Updated : 17/08/2021 12:44 IST

వానాకాలంలో ఫ్లోర్ ఇలా శుభ్రం చేద్దాం..!

ఓ పక్క వర్షాకాలం.. మరోపక్క కరోనా భయంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తమవుతున్నారు. ఇక దీనికి తోడు బయటి నుంచి ఇంటికొచ్చే వాళ్ల ద్వారా బురద, క్రిములు.. వంటివన్నీ ఇంట్లోకి చేరతాయి. అందులోనూ గచ్చుపై అంటుకున్న మురికి, మరకలు ఓ పట్టాన వదలవు. అలాగని వాటిని వదిలేసి చేజేతులా అనారోగ్యాలు కొనితెచ్చుకోలేం. కాబట్టి ఈ వర్షాకాలంలో ఇంట్లోని ఫ్లోర్‌ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిందే! తద్వారా ఇంటిని క్రిమి రహితంగా ఉంచుకోవచ్చు.. మరోవైపు కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.. అందుకోసం ఏం చేయాలో చూద్దాం రండి..

 

తేమ పీల్చుకోకుండా..

వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. పైగా తరచూ వర్షాలు కురుస్తూ ఉంటాయి. దీంతో ఫ్లోర్ కాస్త చెమ్మగా మారుతుంది. సోప్‌స్టోన్, గ్రానైట్ తరహా ఫ్లోర్ అయితే ఈ విషయంలో కాస్త జాగ్రత్త పాటించాల్సిందే. ఎందుకంటే వీటికి తేమను పీల్చుకొనే గుణం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏదైనా మరక అయితే అది వెంటనే గట్టిపడిపోతుంది. ఇక దాన్ని వదిలించడం కాస్త కష్టమవుతుంది. అందుకే వాటిపై మార్బుల్ సీలర్ వేయడం మంచిది. ద్రవరూపంలో ఉండే దీన్ని మెత్తటి పెయింట్ బ్రష్ లేదా శుభ్రమైన వస్త్రం సాయంతో అప్త్లె చేస్తే సరిపోతుంది. అలాగని ఇది బాగా ఖరీదైనదనుకొంటే పొరపాటే. తక్కువ ధరలోనే ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. లేదా ఫ్లోర్ పాలిషింగ్ చేయించడం ద్వారా కూడా తేమను పీల్చుకొనే గుణాన్ని తగ్గించవచ్చు.

వేడినీటితో..

వర్షాకాలంలో రోడ్ల పైకి చేరే మురుగు నీటి కారణంగా హానికారక క్రిములు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే వాటిని అరికట్టే విధంగా మనం గచ్చుని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అప్పుడప్పుడూ ఫ్లోర్‌ని వేడినీటితో శుభ్రం చేయాలి. ఆ తర్వాత నూలు వస్త్రం లేదా స్పాంజ్‌తో తుడిస్తే సరిపోతుంది. దీనికోసం ఫ్లోర్ క్లీనర్లను సైతం ఉపయోగించవచ్చు. సాధారణమైన లేదా టైల్స్ ఉన్న ఫ్లోర్ విషయంలో ఈ రెండు చిట్కాలను పాటించవచ్చు. అదే మార్బుల్ ఫ్లోర్ అయినట్త్లెతే.. వాటిని శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా తయారుచేసిన మార్బుల్ ఫ్లోర్ క్లీనర్లు ఉపయోగించడం మంచిది. వీటివల్ల అవి పాడవకుండా ఉంటాయి. అలాగే వెనిగర్, నిమ్మ, అమ్మోనియా వంటి వాటిని మార్బుల్ ఫ్లోర్ శుభ్రం చేయడానికి ఉపయోగించకపోవడమే మంచిదని గుర్తుంచుకోండి.

కిచెన్‌లో ఇలా..

ఇంట్లో మిగిలిన గదులన్నింటిలోనూ నేలను శుభ్రం చేయడం ఒకెత్తయితే.. కిచెన్‌లో ఫ్లోర్‌ను శుభ్రం చేయడం మరో ఎత్తు. వంట చేసేటప్పుడు చిందే నూనె కారణంగా అక్కడ జిడ్డుగా తయారవుతుంది. కాబట్టి దీన్ని శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీనికోసం పావు బకెట్ వేడినీళ్లలో అరకప్పు వెనిగర్ వేసి మిశ్రమంగా తయారుచేయాలి. దీనిలో మాప్‌ను ముంచి నేలను శుభ్రం చేయాలి. ఆపై పొడి వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది. వంట చేసేటప్పుడు పొరపాటున నూనె కిందపడిపోతే దానిపై పేపర్ టవల్‌ని వేయాలి. ఇది నూనెను పీల్చేస్తుంది. ఆ తర్వాత మెత్తటి వస్త్రాన్ని ఫ్లోర్ క్లీనర్‌లో ముంచి తుడిస్తే జిడ్డు త్వరగా వదిలిపోతుంది.

టైల్స్ మధ్య..

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల టైల్స్ మధ్య ఉండే ఖాళీల్లో బూజు మాదిరిగా వస్తూ ఉంటుంది. గాలిలో తేమ అధికంగా ఉండటం వల్ల శిలీంధ్రాలు పెరిగి అది అలా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని తొలగించడానికి బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది. కాస్త బేకింగ్ సోడా తీసుకొని దానిలో తగినంత నీరు కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. దాన్ని పాత టూత్‌బ్రష్ సాయంతో టైల్స్ మధ్య రాసి కాసేపు రుద్దాలి. ఆ తర్వాత నీటితో కడిగేస్తే.. ఫ్లోర్‌పై శిలీంధ్రాలు పెరగకుండా ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని