అందుకే డబ్బు విషయంలో దాపరికాలొద్దు!

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అన్నారో తత్త్వవేత్త. అంటే అనుబంధాల కంటే ఆర్థిక పరమైన అంశాలకే ఎక్కువ విలువిస్తారన్నది దాని అర్థం. డబ్బు ఒక్కోసారి జీవితాలనే ప్రభావితం చేస్తుంటుంది. ముఖ్యంగా డబ్బు నిర్వహణ విషయంలో కొంతమంది దంపతుల మధ్య దాపరికాలుండడం వల్ల ఇద్దరి మధ్యా పొరపచ్ఛాలు దొర్లుతుంటాయి.

Updated : 24 Jun 2021 12:52 IST

‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అన్నారో తత్త్వవేత్త. అంటే అనుబంధాల కంటే ఆర్థిక పరమైన అంశాలకే ఎక్కువ విలువిస్తారన్నది దాని అర్థం. డబ్బు ఒక్కోసారి జీవితాలనే ప్రభావితం చేస్తుంటుంది. ముఖ్యంగా డబ్బు నిర్వహణ విషయంలో కొంతమంది దంపతుల మధ్య దాపరికాలుండడం వల్ల ఇద్దరి మధ్యా పొరపచ్ఛాలు దొర్లుతుంటాయి. ఇవే క్రమంగా వారి అనుబంధాన్ని బలహీనపరుస్తుంటాయి. అందుకే ఆర్థిక పరంగా భార్యాభర్తలిద్దరూ ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు.

ఒకవేళ అలా లేకపోతే ఏమవుతుందో ఇటీవలే జరిగిన ఈ సంఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ ప్రాంతంలో తన భర్తకు తెలియకుండా ఓ భార్య గొలుసుకట్టు స్కీమ్‌లో చేరింది. తనకు తెలిసినవారినందరినీ ఇందులో చేర్పించింది. ఈ క్రమంలో తనను చేర్పించిన వ్యక్తి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. డబ్బులు ఇక రావని, మోసపోయానని తెలుసుకున్న ఆమె.. ఆ మానసిక వేదన భరించలేక తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. అదే.. తాను ఇలా స్కీమ్‌లో చేరానంటూ ముందుగానే ఈ విషయం తన భర్తతో పంచుకొని ఉంటే ఏదో ఒక పరిష్కారం దొరికేది కదా! భార్యలే కాదు.. భర్తలూ డబ్బు విషయంలో తమ ఇల్లాలి దగ్గర ఎలాంటి దాపరికాల్లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలి. అయితే ఈ క్రమంలో దంపతులిద్దరూ కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవడం మంచిది.

చర్చ జరగాలి!

భార్యాభర్తలన్నాక ఎన్నో విషయాల గురించి చర్చించుకుంటారు. కానీ కొంతమంది ఆర్థిక పరమైన విషయాల గురించి తమ భాగస్వామితో మాట్లాడడానికి అయిష్టత చూపుతుంటారు. ఎందుకంటే ‘సంపాదించేది నేను కాబట్టి ఎలా ఖర్చు చేయాలో నాకు తెలియదా?’ ‘తనకేంటి చెప్పేది?!’ అన్న ఆలోచనతో ఉంటారు. కానీ ఇద్దరూ కలిసి సంసార నావ నడుపుతున్నప్పుడు డబ్బు నిర్వహణ విషయాలూ ఇద్దరికీ తెలిసుండాలని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో వచ్చిన ఆదాయంలో ఎవరెంత ఖర్చు చేస్తున్నారు? ఎందులో పెట్టుబడులు పెడుతున్నారు? అప్పులేమైనా ఉన్నాయా? పొదుపు పథకాల్లో చేరారా?.. వంటి విషయాల్లో పారదర్శకంగా ఉండాలి. అప్పుడే ఏదైనా సమస్య వస్తే ఇద్దరూ కలిసి పరిష్కరించుకోవడానికి వీలవుతుంది. ఇది ఇద్దరి మధ్య అన్యోన్యతనూ పెంచుతుంది.

దాస్తే మీకే నష్టం!

దంపతుల మధ్య ఆర్థిక పరమైన దాపరికాలు మంచివి కావంటున్నారు నిపుణులు. ఇలాంటి వాటి వల్ల మీ భాగస్వామి మీపై నమ్మకం కోల్పోయే ప్రమాదమూ ఉందంటున్నారు. అంతేకాదు.. తెగే దాకా లాగితే నష్టపోయేది మీరే అని ఓ సర్వే చెబుతోంది. ఇందులో భాగంగా.. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ భాగస్వామి దగ్గర డబ్బుకి సంబంధించిన విషయాలను దాస్తున్నారట. దీని వల్ల తమ దాంపత్య జీవితంలో పొరపచ్ఛాలు వచ్చాయని 76 శాతం మంది చెబుతున్నట్లు సర్వేలో తేలింది. అయితే ఇలా అసలు విషయం దాచి తర్వాత బాధపడడం కంటే ముందుగానే ఒకరికొకరు తెలియజేసుకోవడం మంచిది కదా అన్నది నిపుణుల అభిప్రాయం!

బడ్జెట్‌ వేస్తున్నారా?

దంపతుల్లో ఎవరెంత సంపాదించినా ఆర్థిక క్రమ శిక్షణ ముఖ్యమంటున్నారు నిపుణులు. పొదుపు-మదుపులు, ఖర్చులు, పిల్లల బాధ్యతలు.. వంటివన్నీ దీంతోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి ‘తన కంటే నేనే ఎక్కువ సంపాదిస్తున్నా.. నా డబ్బు నా ఇష్టం’ అన్న ధోరణితో కాకుండా ప్రతి నెలా ఒకటో తారీఖున ఇద్దరూ కలిసి చర్చించుకొని.. ఖర్చులు, పొదుపుల విషయాల్లో ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి.. ఓ బడ్జెట్‌ వేసుకుంటే అనవసర ఖర్చుల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే దాంపత్య బంధంలో పొరపచ్ఛాలు రావడానికి ఇలాంటి అనవసర ఖర్చులూ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకుంటే అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా కూడా జాగ్రత్తపడచ్చు.

మాట జారద్దు!

అన్ని కుటుంబాల్లో భార్యాభర్తలిద్దరూ పని చేయాలని లేదు.. కొన్ని జంటల్లో ఒక్కరే సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించచ్చు. అలాంటి పరిస్థితిలో సంపాదించేవారు తమ భాగస్వామిని చులకనగా చూడడం, ‘నువ్వు దేనికీ పనికి రావు.. రూపాయి సంపాదించడం చేతకాదు’ అని నిందించడం సరికాదు.. ఇలా ఒక్కసారి మాట జారితే తిరిగి వెనక్కి తీసుకోవడం కష్టం. కాబట్టి సంపాదనలో ఎవరి వాటా ఎంతున్నా ఇద్దరూ ఒకరికొకరు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం దాంపత్య బంధంలో కీలకం!

డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య దాపరికాల్లేకుండా ఉండాలంటే మీకు తెలిసిన ఇతర చిట్కాలేవైనా ఉంటే అందరితో పంచుకోండి.. ఇలా మీరిచ్చే సలహాలు మరింతమందికి ఉపయోగపడచ్చు!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్