ప్రసవం తర్వాత.. ఆర్థిక సమస్యలు లేకుండా..!

జీవితంలో ప్రతి దశలోనూ ఆర్థిక ప్రణాళిక అవసరం. లేదంటే.. సమయానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రసూతి సెలవు తీసుకునే ఆరు నెలల కాలమూ ఇందుకు మినహాయింపు కాదు.

Published : 08 Sep 2023 12:14 IST

జీవితంలో ప్రతి దశలోనూ ఆర్థిక ప్రణాళిక అవసరం. లేదంటే.. సమయానికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రసూతి సెలవు తీసుకునే ఆరు నెలల కాలమూ ఇందుకు మినహాయింపు కాదు. అయితే ఈ సమయంలో ఎలాగూ జీతం మొత్తం చేతికి అందుతుంది కదా అన్న ఉద్దేశంతో కొందరు డబ్బు ఖర్చు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు.. పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసే వారికి ప్రసూతి సెలవుల సదుపాయం కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మరి, ఈ తిప్పలేవీ లేకుండా అటు ప్రసూతి సెలవుల్ని, ఇటు అమ్మతనాన్ని ఆస్వాదించాలంటే.. ముందు నుంచే చక్కటి ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

కొంత వెనకేసుకోండి!

ప్రసూతి సెలవుల్లో వేతనం లభించినా, ఇక ఆ తర్వాత కచ్చితంగా తిరిగి ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. అయితే పాపాయి బాధ్యత రీత్యా ఆపై ఉద్యోగం కొనసాగించడం కుదరచ్చు.. కుదరకపోవచ్చు. బుజ్జాయిని చూసుకునే వారు ఎవరూ లేకపోతే.. కచ్చితంగా తల్లే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెలవును పొడిగించుకునే అవకాశం మీ సంస్థ అందిస్తుందో, లేదో ముందుగానే తెలుసుకోండి. ఒకవేళ పొడిగించినా, పొడిగించకపోయినా.. ఈ సమయంలో వేతనం మాత్రం సంస్థలు చెల్లించవు. కాబట్టి ఈ సమయంలో ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురుకావచ్చు. అలా జరగకుండా ఉండాలంటే.. గర్భం ధరించినప్పట్నుంచే కొంత డబ్బు వెనకేసుకోవాలి. ప్రసూతి సెలవు సమయంలో అందే వేతనంలో నుంచీ పొదుపును కొనసాగించాలి. దీనివల్ల మీరు పొడిగించుకున్న సెలవుల్లోనూ ఆర్థిక భరోసా ఉంటుంది. అలాగే మీ పేరు మీద ఉన్న రుణాలు, ఇతరత్రా ఖర్చులకు ఈ పొదుపు వల్ల ఆటంకం కలగకుండా జాగ్రత్తపడచ్చు. దీంతో పాటు మీకు వీలుంటే, సంస్థ అంగీకరిస్తే ఇంటి నుంచి పనిచేసినా సరిపోతుంది. ఆ సదుపాయం లేకపోతే.. తక్కువ సమయం కేటాయించేలా పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు కూడా వెతుక్కోవచ్చు.

ఇద్దరికీ బీమా..!

అత్యవసర సమయాల్లో ఆపద్బాంధవిలా ఉపయోగపడుతుంది బీమా. అందులోనూ ఆరోగ్య బీమా పథకం శ్రీరామ రక్షలా పనిచేస్తుంది. వివిధ సంస్థలు సైతం తమ ఉద్యోగులకు ఇలాంటి బీమా పాలసీ సౌలభ్యాలు అందిస్తుంటాయి. ఒకవేళ మీరు అందులో భాగమైతే.. మీ పాలసీ ద్వారా మీరు ఏయే ప్రయోజనాలు పొందుతారో ముందే అడిగి తెలుసుకోండి. ముఖ్యంగా మీ పాలసీలో మెటర్నిటీ బెనిఫిట్‌ ఉందో, లేదో కనుక్కోండి. లేకపోతే గనుక.. ప్రసూతి ప్రయోజనాలు అందించే మరో పాలసీ బయట తీసుకోండి. దీనివల్ల ప్రసవ సమయంలో చాలావరకు ఖర్చులు కలిసొస్తాయి. ఇలా మీకే కాదు.. డెలివరీ తర్వాత మీ చిన్నారికీ ఆరోగ్య పరంగా పలు అవసరాలు రావచ్చు. వాటిని దృష్టిలో పెట్టుకొని.. బుజ్జాయిని మీ పాలసీలో చేర్చుకోవడం, అది కుదరకపోతే వారి పేరు మీద విడిగా పాలసీ తీసుకోవడం.. వంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలి. తద్వారా డబ్బులకు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

ఆ అవసరాల కోసం..!

బిడ్డకు జన్మనివ్వడం మహిళలకు పునర్జన్మ లాంటిదంటారు. ఈ క్రమంలో కొంతమందిలో ప్రసవానంతర సమస్యలు ఎదురుకావచ్చు. వాటి కోసం మరిన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. ఇక పాపాయి విషయంలోనూ.. డైపర్లు, పాల పొడి, పాల డబ్బా, బేబీ కేర్‌ కిట్‌, వైప్స్‌.. ఇలా బోలెడన్ని అవసరాలుంటాయి. వాటన్నింటికీ కొంత మొత్తం ఖర్చవుతుంది. మరి, వచ్చిన జీతం ఆయా ఖర్చులకు పోను.. ఈ అవసరాలన్నింటికీ అదనంగా డబ్బు కావాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండేందుకు.. బేబీ కోసం ప్లాన్‌ చేసుకున్నప్పట్నుంచే కొంత మొత్తం పక్కన పెట్టడం అలవాటుగా మార్చుకోవాలి.

రెండో ఇన్నింగ్స్‌కు సిద్ధమేనా?

కొంతమంది మహిళలు ప్రసవం తర్వాత పిల్లల బాధ్యత రీత్యా తమ ఉద్యోగాలకు స్వస్తి పలుకుతారు. ఈ క్రమంలో డెలివరీ తర్వాత కాస్త ఆలస్యమైనా సరే.. మహిళలు తమ రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించడమే అన్ని విధాలా మంచిదని సలహా ఇస్తున్నారు నిపుణులు. పిల్లలు స్కూలుకెళ్లే వయసొచ్చాక.. అటు వారి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇటు ఉద్యోగంలో చేరడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావు. ఎందుకంటే పిల్లలు ఎదిగే కొద్దీ చాలా అవసరాలుంటాయి.. ఖర్చులుంటాయి. చేతినిండా డబ్బుంటే ఏ అవసరానికైనా సులభంగా వాడుకోవచ్చు. అలాగే మీకు జీతం పెరిగే కొద్దీ వాళ్ల పేరు మీద చేసే పొదుపునూ పెంచుతూ పోవచ్చు. కెరీర్‌లో ఇంత గ్యాప్‌ వచ్చింది? తిరిగి ఉద్యోగం సంపాదించడం ఎలా? అని వెనకడుగు వేయకండి. ఎందుకంటే ఇలాంటి మహిళల కోసమే కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. వారికి కావాల్సిన నైపుణ్యాల్ని నేర్పుతూ.. తిరిగి వారు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించేందుకు కావాల్సిన కెరీర్‌ మార్గాల్ని చూపిస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్