Arranged Marriage: ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ అంశంలో ఎలాంటి తప్పటడుగు వేసినా జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లంటే ఇద్దరి మనసులు మాత్రమే కాదు.. ఇద్దరి అభిరుచులు, వ్యక్తిత్వాలు కలవాల్సి...

Updated : 01 Jun 2023 19:41 IST

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ అంశంలో ఎలాంటి తప్పటడుగు వేసినా జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెళ్లంటే ఇద్దరి మనసులు మాత్రమే కాదు.. ఇద్దరి అభిరుచులు, వ్యక్తిత్వాలు కలవాల్సి ఉంటుంది. అలాగే ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం ఉండాలి. ప్రేమ వివాహంలో పెళ్లికి ముందే ఒకరిపై ఒకరికి పూర్తి అవగాహన ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి, పెళ్లి విషయంలో సులభంగా నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. కానీ, పెద్దలు కుదిర్చిన వివాహంలో ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉండదు. కానీ సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో లభించిన కొద్ది సమయంలోనైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మరి, అవేంటో తెలుసుకుందామా...

మీకేం కావాలి?

జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో అవతలి వ్యక్తి అభిప్రాయాలు, ఆలోచనలు ఎంత ముఖ్యమో మీ అభిప్రాయాలు, ఆలోచనలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి, ముందుగా మీ లక్ష్యాలు, ఆలోచనలపై ఒక స్పష్టతకు రావడం అవసరం. మీకంటూ ఒక స్పష్టత వచ్చిన తర్వాత అవతలి వ్యక్తితో అవి సరితూగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ఒకవేళ మీకు అవి ఆమోదయోగ్యంగా లేకపోతే ముందుగానే ఆ సంబంధం వద్దనుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

అందమా? వ్యక్తిత్వమా?

జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో అందానికి ప్రాధాన్యం ఇవ్వాలా? వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలా? అనే ప్రశ్న చాలామందికి ఎదురవుతుంటుంది. బయటికి వ్యక్తిత్వమే అని చెప్పినా చాలామందిలో ఈ సందేహం ఉంటుందని అంటున్నారు నిపుణులు. అయితే అనుబంధంలో అందానికి కూడా ప్రాధాన్యం ఉంటుంది.  అలాగని దీర్ఘకాలం కలిసి జీవించాలంటే అందం ఒక్కటే సరిపోదు. ఈ క్రమంలో- కేవలం పై పై అందాలు మాత్రమే చూడడం కాకుండా కాబోయే భాగస్వామి వ్యక్తిత్వం, గుణగణాలకు సైతం అధిక ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

వెనక్కి తగ్గద్దు...

కుటుంబ సభ్యులు ఒత్తిడి తెస్తున్నారనో, వయసు పెరిగిపోతుందేమోనని కొంతమంది పెళ్లి విషయంలో రాజీ పడుతుంటారు. ఇలా రాజీపడడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల పెళ్లి తర్వాత మీ లక్ష్యాలను చేరుకునే విషయంలో అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి, పెళ్లి చేసుకునే క్రమంలో మీ లక్ష్యాలు, ఆలోచనల విషయంలో వెనకడుగు వేయద్దని సూచిస్తున్నారు. అలాగే వీటి గురించి కాబోయే భాగస్వామితో పెళ్లికి ముందే వివరంగా చర్చించాలని చెబుతున్నారు.

ఆ గ్యాప్‌ లేకుండా...

సాధారణంగా ఏ ఇద్దరి మధ్య గొడవ జరిగినా దానికి కమ్యూనికేషన్‌ గ్యాప్‌ కారణమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దంపతులుగా జీవితాంతం గడపాల్సి వచ్చినప్పుడు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. కాబట్టి, ఇద్దరూ ఒకరి భావాలను మరొకరితో స్వేచ్ఛగా పంచుకోగలుగుతున్నారా? అన్న విషయాన్ని గమనించాలంటున్నారు. అలాగే అవతలి వ్యక్తి మీ స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తున్నారా? లేదా అన్న విషయాన్ని కూడా గమనించాలని సూచిస్తున్నారు. దంపతుల మధ్య దాపరికాలు ఉంటే దాంపత్యానికి మంచిది కాదు. మీకు ఏవైనా సమస్యలుంటే ముందుగానే కాబోయే జీవిత భాగస్వామితో చర్చించడం మేలని సూచిస్తున్నారు.

కొంత సమయం తీసుకుని...

ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి, కాబోయే భాగస్వామితో ఒక్కసారి మాట్లాడగానే నిర్ణయానికి రావడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. మీ లక్ష్యాలు, ఆలోచనలు అవతలి వ్యక్తితో సరితూగుతున్నాయా? లేదా? అన్న విషయం తెలుసుకోవడానికి వీలైనంత ఎక్కువగా వారితో మాట్లాడే అవకాశాలను పరిశీలించాలంటున్నారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్