Published : 13/08/2021 20:11 IST

పెళ్లికి ముందే ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి...

పెళ్లి.. మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. సంతోషం, సరదాలతో పాటు బరువూబాధ్యతలను కూడా వెంట తెస్తుందీ బంధం. ఇలాంటి జీవితాన్ని పూర్తిగా ఆనందించాలంటే.. ఆర్థికంగా బలంగా ఉండడం ఎంతో అవసరం. ఈ క్రమంలో పెళ్లికి ముందే కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటే ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్త పడచ్చు. ఎందుకంటే ఇది మీ ఒక్కరికే సంబంధించిన విషయం కాదు.. ఇద్దరు వ్యక్తులు పరస్పర అవగాహనతో జీవితంలో ముందడుగేసే అంశం. ఈక్రమంలో ఆర్థిక అంశాలకు సంబంధించి పెళ్లికి ముందునుంచే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

మాట్లాడుకోవాలి..

ప్రస్తుత కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తేగానీ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా నెగ్గుకు రాలేకపోతున్నారు. కానీ కొందరి ఆలోచనలు వేరుగా ఉండచ్చు. కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ ఇంట్లోనే ఉండాలని కోరుకునే వారూ ఉంటారు. అందుకే కాబోయే మీ జీవిత భాగస్వామితో పెళ్లి తర్వాత ఖర్చుల గురించి మాట్లాడి ఒక అవగాహనకు రావాలి. వివాహం తర్వాత ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారా? లేదా మీరు ఇంట్లోనే ఉండి కుటుంబ బాధ్యత, పిల్లల సంరక్షణ వంటి విషయాలపై శ్రద్ధ తీసుకుంటారా? వంటి విషయాల గురించి ముందుగానే మాట్లాడుకొని ఓ అవగాహనకు రావడం అవసరం. ఫలితంగా, కుటుంబం మొత్తానికి నెలసరి బడ్జెట్ ఎంతవుతుంది? దానికోసం అదనంగా మీ ఇద్దరూ కలిసి చేయాల్సిన కృషి ఏంటి? అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

అప్పుల తిప్పలు..

కొన్ని విషయాల్లో మొహమాటం లేకుండా ఉండడమే శ్రేయస్కరం. కాబోయే భార్యాభర్తల విషయంలోనూ ఇది మినహాయింపు కాదు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో. ప్రస్తుతం దాదాపు అందరి దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటోంది. అది ఉందనే ధైర్యంతో పాటు నెలసరి వాయిదాల్లో కట్టుకోవచ్చన్న భావనలో చాలామంది ఎక్కువగా ఖర్చు చేసేస్తున్నారు. మీ జీవిత భాగస్వామి ఆస్తులు, అప్పుల వివరాలు కనుక్కోండి. ఇందులో తప్పులేదు. ఎందుకంటే.. పెళ్లి తర్వాత వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలు ఇద్దరూ సమానంగా నెరవేర్చాల్సి వచ్చినప్పుడు మీకు కాబోయే భర్త చేసిన అప్పులు సమస్యగా మారకుండా ఉండాలి కదా? అదే విధంగా లోన్‌లు ఏమైనా తీసుకున్నారేమో కనుక్కోండి. వివాహం తర్వాత రుణాల వాయిదాలు కట్టగలం అన్న నమ్మకం ఇద్దరిలో ఏర్పడడం ముఖ్యమని గుర్తుంచుకోండి. అలాగే మీకు సంబంధించిన అప్పులు, ఇతర లోన్ల సంగతి కూడా నిజాయతీగా మీ భాగస్వామితో పంచుకోండి.

ఆది నుంచే పొదుపు మంత్రం

వివాహ ఘడియలు దగ్గర పడుతున్నాయి అనుకున్నప్పుడు కాకుండా కాస్త ముందు నుంచే పొదుపు పాటిస్తే ఏ విషయంలోనూ ఇబ్బంది పడకుండా ఉంటారు. మీరు మంచి ఉద్యోగంలో స్థిరపడినట్త్లెతే, మొదటి నెల జీతంలో నుంచే పొదుపు చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఆర్‌డీ.. తదితర విధానాల్లో పొదుపు-మదుపు చేయడం వల్ల మీకు భవిష్యత్తులో అత్యవసర సమయాల్లో ఆర్థికంగా ఇబ్బంది ఎదురవ్వదు. ఒకవేళ ఇల్లు, వాహన రుణం తీసుకుంటే, ఆ అప్పు వివాహ సమయానికి వీలైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మేలు. దీనివల్ల పెళ్లి తర్వాత పెరిగిపోయే బడ్జెట్‌ను కాస్త సమన్వయపర్చుకునే వీలు కలుగుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి