Published : 22/08/2021 09:11 IST

శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకొనే పండగలివే..

హిందువులకు శ్రావణమాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణమాసం అంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు ఆలయాలకు వెళ్లి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకొంటారు. శ్రావణ పౌర్ణమిని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకొంటాం. కేవలం మనమే కాదు.. ఈ రోజుని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. ఇదే రోజు విభిన్న ప్రాంతాల్లో విభిన్నమైన పండగలు జరుపుకొంటారు. మరి, వాటి గురించి మనమూ తెలుసుకొందామా..

కజరీ పూర్ణిమ..

కజరీ పూర్ణిమను దేశంలోని మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుపుకొంటారు. దీన్నే కజలి పూర్ణిమ, కజ్లి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి నాడే దీన్ని జరుపుకొంటారు. కజరీ అంటే గోధుమలు అని అర్థం. పంటలు బాగా పండేలా దీవించమని భగవతీ మాతను పూజిస్తారు. ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు దీన్ని జరుపుకొంటారు. శ్రావణ శుక్ల నవమి నాడు మహిళలు తమ పొలాలకు వెళ్లి కుండలో ఆకులు, మట్టి నింపి తీసుకొస్తారు. పూజగదిని ఆవుపేడతో అలికి, గోధుమ పిండితో ముగ్గు వేసి అందులో కుండను ఉంచుతారు. ఆ తర్వాత మట్టిలో ఉన్న ఆకులను నవమి నుంచి పౌర్ణమి వరకు ఏడు రోజుల పాటు పూజిస్తారు. చివరి రోజైన శ్రావణ పౌర్ణమి నాడు సాయంత్రం వేళ పూజ చేసి అప్పటి వరకు పూజ చేసిన మట్టికుండను తలపై పెట్టుకొని దగ్గరలో ఉన్న నదిలోకానీ, చెరువులో కానీ కలిపేస్తారు. భగవతీ దేవికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల భగవతీ దేవి ఆశీస్సులు లభించి పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్ముతారు.

నారికేళ పూర్ణిమ..

నారికేళ పూర్ణిమనే నరలి పూర్ణిమ, నారియల్ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలోని సముద్ర తీర ప్రాంతాల్లోని మత్య్సకారులు ఈ పండగని జరుపుకొంటారు. ఈ పర్వదినాన సముద్రుడు, వరుణులను పూజిస్తారు. సముద్రం నుంచి తమకు, తమ ప్రాంతానికి ఎలాంటి ఆపద రాకుండా కాపాడాలని కోరుతూ నారికేళ పూర్ణిమను జరుపుకొంటారు. మరో విధంగా చెప్పాలంటే.. తమకు బతుకుతెరువు కల్పిస్తోన్న ప్రకృతి తల్లికి ప్రణమిల్లే పండగ ఇది. మత్య్సకారులు సముద్రం ఒడ్డున సముద్రునికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. పూజ అనంతరం అందంగా అలంకరించిన తమ పడవలపై సముద్రంలోకి వెళ్లి కాసేపటికి తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత పాటలు పాడుతూ.. నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు. ఆ రోజంతా కొబ్బరితో తయారుచేసిన వంటకాలను మాత్రమే తింటారు. కొబ్బరి కాయకు కూడా శివుని మాదిరిగానే మూడు కళ్లుంటాయి. అందుకే కొన్ని ప్రాంతాల్లో నారికేళ పూర్ణిమ నాడు శివున్ని పూజిస్తారు.

పవిత్రోపాన..

శ్రావణ పూర్ణిమను గుజరాతీలు పవిత్రోపానగా పిలుస్తారు. ఈ రోజు శివున్ని పూజించి ఆయన ఆశీస్సులు పొందుతారు. ఆలయాలన్నింటినీ వివిధ రకాల పుష్పాలతో అలంకరిస్తారు. భక్తులు శివునికి పాలు, కొబ్బరి నీరు, పెరుగు, తేనె, నీటిని సమర్పిస్తారు. వాటితో సంతృప్తి చెందిన శివుడు ఆరోగ్యాన్ని, సంపదలను ప్రసాదిస్తాడని వారు నమ్ముతారు. ఈ రోజు ముక్కంటిని కొలిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భావిస్తారు. మెలితిప్పి ఉన్న దూది ఒత్తులను పంచగవ్యంలో ముంచుతారు. అప్పుడు అది పవిత్రంగా తయారవుతుందని విశ్వసిస్తారు. వాటిని శివలింగం చుట్టూ కడితే పాపాలు తొలగిపోతాయన్నది వారి నమ్మకం. శివుడు లయకారుడు కాబట్టి భూమ్మీద చెడును నాశనం చేసి ఆనందాన్ని నింపుతాడని నమ్ముతారు. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కూడా ఈ రోజుతోనే ముగుస్తుంది.

అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులంతా శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిగా జరుపుకొంటారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని