Updated : 13/10/2022 14:12 IST

కుటుంబ క్షేమాన్ని కాంక్షిస్తూ..

పండగలంటే మన సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించడంతో పాటు బోలెడన్ని సరదాల్నీ మనకందిస్తాయి. అయితే వీటిలో అందరూ కలిసి జరుపుకొనే పండగలు కొన్నైతే.. కేవలం మహిళలు మాత్రమే మమేకమై జరుపుకొనేవి మరికొన్ని. అందులో 'కర్వా చౌత్' కూడా ఒకటి. శ్రావణం, కార్తీకం.. వంటి మాసాల్లో ఆడవారు ప్రత్యేకంగా పూజలు, వ్రతాలు నిర్వహించి ఉపవాస దీక్ష చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇదేవిధంగా కర్వాచౌత్ రోజున కూడా ఆడవారు పార్వతీ దేవికి భక్తిశ్రద్ధలతో పూజించి, నిష్టతో ఉపవాసం ఉంటారు. ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత నాలుగో రోజు లేదా దీపావళికి పదకొండు రోజులు ముందుగా వచ్చే ఈ పండగను ఉత్తర భారతదేశం వారు ఎక్కువగా జరుపుకొంటారు. మరి, మహిళలంతా ఎంతో ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకొనే ఈ పండగ వైశిష్ట్యం, నేపథ్యం తదితర అంశాల గురించి తెలుసుకుందాం రండి..

భర్త శ్రేయస్సు కోరి..

మహిళలు ఏది చేసినా అది తన కుటుంబ క్షేమం, గౌరవం కోసమే..! అలాగే కర్వాచౌత్ పండగను పురస్కరించుకొని చాలామంది మహిళలు వారి భర్తల క్షేమం కోసం ఉపవాస దీక్షకు పూనుకుంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కొనసాగే ఈ ఉపవాస దీక్షతో పెళ్త్లెన ఆడవారంతా తమ భర్తలు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉండాలని ఆ పార్వతీ దేవిని వేడుకుంటారు. ఇక పెళ్లి కాని పడతులు తమకు మంచి భర్త రావాలని కోరుకుంటూ ఉపవాసం చేస్తారు. ఇలా మహిళలు తమ భర్త, కుటుంబం బాగుండాలని కోరుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో పార్వతీదేవిని పూజించడమే ఈ పండగ అంతరార్థం.

నేపథ్యమిదే..

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్.. వంటి ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువగా జరుపుకొనే ఈ పండగకు విభిన్న నేపథ్యాలు ఉన్నాయి. అప్పట్లో వాయవ్య రాష్ట్రాల్లోని పురుషులు మొఘల్ ఆక్రమణదారులతో యుద్ధానికి వెళ్లినప్పుడు.. వారి భార్యలు తమ భర్తలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ భక్తితో ఉపవాస దీక్ష చేసేవారట. వారికోసం ప్రత్యేకమైన వంటకాలు సిద్ధం చేసి, నిండుగా అలంకరించుకొని సాయంత్రం భర్త కోసం నిరీక్షించేవారట. అప్పటి నుంచి కర్వాచౌత్ పండగ ప్రాశస్త్యం పొందిందని చెప్పుకొంటూ ఉంటారు.

శరదృతువులో పంట చేతికి రాగానే ఈ పండగ జరుపుకొంటారు. కర్వా అంటే మట్టి కుండ అని అర్థం. ఈ రోజున పెద్ద పెద్ద మట్టి కుండల్లో గోధుమలను నింపి శివపార్వతులకు సమర్పిస్తారు. అలాగే మహిళలంతా వారి బంధువుల్ని, స్నేహితుల్ని కలిసి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెళ్త్లెన ఆడవారికి వారి తల్లిదండ్రులు, అత్తింటివారు ప్రత్యేక బహుమతులిస్తారు.

పెళ్లి కూతుళ్లలా..!

కర్వాచౌత్ పండగ సందర్భంగా చాలాచోట్ల కొత్తగా పెళ్త్లెన మహిళలు తమ పెళ్లి నాటి దుస్తులు, ఆభరణాలు ధరించి, చేతుల నిండా గాజులు వేసుకొని పెళ్లి కూతుళ్లలా ముస్తాబవుతారు. మిగిలిన వారు కొత్త బట్టలతో సంప్రదాయబద్ధంగా ముస్తాబవుతారు. ఈక్రమంలో ఎక్కువగా ఎరుపు, నారింజ, బంగారు వర్ణంలో ఉండే చీరల్ని ధరిస్తుంటారు. అలాగే చేతులను గోరింటాకుతో నింపేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిష్ఠగా ఉపవాసం చేసిన మహిళలు చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడిని దర్శించుకొని తమ భర్తల మోమును జల్లెడలో చూడడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో తమ భర్తలు కలకాలం చల్లగా ఉండాలని వారు కోరుకుంటారు. అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇక ఈ పండగ సమయంలో కొన్ని చోట్ల ఆడవారు ఇంటి పనులేవీ చేయకపోవడం గమనార్హం.

సంతోషానికి, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే కర్వాచౌత్ మహిళా ప్రాధాన్య పండగల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. కుటుంబ శ్రేయస్సును కాంక్షించే మహిళల ఔన్నత్యాన్ని చాటిచెబుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని