స్పిట్టింగ్‌కు వ్యతిరేకంగా పోరాడి..!

కూతురుతో కలిసి రోడ్డు మీద నడుస్తోందామె. అకస్మాత్తుగా ఓ వ్యక్తి ఉమ్మి...  వారి పైన పడటం తీవ్ర కోపాన్ని తెప్పించింది. రహదారులపై ఇలా ఇష్టమొచ్చినట్లు ఉమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకురావాలనుకున్నారు.

Published : 19 Jun 2024 02:52 IST

కూతురుతో కలిసి రోడ్డు మీద నడుస్తోందామె. అకస్మాత్తుగా ఓ వ్యక్తి ఉమ్మి...  వారి పైన పడటం తీవ్ర కోపాన్ని తెప్పించింది. రహదారులపై ఇలా ఇష్టమొచ్చినట్లు ఉమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకురావాలనుకున్నారు. పోరాడి ‘బహిరంగంగా ఉమ్మి వేయడం శిక్షార్షం’ అంటూ చట్టాన్నీ తెప్పించగలిగారు. దీన్ని సమూలంగా అరికట్టడానికి కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన ఒడెట్టి కట్రాక్‌ స్ఫూర్తి కథనమిది.

రహదారులు, గోడలపై ఉమ్మిన మరకలను చూసినప్పుడల్లా ఒడెట్టి కట్రాక్‌కు ఆవేదన, కోపం కలిగేవి. ఈ దురలవాటును అరికట్టించాలనుకున్నారు. బెంగళూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదామంటూ అవగాహనా కార్యక్రమాలు మొదలుపెట్టారు. కొవిడ్‌ సమయంలోనూ పరిశుభ్రతను పాటించకుండా చాలామంది రహదారులపై ఉమ్మడం చూసేవారీమె. అదెంత ప్రమాదకరమో చెప్పాలని ‘బ్యూటిఫుల్‌ భారత్‌’ పిలుపుతో కృషి ప్రారంభించారు. ఉమ్మి వేయడంపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొనేలా చేస్తేనే ఈ అలవాటుకు అడ్డుకట్ట వేయగలం అనుకున్నా అంటారీమె. ‘బహిరంగంగా ఉమ్మడాన్ని శిక్షార్హం చేయమని కోరుతూ ప్రధానికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు పత్రం రాశా. దీనికి మద్దతు తెలిపాలని ప్రజలను కోరా. రెండువారాల్లో 40వేలమందికిపైగా సంతకాలు చేసి తమ మద్దతును ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో ఇదొక ప్రజాపోరాటమైంది. ఈ ప్రభావంతో బహిరంగంగా ఉమ్మడాన్ని శిక్షార్హం చేస్తూ ఏప్రిల్‌ 15న కొవిడ్‌ నివారణ మార్గదర్శకాల్లో ప్రధాని చేర్చారు. అయినప్పటికీ  ఇప్పటికీ చాలామందికి దీనిపై అవగాహన లేదు’ అంటారు ఒడెట్టి కట్రాక్‌.

కార్యక్రమాలతో...

బహిరంగంగా ఉమ్మడంవల్ల కలిగే నష్టాలపై ‘స్టాప్‌ఇండియాస్పిటింగ్‌’ పేరుతో ఈమె పలు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. బెంగళూరు రోటరీ క్లబ్, నమ్మ బెంగళూరు ఫౌండేషన్, అపార్ట్‌మెంట్‌ ఫెడరేషన్‌ దీనికి చేయూతనిస్తున్నాయి. వాలంటీర్లు, విద్యార్థులూ దీనిపై కృషి చేస్తున్నారు. ‘పోస్టర్లు, ప్లకార్డుల ప్రదర్శనలతో ఇప్పటికీ పోరాటం జరుపుతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన దేశంలో క్షయవ్యాధి బాధితులు 37 శాతంమంది ఉన్నారు. ఉమ్ము ద్వారా వ్యాపించే ఈ వ్యాధిని అరికట్టాలంటే ఈ అలవాటుకు అందరూ దూరం కావాలి. అందుకే ‘ఉమ్మి వేయొద్దు, ఉమ్మి వేసేవారిని నిరోధించండి’ అంటూ వీధివీధికీ తిరుగుతూ అవగాహన కలిగిస్తున్నాం. సేవాసంస్థలు, కార్పొరేట్‌ సంస్థలుసహా వేలమంది ఈ పోరాటానికి చేయి కలుపుతున్నారు. ఆన్‌లైన్‌లో ర్యాప్, యాడ్స్‌తో అవగాహన కలిగిస్తున్నా’మనే ఒడెట్టి ప్రయత్నానికి మనమూ చేయూతనిద్దాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్