తైవాన్ మహిళల నవయవ్వన రహస్యాలివిగో!

చాలామందికి 30 దాటగానే చర్మం ముడతలు పడడం, గీతలు ఏర్పడడం.. వంటి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. ఇక వీటిని కవర్‌ చేసుకోవడానికి మేకప్‌ను ఆశ్రయించే వారే ఎక్కువ. ఫలితంగా సహజ సౌందర్యం....

Updated : 14 Jun 2023 13:04 IST

చాలామందికి 30 దాటగానే చర్మం ముడతలు పడడం, గీతలు ఏర్పడడం.. వంటి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. ఇక వీటిని కవర్‌ చేసుకోవడానికి మేకప్‌ను ఆశ్రయించే వారే ఎక్కువ. ఫలితంగా సహజ సౌందర్యం దెబ్బతింటుంది. కానీ తైవాన్‌ మహిళలకు వయసును దాచుకునే పనేలేదు. మేకప్‌ అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే అక్కడ అరవై ఏళ్ల అమ్మమ్మలు కూడా అందమైన అమ్మాయిల్లా కనిపిస్తుంటారు. ఈ వయసులోనూ వారి చర్మం అంత కోమలంగా, ప్రకాశవంతంగా ఉంటుంది మరి! ఇంతకీ, వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందంతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటోన్న ఈ ముద్దుగుమ్మల సౌందర్య రహస్యాలేంటో తెలుసుకుందాం రండి...

ఆ పదార్థాలు వాడరు!

బయట దొరికే సౌందర్య ఉత్పత్తుల తయారీలో జంతు సంబంధిత పదార్థాలు, రసాయనాలు ఉపయోగిస్తుంటారు. నిజానికి ఇవి చర్మానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయి. అందుకే తైవాన్‌లో ఈ తరహా సౌందర్య ఉత్పత్తుల్ని తయారుచేయరట! వాటిని మార్కెట్లోకి విడుదల చేసే ముందు కూడా ప్రయోగశాలలో పరీక్షిస్తారని.. ఇక అక్కడి బ్యూటీ ఉత్పత్తుల తయారీలో చైనీయుల ప్రాచీన సౌందర్య పద్ధతుల్ని మిళితం చేస్తారని అక్కడి నిపుణులు చెబుతున్నారు. అత్యవసర నూనెలు, షియా బటర్‌, వెదురు, హెర్బల్‌ టీలు.. వంటి పూర్తిగా సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన సౌందర్య ఉత్పత్తుల్ని వాడడం.. ఇంట్లో దొరికే పదార్థాలతోనే తమ అందాన్ని సంరక్షించుకోవడం.. ఈ చిట్కాలే అక్కడి మహిళల్ని నవయవ్వనంగా ఉంచుతున్నాయంటున్నారు.

నాలుగంచెల సౌందర్యం!

సౌందర్యంపై శ్రద్ధ పెట్టాలని ఉన్నా.. అంత సమయం ఉండదు చాలామందికి.. కానీ తైవాన్‌ మహిళలు కేవలం నాలుగే నాలుగు దశల్లో.. తక్కువ సమయంలోనే తమ అందాన్ని ద్విగుణీకృతం చేసుకుంటారట!

క్లెన్సింగ్ - ఇందులో భాగంగా.. చర్మంపై పేరుకున్న దుమ్ము-ధూళి, చెమట, జిడ్డుదనాన్ని తొలగించుకోవడానికి సహజసిద్ధమైన క్లెన్సర్లను ఉపయోగిస్తుంటారు. సోయా పాలు, వైట్‌ టీ, వెదురు ఎక్స్‌ట్రాక్ట్స్‌తో ముందు తమ చర్మాన్ని శుభ్రం చేసుకుంటారు.

టోనింగ్ - ఇక రెండో దశలో.. టీట్రీ ఆయిల్‌, హైఅల్యురోనికామ్లం, మొక్కల ఎక్స్‌ట్రాక్ట్స్‌.. వంటి వాటితో టోనింగ్‌ చేసుకుంటారు. ఇది పిగ్మెంటేషన్‌ సమస్యకు చెక్‌ పెట్టడంతో పాటు చర్మంలో సీబమ్‌ ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా చర్మం తాజాగా మారుతుంది.

మాయిశ్చరైజింగ్ - చర్మం ఎంత తేమగా ఉంటే అందం అంతగా ఇనుమడిస్తుంది. ఈ క్రమంలో చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేయడం చాలా ముఖ్యం. తైవాన్‌ మహిళల తరిగిపోని అందానికీ ఇదే కారణమంటున్నారు నిపుణులు. చైనాలో విరివిగా దొరికే మూలికలు, అక్కడి వృక్ష సంబంధిత పదార్థాలతో తయారుచేసిన మాయిశ్చరైజర్స్‌ని వారు రోజూ ఉపయోగిస్తుంటారట! దీంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం ఎక్కువగా ఉన్న పదార్థాల్ని తినడం.. ఇవన్నీ అక్కడి మహిళలు క్రమం తప్పకుండా పాటిస్తుంటారట!

షీట్‌ మాస్క్ - తైవాన్‌ మహిళల బ్యూటీ రొటీన్‌ షీట్‌మాస్క్‌తోనే పూర్తవుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కాటన్‌ లేదా సెల్యులోజ్‌.. వంటి మొక్కల ఆధారిత పదార్థాలతో తయారుచేసిన షీట్‌మాస్క్‌లను పావుగంట పాటు ముఖంపై వేసుకొని సేదదీరుతారట! ఆపై వాటిని తొలగించుకొని తక్షణ మెరుపును, శాశ్వత సౌందర్యాన్ని సొంతం చేసుకుంటున్నట్లు అక్కడి మహిళలు చెబుతున్నారు.

గువా షాతో.. ఇన్‌స్టంట్‌ అందం!

గువా షా.. క్వార్ట్జ్‌ లేదా జేడ్‌ రాయితో తయారుచేసిన ఈ సహజసిద్ధమైన గ్యాడ్జెట్‌ను ప్రస్తుతం ప్రపంచమంతా వినియోగిస్తోంది. అయితే నిజానికి ఇది పుట్టింది చైనాలోనే. ప్రాచీన కాలం నుంచే అక్కడి మహిళలు దీన్ని ఉపయోగిస్తున్నారు. తైవాన్‌ మహిళల సౌందర్య రహస్యమూ ఇదే! కోమలంగా, సున్నితంగా ఉండే ఈ రాయితో ముఖం, మెడపై మర్దన చేసుకోవడం వల్ల.. ఆయా భాగాల్లో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే గువా షాతో మర్దన చేసుకోవడం వల్ల మనం ఉపయోగించే సౌందర్య ఉత్పత్తుల్ని చర్మం సులభంగా గ్రహించగలుగుతుందట! తద్వారా ఇన్‌స్టంట్‌ అందాన్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు తైవాన్‌ ముద్దుగుమ్మలు.

ఆహారం.. వ్యాయామం!

ప్రొటీన్‌లో ఉండే అమైనో ఆమ్లాలు చర్మంలో కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ప్రయోజనాల్ని పొందడానికే తైవాన్‌ మహిళలు ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని తమ మెనూలో చేర్చుకుంటారు. ముఖ్యంగా పుట్టగొడుగులు, బ్లాక్‌ రైస్‌, సముద్రపు నాచు, నల్ల నువ్వులు, మచా టీ, గోజీ బెర్రీస్‌, ఎరుపు రంగు డేట్స్‌.. వంటివి వారి రోజువారీ ఆహారంలో తప్పకుండా ఉంటాయట! అంతేకాదు.. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం కూడా తమ సౌందర్య రహస్యంలో భాగమే అంటున్నారు తైవాన్‌ భామలు.

జుట్టుకు పోషణ..!

వివిధ రకాల జుట్టు సమస్యల్ని తగ్గించుకోవడానికి హెయిర్‌ స్ప్రేలు, షాంపూలు వాడడం మనలో చాలామందికి అలవాటు! కానీ ఎలాంటి జుట్టు సమస్యనైనా సహజసిద్ధమైన పదార్థాలతోనే తగ్గించుకుంటామంటున్నారు తైవాన్‌ మహిళలు. అల్లంతో ప్రత్యేక పద్ధతుల్లో తయారుచేసిన షాంపూ, పెర్ల్‌ పౌడర్‌-రోజ్‌ వాటర్‌ కలిపి తయారుచేసిన హెయిర్‌ మాస్క్‌.. వంటివి వారు ఎక్కువగా ఉపయోగిస్తుంటారట! ఇవి కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగుపరచడంతో పాటు చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తాయంటున్నారు నిపుణులు.

వీటితో పాటు రోజూ సన్‌స్క్రీన్‌ లోషన్‌ అప్లై చేసుకోవడం, ఒత్తిడి-ఆందోళనల్ని అదుపు చేసుకోవడం, స్వీయ ప్రేమ.. వంటివన్నీ వయసు పెరుగుతున్నా తైవాన్‌ మహిళల్ని నవయవ్వనంగా ఉంచుతున్నాయట!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని