Published : 09/10/2022 16:59 IST

పాదాల దుర్వాసనకు చెక్‌ పెట్టండిలా..!

సాధారణంగానే చెమట ఎక్కువగా పట్టినప్పుడు దుర్వాసన రావడం సహజం. ఆ చెమటకు బ్యాక్టీరియా తోడైతే ఆ వాసన అధికమవుతుంది. ముఖ్యంగా షూ, సాక్సులు ధరించే వారికైతే వాటిని తొలగించుకునే వరకు పాదాలకు గాలి తగలదు. ఫలితంగా లోపల ఎక్కువ మొత్తంలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. దీనివల్ల పాదాలు, గోళ్లకు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఇంట్లోనే లభించే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.

బేకింగ్‌ సోడాతో..

పాదాలను శుభ్రం చేసుకోవడానికి బేకింగ్‌ సోడాని ఉపయోగించడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది. దీనికోసం పావు బకెట్‌ గోరువెచ్చని నీటిలో చెంచా బేకింగ్‌ సోడా కలపాలి. ఈ మిశ్రమంలో పాదాలు మునిగేలా ఉంచి 15 నుంచి 30 నిమిషాలు నాననివ్వాలి. బేకింగ్‌ సోడా ఉపయోగించడం వల్ల చెమటలోని పీహెచ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. ఫలితంగా దుర్వాసన రావడం తగ్గుతుంది. ఈ విధంగా వారం రోజుల పాటు రాత్రివేళల్లో క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

నిమ్మరసంతో..

ఒక బేసిన్‌లో పావుకప్పు బేకింగ్‌ సోడా వేసి దానికి ఎనిమిది కప్పుల గోరువెచ్చని నీటిని జత చేయాలి. ఈ మిశ్రమంలో నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులో పాదాలను 15 నుంచి 20 నిమిషాలు నాననిచ్చి తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత పొడి టవల్‌తో బాగా తుడుచుకుని పాదాలను ఆరబెట్టుకోవాలి.

అల్లంతో..

చిన్న అల్లం ముక్క తీసుకుని దాన్ని మెత్తగా చేసుకోవాలి. ఒక కప్పు వేడి నీళ్లు తీసుకొని అందులో మెత్తగా చేసుకున్న అల్లం వేసి 10 నుంచి 15 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి చల్లారనివ్వాలి. రోజూ పడుకునే ముందు ఈ మిశ్రమంతో పాదాలకు మృదువుగా మర్దన చేసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేస్తే ఫలితం కనిపిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని