపుణులు. కాబట్టి పైన చెప్పుకున్నట్లు రోజుకు రెండు పండ్లు తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ వివిధ రకాల అనారోగ్యాలున్న వారు మోతాదు విషయంలో ఏవైనా సందేహాలుంటే నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకోవడం మరీ మంచిది.


Advertisement

మరిన్ని