Femina Miss India: కిరీటం వేటలో మన అమ్మాయిలు

అందాల కిరీటం.. మోడలింగ్‌లో రాణించాలనుకునే అమ్మాయిల కల! అందుకే దాన్ని సాధించడానికి అహోరాత్రులూ కష్టపడతారు. అలాగని శరీర కొలతలే సరిపోవు.. అందమైన మనసుతోనూ మెప్పించాలి.

Updated : 18 Mar 2024 15:51 IST

అందాల కిరీటం.. మోడలింగ్‌లో రాణించాలనుకునే అమ్మాయిల కల! అందుకే దాన్ని సాధించడానికి అహోరాత్రులూ కష్టపడతారు. అలాగని శరీర కొలతలే సరిపోవు.. అందమైన మనసుతోనూ మెప్పించాలి. కొన్ని దశల వడపోతల్లో నిలవాలి. అలా నిలిచి, ఫెమినా మిస్‌ ఇండియా తుది పోరులో పోటీపడుతున్న మన అమ్మాయిలను కలుసుకోండి.


గోమతి రెడ్డి -- రైతు బిడ్డ..

‘ఎంత సంపాదించావన్నది కాదు.. ఎన్ని ఖాళీ కడుపులను నింపావన్న దానిపై నీ విలువ ఆధారపడి ఉంటుంది’ అన్న సూత్రాన్ని నమ్ముతా అంటుంది గోమతి. తనది అన్నమయ్య జిల్లా ముక్కావారిపల్లె గ్రామం. అమ్మ అరుణకుమారి, నాన్న శ్రీనివాసులు రెడ్డి రైతు. బెంగళూరులో విద్యాభ్యాసం సాగించిన గోమతికి చిన్నతనం నుంచీ మోడలింగ్‌పై ఆసక్తి. చదువుతోపాటు దీనిపైనా దృష్టిపెట్టింది. ఎన్నో పోటీల్లోనూ పాల్గొంది. తనో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌. ఉద్యోగం చేస్తూనే మోడలింగ్‌లోనూ రాణిస్తోంది. వివిధ ఎన్‌జీవోలతో కలిసి పిల్లలకు ఆహారం, చదువు అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలనూ నిర్వహిస్తోంది. ‘కలల సాధనకు అమ్మాయి, అబ్బాయి అన్న తేడా లేదు. నాకు డ్రాయింగ్‌, డ్యాన్స్‌ అంటే ఆసక్తి. పిల్లలకూ నేర్పిస్తుంటా. ఓసారి మీకు ఆనందాన్నిచ్చేది గీయమంటే ఒక పిల్లాడు నా బొమ్మ గీసి, ‘గోమతి’ అని రాశాడు. ఇతరులపై మన ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేసిన సంఘటన అది.’ అనే 21 ఏళ్ల గోమతి వాళ్ల సోదరుడు అనారోగ్యంతో చనిపోయాడు. గెలిచి, తన పేరుతో ఎన్‌జీఓ ప్రారంభించి, సేవ కొనసాగించాలన్నది తన కలట. గోమతి ఆంధ్రప్రదేశ్‌ తరఫున పోటీపడుతోంది.


ఊర్మిళ చౌహాన్‌ -- అమ్మే స్ఫూర్తి

‘నాన్న వ్యాపార పనుల్లో తరచుగా బయటికి వెళుతుంటారు. అయిదుగురు పిల్లలం. మా అందరి బాగోగులు అమ్మే చూసుకునేది. మమ్మల్ని చూసుకోవడంలో తను పెట్టిన శ్రద్ధ తన కెరియర్‌పై పెట్టుంటే ఎన్నో విజయాలు సాధించేది. కష్టపడేతత్వం, ఓర్పు తన నుంచే నేర్చుకున్నా’ అంటుందీ 25 ఏళ్ల హైదరాబాదీ. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌, ఫ్లైట్‌ అటెండెంట్‌గా కొనసాగుతూనే ఖాళీ సమయంలో వివిధ సంస్థలు, డిజైనర్లకు మోడల్‌గా చేసింది. ‘అమ్మ క్యాన్సర్‌ నుంచి బయటపడింది. అందుకే క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా’అనే ఊర్మిళ స్నేహితురాలి సలహాతో ‘మిస్‌ ఇండియా’ పోటీలకు ప్రయత్నించింది. ‘మోడలింగ్‌ రంగంలో పోటీ ఎక్కువ. నేను సరిపోతానా అనుకున్నా. ఉద్యోగం, మోడలింగ్‌ మధ్య ఒక్కోసారి నిద్రకీ సమయముండదు. అయినా ప్రయత్నించి, తుది ఎంపికలో నిలిచా. తెలంగాణ తరఫున పోటీ పడుతున్నా’ అంటోన్న ఊర్మిళ ‘కష్టాలకు భయపడి దేన్నీ ప్రయత్నించకుండా వదిలేయొద్దు. ఇప్పుడు కష్టమనిపించిందే రేపు ఊహించని ఫలితాలను ఇస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మి నచ్చింది చేస్తూ వెళ్లండి’ అని సలహానీ ఇస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్